శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల హక్కుల కోసం పోరాడితే వేధింపులా : సోనమ్‌ వాంగ్‌చుక్‌

4 గంటల క్రితం

Wangchuk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 04:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లేహ్‌ : లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి సరిహద్దు ప్రాంతాల ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న తనను లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ వేధిస్తున్నారని పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయానికి, తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి మధ్య సంబంధాలను సూచిస్తున్నట్లు భావిస్తున్న ఓ ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌ను శనివారం ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. లడఖ్‌లో ఎల్‌జీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతూ ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. గత ఆరేళ్లుగా లడఖ్‌ ప్రజలకు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా హక్కులు, ప్రజాస్వామ్యం అందుబాటులో లేవని వాంగ్‌చుక్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో చిన్న వ్యాఖ్యలు, లైక్‌లు చేసినా ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. సరిహద్దు ప్రాంతాల యువత, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నందుకు తనను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. తమ పాఠశాలలను కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలనా యంత్రాంగం అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.

అక్టోబర్‌ 10, 11 తేదీల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఒక మీడియా కార్యక్రమంలో సక్సేనా తన పర్యావరణ పరిరక్షణ కృషి, అర్హతలను ప్రశ్నించారని వాంగ్‌చుక్‌ తెలిపారు. లడఖ్‌ వాతావరణం, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఏమిటని సక్సేనా ప్రశ్నించగా, తన సమాధానాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. లడఖ్‌లో నిర్మిస్తున్న రాతి చెక్‌డ్యామ్‌లు సిమెంట్‌, కాంక్రీట్‌, ఉక్కు వినియోగం లేకుండా పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నట్లు సక్సేనా పేర్కొన్నారని వాంగ్‌చుక్‌ తెలిపారు. అయితే స్థానిక ప్రజలు వాటిని ఇష్టపడటం లేదని చెప్పారు. సింధు నది, దాని ఉపనదులపై నిర్మిస్తున్న ఈ చెక్‌డ్యామ్‌లు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రోత్సహిస్తున్న ‘సింధు జల్‌ సమృద్ధి అభియాన్‌’లో భాగమని తెలిపారు. దీంతో భవిష్యత్తులో పర్యావరణ విపత్తు సంభవించే ప్రమాదముందని తాను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. రాతి ఆనకట్టల ప్రతిపాదనను వ్యతిరేకించడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని, వాటికి సంబంధించిన సోషల్‌ మీడియా పోస్టులను గుర్తించినట్లు వాంగ్‌చుక్‌ తెలిపారు. వాటిని నిర్వహిస్తున్న క్రియేటివ్‌ ఏజెన్సీ ప్రతినిధులను తన న్యాయవాదులు సంప్రదించారని పేర్కొన్నారు. తన న్యాయవాదికి, ఏజెన్సీ ప్రతినిధిగా భావిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ రికార్డింగ్‌ను ఆయన విడుదల చేశారు. అందులో ‘మీరు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బృందం నుంచేనా?’ అని ప్రశ్నించినట్లు వినిపిస్తోందని అన్నారు. ఈ సంభాషణ తనపై జరుగుతున్న దుష్ప్రచారంలో పాలనా యంత్రాంగం ప్రమేయం ఉందన్న ఆరోపణకు ఆధారమని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. జాతీయ వనరులను ఇటువంటి కార్యకలాపాలకు వినియోగించడం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హోదాకు తగదని విమర్శించారు.

మద్యం విధానంపై అభ్యంతరాలు

లడఖ్‌లో భూమి, పర్యాటకం, విద్యుత్‌ రంగాలకు సంబంధించిన విధానాలు కార్పొరేటీకరణకు అనుకూలంగా ఉన్నాయని వాంగ్‌చుక్‌ రాష్ట్రపతికి తెలిపారు. ప్రతి గ్రామంలో మద్యం బార్లను ప్రోత్సహించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. బార్‌ ప్రారంభించేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసీ) సంఖ్యను 16 నుంచి ఆరుకు తగ్గించారని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్స్‌ (హెచ్‌ఐఎఎల్‌) ఆధ్వర్యంలో ఫ్యాంగ్‌లో నిర్వహిస్తున్న డెసర్ట్‌ ఫ్లవర్‌ స్కూల్‌ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడే వరకు తదుపరి కార్యకలాపాలను నిలిపివేయాలని నవంబర్‌ 1న హెచ్‌ఐఎఎల్‌కు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కోరుతున్న అనుమతులపై వాంగ్‌చుక్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాఠశాల నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పార్లమెంటరీ విద్యా స్థాయీ సంఘం సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ సహా సరిహద్దు ప్రాంతాల ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల పౌరులతో సమానమైన ప్రజాస్వామ్య హక్కులు పొందేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వాంగ్‌చుక్‌ కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్