- రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రూబియో ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్న విషయంపై విదేశాంగ శాఖ అధికారులకే స్పష్టత లేదని ఆయన విమర్శించారు. ఆ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని అన్నారు. ఒకవేళ మోడీ కోరుకుంటే తానే వివరిస్తానంటూ ఎక్స్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇటీవల రూబియో పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ పలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారం ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులతో రూబియో సమావేశమవుతారని, ఆ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా పాల్గొంటారని భావిస్తున్నట్లు గోర్ తెలిపారు. దీనిపై స్పందించిన రాహుల్, భారత విదేశాంగ శాఖలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అయితే రూబియో పర్యటనపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో రూబియో భేటీ గురించి అమెరికా రాయబారి వివరాలు వెల్లడించడంపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటి విషయాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించాల్సి ఉండగా, అమెరికా రాయబారి ఎందుకు వెల్లడిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. భారత విదేశాంగ మంత్రి దేశంలో నిర్వహించే సమావేశాల వివరాలను ఇతరులు ప్రకటించడం అసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. రూబియో ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులను కలుస్తారని చెప్పడం ఒకటైతే, ఆ సమావేశానికి జైశంకర్ కూడా వస్తారని అమెరికా రాయబారి ప్రకటించడం మరో విషయమని పేర్కొన్నారు.







కామెంట్లు (0)