- జార్ఖండ్‌లో దారుణ ఘటన
- ఏడుగురు మృతి
- బాధితులంతా మహిళలు, చిన్నారులే
ఛండీగఢ్: జార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొదట ఓ వ్యక్తి స్కూటరుపై వెళ్లుండగా.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు అతనికి సాయం చేయడానికి పరుగులు తీశారు. కొందరు అతడిని కాపాడేందుకు యత్నిస్తుండగా..వారితో పాటు వెళ్లిన మహిళలు, చిన్నారులు రోడ్డు పక్కన నిలబడి గమనిస్తున్నారు. ఇదే సమయంలో రోడ్డుపై అతివేగంతో వచ్చిన 18 చక్రాల భారీ ట్రక్కు నిలబడిన వారిపైకి దూసుకెళ్లింది.
ఆ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సాయం కోసం వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక ప్రజానీకాన్ని తీవ్రంగా కలిచివేసింది. జిల్లా అంతటా విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో గురువారం రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కుంతి జిల్లా ఎస్పీ రిషభ్ గార్గ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఆయన ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, హృదయవిదారకమని పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..తొలుత ఓ వ్యక్తి స్కూటర్‌పై వెళ్తూ అదపు తప్పి రోడ్డు పక్కన పొదల్లో పడిపోయాడు. స్థానికులు గమనించి సాయం చేసేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొందరు యువకులు పొదల్లో పడిపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. మరోవైపు మహిళలు, పిల్లలు రోడ్డు పక్కన నిలబడి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని గమనిస్తున్నారు. అదే సమయంలో తోర్ప వైపు నుంచి అతివేగంగా వచ్చిన 18 చక్రాల భారీ వాహనం అక్కడ గుమిగూడిన వారిని ఢీకొట్టింది. ట్రక్కు వేగంగా రావడంతో అక్కడున్న వారికి ప్రమాదాన్ని గుర్తించి పక్కకు తప్పుకునే అవకాశం కూడా దక్కలేదు. వాహనం ఢీకొనడంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. బిర్సా నాయక్ భార్య కసిలా దేవి, కుమార్తె అంజలి కుమారి, ఏడాది వయసున్న మనవడు సౌరభ్ నాయక్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. అలాగే ప్రమాదంలో మరణించిన వారిని కసిలా దేవి, మండు దేవి, అంజలి కుమారి, పాకో దేవి, తుతి కుమారి, గోలు కుమార్, చిన్నారి సౌరభ్ నాయక్‌గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని కుంతి సదర్ ఆసుపత్రి, తోర్ప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్, సహాయకుడు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన 18 చక్రాల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.







కామెంట్లు (0)