ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జి రైలును ప్రారంభించిన మంత్రి అమిత్‌ షా

11 గంటల క్రితం

Minister Amit Shah launches the country's first LNG train.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 04:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గుజరాత్ : దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జి రైలును కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆదివారం గుజరాత్ లోని సబర్మతి రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు. ఈ కొత్త రైలు ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్), డీజిల్ రెండింటి పై నడుస్తుంది. డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతాన్ని ఎల్‌ఎన్‌జి తో భర్తీ చేస్తుంది. డీజిల్ వినియోగం, ఇంధన ఖర్చులు, ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టారు. పచ్చజెండాను ఊపి ఎల్ఎన్జి రైలును ప్రారంభించిన అనంతరం మంత్రి అమిత్ షా సభలో ప్రసంగించారు. దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడి సమూలంగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ తన పాలనలో కుంభకోణాలు తప్ప ఇంకేమీ చేయలేదని విమర్శించారు. మరోవైపు.. గత 12 ఏళ్లలో మోడి పై ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేకపోయారని అన్నారు. అర్థరహితంగా మాట్లాడే హస్తం పార్టీని.. వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చర్చకు రావాలని సవాలు చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. 2014 లో మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రైల్వే వ్యవస్థలో అనేక కొత్త సదుపాయాలను కల్పించి, దానిని ఆధునికీకరించారని తెలిపారు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్, అత్యాధునిక స్టేషన్లకు శ్రీకారం చుట్టారన్నారు. హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా.. ప్రపంచంలో ఆ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్‌ను నిలిపారన్నారు. ముంబయి నుంచి వడోదర వరకు మొట్టమొదటి లాంగ్ డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందన్నారు. 11 వేల కిలోమీటర్ల రైలు కారిడార్‌ను నాలుగు ట్రాక్‌ల నెట్‌వర్క్‌గా మార్చుతున్నామని అమిత్‌ షా తెలిపారు. 2015-16లో రైల్వేలు 293 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగించాయన్నారు. 2024-25 నాటికి అది 108 కోట్ల లీటర్లకు తగ్గిందని తెలిపారు. 2030 నాటికి సున్నాకి తగ్గిస్తామన్నారు. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. 2010-11లో ఏటా కేవలం 75 కి.మీ. మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ జరగగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 7,188 కి.మీ.కి పెరిగిందని వెల్లడించారు. 99.6 శాతం రైల్వే నెట్‌వర్క్‌ విద్యుదీకరణ పూర్తయ్యిందని అమిత్‌ షా తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్