న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికాకు అప్పగిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై రైతుల ఆగ్రహం మరోసారి తీవ్రమవుతోంది. అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్‌కు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘కిసాన్ బచావో పాదయాత్ర’ను హర్యానా పోలీసులు ఖనౌరీ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. పంజాబ్–హర్యానా సరిహద్దు నుంచి న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వరకు 228 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లాలని రైతులు నిర్ణయించారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో 51 మంది రైతులు పాల్గొంటుండగా, ఖనౌరీ వద్ద పోలీసులు కాంక్రీట్ బారికేడ్లు, ముళ్లకంచెలు, వాటర్ కెనాన్లతో వారిని అడ్డుకున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో రైతులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు.
వాణిజ్య ఒప్పందంపై రైతుల అభ్యంతరం
అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లోకి తక్కువ దిగుమతి సుంకాలతో అనుమతించే ప్రతిపాదనలు దేశీయ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం సబ్సిడీలు అందించే వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధరలకు భారత మార్కెట్లోకి వస్తే చిన్న, మధ్య తరహా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సోయాబీన్ నూనె, పండ్లు, గింజలు, పశువుల మేత తదితర ఉత్పత్తుల దిగుమతుల విషయంలో రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాలు, గోధుమలు, బియ్యం వంటి ఉత్పత్తులను ఒప్పందం నుంచి మినహాయించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీనిపై మరింత స్పష్టత అవసరమని రైతు సంఘాలు అంటున్నాయి. అమెరికన్ కార్పొరేషన్ల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని సామాన్య రైతులను దోపిడీ చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
పలు డిమాండ్లతో నిరసన
వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకతతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టపరమైన హామీ, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సూచించిన C2+50 శాతం ఫార్ములా అమలు, వ్యవసాయ రుణాల మాఫీ, గత రైతు ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణ వంటి న్యాయమైన డిమాండ్లను రైతులు ఆందోళన చేస్తున్నారు. హర్యానా ప్రభుత్వ అధికారులతో మూడు దఫాలు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదని రైతు నాయకులు తెలిపారు. వాణిజ్య ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రాదని పేర్కొంటూ, కేంద్ర వ్యవసాయ మంత్రితో చర్చలకు అవకాశం కల్పించాలని జగ్జిత్ సింగ్ దల్లెవాల్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఖనౌరీ వద్ద నిరసన కొనసాగిస్తామని రైతు నాయకులు స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)