శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓబీసీ క్రీమీ లేయర్‌పై మార్చి తీర్పులో మార్పులేదు

1 రోజు క్రితం

ఓబీసీ క్రీమీ లేయర్‌పై మార్చి తీర్పులో మార్పులేదు
- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

- రెండేళ్ల గడువు కోరిన కేంద్రం అభ్యర్థన తిరస్కరణ

- సివిల్ సర్వీసెస్ 2025 అభ్యర్థులకూ కొత్త నిబంధనే

న్యూఢిల్లీ: ఒబిసి క్రీమీ లేయర్ నిర్ధారణపై మార్చి 11న ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉంటున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. తీర్పు అమలుకు సహేతుకమైన సమయంగా రెండేళ్లు కావాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించలేదు.

కేంద్రం కోరిందేమిటి?

క్రీమీ లేయర్ హోదాను నిర్ణయించేందుకు సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ పోస్టులు, ప్రభుత్వ రంగ సంస్థల (పిఎస్‌యూ) పోస్టుల మధ్య సమానత్వాన్ని నిర్ణయించాల్సి ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది. అలాగే సముచితమైన, ఏకరూప విధానాన్ని రూపొందించేందుకు రెండేళ్లు అవసరమని విన్నవించింది. తీర్పును సమీక్షించాలని లేదా మార్చాలని తాము కోరడం లేదని, వెనుకటి తేదీ నుంచి అమలు చేయడంలో ఆచరణాత్మక ఇబ్బందులున్నాయని మాత్రమే చెబుతున్నామని కేంద్రం వివరించింది.

వాయిదా సమర్థనీయం కాదు..

2025 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు మార్చి 6న వెలువడినా, ఎంపికైన అభ్యర్థులకు ఇంతవరకు సర్వీసులు కేటాయించలేదని ధర్మాసనం గుర్తుచేసింది. కేటాయింపు ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున, మార్చి 11 తీర్పు అమలును వాయిదా వేయడం సమర్థనీయం కాదని పేర్కొంది. ఆ తీర్పులో చెప్పిన క్రీమీ లేయర్ సూత్రాన్ని 2025 సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా ఎంపికైన ఒబిసి అభ్యర్థులకు సర్వీసులు కేటాయించేటప్పుడు వర్తింపజేయాలని ఆదేశించింది. మార్చి నాటి తీర్పులో నమోదైన సిబ్బంది, శిక్షణ విభాగం (డిఒపిటి) హామీని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ కేసులో పక్షాలుగా ఉన్న, క్రీమీయేతర ప్రమాణాలను నెరవేర్చిన, అన్ని అర్హతలూ ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే, వారిని సర్దుబాటు చేసేందుకు అనుబంధ పోస్టులను సృష్టిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికే పూర్తయిన నియామకాలను తిరిగి పరిశీలించబోమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టులు, ఇతర అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు గడువును ఎనిమిది వారాల పాటు పొడిగించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ 21వ నివేదికలో డిఒపిటి వైఖరిని నమోదు చేశారు.

మార్చి 11 తీర్పులో ఏముంది?

ఈ తీర్పు 'యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్‌ రోహిత్ నాథన్' కేసుకు సంబంధించినది. క్రీమీ లేయర్ హోదా నిర్ణయంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను, పిఎస్‌యు ఉద్యోగుల పిల్లలను వేరుగా చూడటం వివక్షే అవుతుందని ఆ తీర్పు పేర్కొంది. ఒబిసి రిజర్వేషన్ ప్రయోజనాలను నిరాకరించేందుకు తల్లిదండ్రుల ఆదాయాన్ని యాంత్రికంగా లెక్కించలేమని స్పష్టం చేసింది. కేవలం ఆదాయమే కాకుండా సామాజిక హోదాను ప్రాతిపదికగా తీసుకుని మినహాయింపు ఉండాలని చెప్పింది.

యుపిఎస్‌సి-2025 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను మార్చి 6న ప్రకటించి, ఐఎఎస్, ఐపిఎస్ సహా కేంద్ర సర్వీసులకు 958 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు క్రీమీ లేయర్ తీర్పును దానికి ఐదు రోజుల తర్వాత, మార్చి 11న వెలువరించింది. సర్వీస్ కేటాయింపు ఇంకా జరగకపోవడంతో కేంద్రం ఈ అంశంపై స్పష్టత కోరింది. తీర్పును అమలు చేసేందుకు కోర్టు ఆరు నెలల సమయం ఇచ్చినప్పటికీ, కేంద్రం ఆగస్టు చివరిలోనే తన అభ్యర్థన దాఖలు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్