చనిపోయిన, రిటైర్మెంట్ అయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి
ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : చనిపోయిన, రిటైర్మెంట్ అయిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, సిఐటియు నగర కార్యదర్శి ముత్తుజ, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణ, నగర అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, సాకే తిరుమలేష్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు 30 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి వెంటనే ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించకుండా 60 సంవత్సరాలు వచ్చాయనే పేరుతో రిటైర్ చేసిన కార్మికుల కుటుంబాలు కూడా ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంతమంది కార్మికులు చనిపోయి మూడు సంవత్సరాలు గడుస్తున్నా వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఉపాధి కల్పించలేదని, వారు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై మున్సిపల్ కమిషనర్‌కు, స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతోనే రిలే నిరాహార దీక్షలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. అనంతపురం నగర జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచి, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై ఉన్న అధిక పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఇప్పటికే అదనంగా పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి, అవసరమైతే సమ్మెకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలకు మద్దతుగా భగత్ సింగ్ ఆటో యూనియన్ నాయకులు ఎన్టీఆర్ శ్రీనివాసులు, ఆజాం భాష, మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు సురేంద్ర, చంద్రశేఖర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కోశాధికారి లక్ష్మీనరసమ్మ, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి బండారి స్వామి, బంగ్లా రాఘవ, ఇంజనీరింగ్ సెక్షన్ నాయకులు మల్లికార్జున, ఓబుళపతి, రాయుడు, మురళి, సుబ్బిరెడ్డి, లక్ష్మీదేవి, పెన్నా కమల్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)