సొరంగంలో చిక్కుకున్న 350 మందిని రక్షించిన నేపాల్ సైన్యం
ఖాట్మండు : ఆకస్మిక జలప్రళయానికి గురైన నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం మూడోరోజు గాలింపు చర్యలను నేపాల్ సైన్యం, మృతదేహాల వెలికితీత రెస్క్యూ బృందాలు ముమ్మరం చేశాయి. త్రిశూలి 3ఎ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగంలో చిక్కుకున్న వారిలో 350 మందిని నేపాల్ సైన్యం కాపాడింది. వీరిలో 63 మంది భారతీయులు ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మరో వంద మందిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న ట్లు తెలిపింది. శుక్రవారం నాటికి వరదల్లో 579 మంది మరణించారని నేపాల్ విపత్తుల శాఖ వెల్లడించింది. మరో 1,924 మంది గల్లంతయ్యారని నివేదించింది. గల్లంతైన వారిలో 33 దేశాలకు చెందినవారు ఉన్నట్లు తెలిపింది.
320 మంది భారతీయులు గల్లంతు..
నేపాల్‌లో 320 మంది భారతీయల ఆచూకీ ఇంకా తెలియలేదని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. చైనా వైపు 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని, వారిలో 96 మంది రోడ్డు మార్గంలో సురక్షితంగా నేపాల్‌లోకి ప్రవేశించారని పేర్కొంది. మరో 21 మంది ఇప్పటికే స్వదేశం చేరుకున్నారని తెలిపింది. సురక్షితంగా బయటపడిన వారిని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పరామర్శించారు. టిబెట్‌లో మృతుల సంఖ్య ఐదుకు పెరిగిందని, 558 మంది గల్లంతయ్యారని చైనా అధికారులు శుక్రవారం తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు రసువా నుంచి చిత్వాన్ వరకు నదీ మార్గంలోనే 1200 మంది సైనికులను మోహరించినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 2800 మంది సైనికులు క్షేత్రస్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం వరదల సమయంలో కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన ఒక సరస్సు శుక్రవారం ఒక్కసారిగా ఉప్పొంగడంతో సహాయక చర్యలకు రెండు గంటలపాటు విఘాతం కలిగింది. మిత్రదేశాలు, అంతర్జాతీయ సహాయాన్ని తిరస్కరించడం లేదని, స్థానికంగా అవగాహన ఉన్న సొంత భద్రతా దళాలను ఎక్కువ సంఖ్యలో మోహరించడానికే "ప్రాధాన్యత" ఇస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ శుక్రవారం తెలిపారు. శుక్రవారం నాటికి మొత్తం 4,451 మందిని రక్షించామని నేపాల్ విపత్తు అథారిటీ తెలిపింది. చైనా కూడా సహాయక చర్యలో సుమారు 500 మంది సైనిక, పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది. బుధవారం ప్రమాదం కారణంగా మొత్తంగా సుమారు 90,000 మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారని నేపాల్ అధికారులు అంచనా వేస్తున్నారు.
చైనాలో భూకంపం
చైనాలో భారీ భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్స్ లాంగ్‌చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ (సిఇఎన్‌సి) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్‌చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. గురువారం రాత్రి నేపాల్, టిబెట్‌లోనూ భూకంపాలు సంభవించాయి. భూకంప ప్రభావంతో మరోసారి వరద ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు.








కామెంట్‌లు (0)