- గత పదేళ్లలో రూ.668 కోట్ల విరాళాల అందజేత
- ది న్యూస్ మినిట్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను రిజిస్టర్ చేయాలనే డిమాండ్లను ఆ సంస్థ పదేపదే తిరస్కరిస్తూ ఉంటుంది. ఇందుకు వివరణగా ఆ సంస్థ నాయకులు చెప్పే ప్రధాన కారణాల్లో ‘ప్రభుత్వం నుండి నిధులు కోరే వారికి మాత్రమే నమోదు అవసరం, మేం ప్రభుత్వం నుంచి నిధులు, విరాళాలు తీసుకోం. కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్‌కు చట్టపరంగా నమోదు అవసరం లేదు’ అనేది ఒకటి. ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గురుదక్షిణ రూపంలో ఇచ్చే పన్ను రహిత విరాళాలతోనే మనుగడ సాగిస్తుందని కూడా ఈ సంస్థ నాయకులు చెబుతుంటారు. ఈ ‘గురుదక్షిణ’ వివరాలను వారు వెల్లడించరు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ వనరుల ద్వారా నిధులను సమీకరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జిసి) నుంచి గత పదేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన, అనుబంధంగా ఉన్న 20 సంస్థలు సుమారు రూ. 668 కోట్ల విరాళాలను అందుకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ వార్త సంస్థ ది న్యూస్ మినిట్ (టిఎన్‌ఎం) సేకరించింది. ఈ వివరాలతో ఆదివారం ఒక నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం ఓఎన్‌జిసి ఈ విరాళాలను తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) నిధుల నుండి అందించింది. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలకు 2013 నుంచే నిధులను ఇవ్వడాన్ని ఓఎన్‌జిసి ప్రారంభించినా, 2015 నుంచి భారీగా ఇవ్వడం ప్రారంభించింది. అంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ఎక్కువైంది.
టిఎన్‌ఎం నివేదిక ప్రకారం ... 2015 మొదటి త్రైమాసికం నుండి 2025 మొదటి త్రైమాసికం వరకు ఓఎన్‌జిసి దేశవ్యాప్తంగా 2,000కు పైగా సంస్థలు, ప్రాజెక్టులకు రూ. 4,531 కోట్లు విరాళంగా ఇచ్చిందని ఆ సంస్థ సిఎస్ఆర్ వార్షిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తంలో, 14.7 శాతం కంటే కొంచెం ఎక్కువ లేదా రూ. 668.01 కోట్లు, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్న 20 సంస్థలకు వెళ్లాయి. కోటి రూపాయల కంటే తక్కువ నిధులు అందుకున్న సంఘ్ అనుబంధ సంస్థలను నివేదికలో వెల్లడించలేదని టిఎన్‌ఎం తెలిపింది.
ఆర్‌ఎస్‌స్‌కు చెందిన వాటిగా గుర్తించిన 20 సంస్థలను మూడు వర్గాలుగా టిఎన్‌ఎం విభజించింది. ఈ విభజన ప్రకారం ఈ 20 సంస్థలో తొమ్మిది నేరుగా సంఘ్‌కు అనుబంధంగా ఉన్నాయి. మరో తొమ్మిది సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్న వ్యక్తులు ప్రారంభించారు లేదా వారు నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు సంస్థలు సంఘ్‌తో కలిసి పనిచేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సంస్థలకు విరాళాలు ఇవ్వడంపై వివరణ కోసం ఓఎన్‌జిసిని సంప్రదించామని, ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని టిఎన్‌ఎం తన నివేదికలో పేర్కొంది.








కామెంట్‌లు (0)