కార్పొరేషన్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే వారిని ఎన్నుకోండి : డి రమాదేవి
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ప్రజల కోసం నిరంతరం పనిచేసే సిపిఎం అభ్యర్థులను రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి పిలుపునిచ్చారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరి 34వ డివిజన్లో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిల్లల మర్రి బాలకృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. మంగళగిరి పట్టణం, రూరల్ గ్రామాల్లోనూ, తాడేపల్లి లోను సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తుందని అన్నారు. అలాంటి పోరాటాలు చేసే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు.

బాలకృష్ణ నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులంతా కమ్యూనిస్టుగా ఉండి చనిపోయిన తర్వాత కూడా శరీరాలను ఆరోగ్యకరమైన సమాజం కోసం దానం చేస్తున్నారని అన్నారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన అభ్యర్థి నిరంతరం ప్రజల్లో ఉంటారని, కార్పొరేటర్ గా ఎన్నుకుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే పరిష్కారం చేసే విధంగా అందుబాటులో ప్రజలకు ఉంటారని వివరించారు. తాడేపల్లి, మంగళగిరి, రూరల్ గ్రామాలలో అనేక రకాల భూముల్లో పేదల చేత ఇల్లు చేయించి ఇళ్ల స్థలాలు సమస్య కొంతవరకు తీర్చగలిగిన పార్టీ సిపిఎం అని స్పష్టం చేశారు. మంగళగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ, సుందరయ్య నగర్, శ్రామిక నగర్, గండాలయ్య పేట, కాజా, ఆత్మకూరు, తాడేపల్లి లో అనేక ప్రాంతాలలో పేదల కోసం కాలనీలా ఏర్పాటు నిర్మాణంలో కమ్యూనిస్టులు చేసిన పాత్ర మరువలేనిది అని అన్నారు. 2007 సంవత్సరం లో జరిగిన భూ పోరాటాల ఫలితంగా ఆనాడు కొన్ని కాలనీలు, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కొంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. నిత్యవసర సరుకులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వడ్లు బిల్లులో ఏసి పేద ప్రజలకు పంచడం జరిగిందని అన్నారు. దాని ఫలితంగానే ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అధికారపక్షం సరిగా పని చేయాలంటే ప్రతిపక్షం బలంగా ఉంటే సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయని అన్నారు. చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసి ఉచిత విద్యుత్, నేతన్న సేవ పథకాన్ని సాధించడం జరిగిందని అన్నారు.

ఆ పోరాటంలో బాలకృష్ణ, సోదరుడు నాగేశ్వరరావు ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభిమానించే పార్టీలకు ఓటు చేసుకోవచ్చని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే నిరంతర సేవ చేసే ప్రజాబలం గల అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సిపిఐ సీనియర్ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరావు మాట్లాడుతూ ... చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 16 సంఘాలతో చేనేత సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసిన బాలకృష్ణ ను ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు. అనంతరం రమాదేవి బాలకృష్ణను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం చలపతిరావు, ఎం శివచంద్రరావు, గోలి దుర్గాప్రసాద్, కే వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సిపి నాయకులు షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)