మీ వైఖరి అత్యంత విచారకరం
రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం
నివేదికలు ఇవ్వకుంటే సిఎస్‌లను కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ : జైళ్లలో ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు సంబంధించిన ఓ కేసులో కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇవ్వనందుకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల వైఖరి దురద ష్టకరం, అత్యంత విచారకరమని వ్యాఖ్యానించింది. కారాగారాల్లో కుల వివక్షను అంతమొందించేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయడంలో రాష్ట్రాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయని, స్పందించడం లేదని తప్పుపట్టింది. జస్టిస్ జెబి పార్ధివాలా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ రాష్ట్రాల అలసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. జైలు నిబంధనల నుంచి కుల ఆధారిత పని విభజన, ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచడం వంటి వివక్షాపూరిత విధానాలను తొలగించి, నివేదికలు సమర్పించడానికి రాష్ట్రాలకు చివరి అవకాశాన్ని ఇస్తున్నానని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సమయానికి నివేదికలను సమర్పించని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు పంపి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తామని హెచ్చరించింది. రాష్ట్రాలు తమ పరిధిలోని డేటాను అందజేయకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించలేకపోతోందని, దీనివల్ల మొత్తం పర్యవేక్షణ ప్రక్రియే నిలిచిపోతోందని అసహనం వ్యక్తం చేసింది.
పాత్రికేయురాలు సుకన్య శాంత దాఖలు చేసిన పిటిషన్‌పై 2024 అక్టోబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. జైళ్లలో ఖైదీలకు వారి కులాన్ని బట్టి వంట చేయడం, శుభ్రం చేయడం వంటి పనులను కేటాయించడం రాజ్యాంగంలోని 14, 15, 17, 21 అధికరణలను ఉల్లంఘించడమే అవుతుందని తేల్చి చెప్పింది. ఇలాంటి వివక్షాపూరిత నిబంధనలను తొలగించి నివేదికలను అందజేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయినప్పటికీ రాష్ట్రాలు ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది.







కామెంట్‌లు (0)