రాడ్లు, కర్రలతో విధ్వంసం
ముగ్గురు అరెస్టు
అహ్మదాబాద్: బిజెపి ఏలుబడిలోని గుజరాత్‌లో బహిరంగంగా పుస్తకం చదవడాన్ని కూడా సంఘ్‌పరివార్ శక్తులు సహించలేక పోతున్నాయి. గురువారం స్టూడెంట్ అండ్ యూత్ కలెక్టివ్ అహ్మదాబాద్ (ఎస్‌వైసిఎ), గుజరాత్ రీడ్స్ ఎనీవే (జిఆర్‌ఎ) ఆధ్వర్యంలో బృందం సమావేశమైంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ రాసిన ‘‘ఐ యామ్ మలాలా’’, యాన్ ఫ్రాంక్ రచించిన ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ సహా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రశంసలు పొందిన భగత్ సింగ్, అంబేద్కర్ పుస్తకాలు చదివే కార్యక్రమాన్ని నిర్వహిం చారు . ఈ పుస్తకాలను చదవడాన్ని వ్యతిరేకి స్తూ సంఘ్‌పరివార్ మూక శుక్రవారం దాడికి పాల్పడింది.
అసలేం జరిగింది?
గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌లో వస్త్రాపూర్ గార్డెన్‌లో పలువురు పుస్తక ప్రేమికులు, ఎస్‌వైసిఎ, జిఆర్‌ఎ సంఘాల నాయకులు ప్రముఖ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఆత్మకథను గ్రూప్ స్టడీ చేశారు. అయితే, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) గూండాలు ఆయుధాలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మలాలా పుస్తకాన్ని ఎందుకు చదువుతున్నారని వారితో వాగ్వివాదానికి దిగారు. అంతేకాకుండా కర్రలతో వారిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చెప్పిన దాని ప్రకారం, ఆ గుంపు రెచ్చగొట్టే మతపరమైన నినాదాలు చేసింది. “జై శ్రీరామ్” నినాదాలు చేస్తూ రెచ్చగొట్టింది. అంతేకాకుండా, పఠనం చేస్తున్నవారిని “కాశ్మీర్ వ్యతిరేకులు” అని గందరగోళం సృష్టించిందని బాధితులు తెలిపారు. ఈ మూక బేస్‌బాల్ బ్యాట్‌లు, రాడ్లు, కర్రలు, కాషాయ జెండాలతో ఆయుధాలు ధరించి వచ్చి దాడి చేశారని బాధితులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం, సంఘ్ పరివార్ సంస్థల నిరసనల నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల తన తప్పనిసరి పఠన జాబితా నుంచి మలాలా, అన్నే ఫ్రాంక్ రాసిన పుస్తకాలను తొలగించాల్సి వచ్చింది. అయితే, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో , ముగ్గురిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.








కామెంట్‌లు (0)