న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఇండియా బ్లాక్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇండియా బ్లాక్ నిరసన సమయంలో ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించారంటూ రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో కనీసం 10 మంది ఎంపిలు సహా పలువురు ముఖ్యమైన నేతల పేర్లను చేర్చారని ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు బుధవారం మీడియాకు తెలిపారు. నేరపూరిత అతిక్రమణ ఆరోపణల కింద కేసు నమోదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ర్యాలీ సమయంలో ఈసిఐ వైపు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ బారికేడ్లను ఛేదించుకుని నిరసనకారులు ముందుకు సాగారని, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఆకాశవాణి భవన్ ప్రాంగంణంలోకి చేరుకున్నారని, అక్కడ కొన్ని గంటలపాటు బైఠాయించారని అన్నారు. ఆకాశవాణి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. మంగళవారం చేపట్టిన ఇండియా బ్లాక్ ర్యాలీకి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుండి ఎటువంటి అనుమతి కోరలేదని పోలీసులు తెలిపారు. దీంతో ర్యాలీకి అనుమతి లేదని, మరోవైపు న్యూఢిల్లీలో భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని అన్నారు. పార్లమెంటు నుండి భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) కార్యాలయం వైపుగా ఇండియా బ్లాక్ మంగళవారం నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. 10 మంది ఎంపిలు సహా సుమారు 260 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే రాహుల్ గాంధీ బలవంతంగా ఆ ప్రాంగణంలోకి ప్రవేశించారన్న ఆరోపణను కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ మసూద్ తోసిపుచ్చారు. ఆయనతో పాటు ఇతర ఎంపిలు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి దేశానికి చెందినవే తప్ప ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని అన్నారు. అలాగే ప్రతిపక్షాలు అధికారులను కలిసే అవకాశాన్ని కూడా నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌కు ప్రతిపక్షాలు భయపడబోవని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)