లక్నో : 2018నాటి పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఎంపి/ఎమ్మెల్యే కోర్టు సోమవారం రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసును సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జడ్జి జస్టిస్ శుభం వర్మ కొట్టివేశారు’’ అని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం చైర్మన్ కున్వర్ సింగ్ నిషాద్ తెలిపారు.
2023లో రాహుల్‌గాంధీ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. ఈ కేసులో అక్టోబర్ 13న తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టు గతంలో ప్రకటించింది. అనంతరం ఆ తేదీని అక్టోబర్ 26కి మార్చింది.
ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన సోమవారం ఉదయం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం సుల్తాన్‌పూర్ బయలుదేరారు. సుల్తాన్ పూర్ వెళుతుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదం నుండి రాహుల్ తృటిలో తప్పించుకున్నారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల్లో ఒకటి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకనున్న వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.







కామెంట్‌లు (0)