సాధారణ పన్ను చెల్లింపుదారుల సొమ్ము దోచిపెట్టొద్దు
జి గ్రూప్ క్లెయిములపై ఎన్‌సిఎల్‌టి పక్షపాత నిర్ణయం
సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : సాధారణ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు బహుమతులు ఇవ్వడం ఆపాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జి గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుభాష్ చంద్రకు సంబంధించిన రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు గాను, కేవలం రూ. 6.5 కోట్లను తిరిగి చెల్లించే ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఆమోదం తెలపడం నిష్పక్షపాత న్యాయ సూత్రాలను అపహాస్యం చేయడమేనని విమర్శించింది. ‘సుభాష్ చంద్రకు బిజెపి, సంఘ్ పరివార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఈ ఉత్తర్వు ట్రిబ్యునల్ వర్గ పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనం. పక్షపాతానికి వ్యతిరేకంగా పాలన ఉండాలనే ప్రధాన న్యాయ సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. ఈ అసంబద్ధమైన సందర్భంలో, రుణదాతలు 99.97 శాతం నష్టాన్ని చవిచూడనున్నారు; రూ 1,322.39 కోట్ల క్లెయిమ్‌తో ఉన్న ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సెటిల్‌మెంట్‌ను కేవలం 0.028 శాతం, అంటే రూ.38 లక్షల చెల్లింపుతో ఆమోదించారు. పెద్ద కార్పొరేషన్లు పదేపదే భారీ మొత్తంలో ప్రజాధనాన్ని దోచుకోవ డానికి అనుమతించే నిర్ణయాలను ట్రిబ్యునల్ చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. కేంద్రప్రభుత్వం భారీ రుణాలను ఇప్పించడంతో పాటు ఉద్దేశపూర్వక ఎగుమతి దారులను అనుమతించి, ఊహించని లాభాలు ఆర్జించేలా చేస్తోంది. ఆ తరువాత కొన్నేళ్లకు ప్రస్తుత కేసులో వలె ఎన్‌సిఎల్‌టి అత్యంత భారీ రాయితీలిచ్చి, వారి రుణాన్ని పరిష్కరిస్తుంది. పన్ను చెల్లింపుదారులు, చిన్న డిపాజిటర్ల సొమ్ముతో ఇటువంటి ఉదారత చూపడం గర్హనీయం. పెద్ద కార్పొరేషన్ల ఉద్దేశపూర్వక ఎగవేతకు సాధారణ పన్ను చెల్లింపుదారులు ఎందుకు మూల్యం చెల్లించాలి? రాజకీయంగా పలుకుబడి ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారులకు భారీ రుణాలు అందించి, ఆపై 'హెయిర్‌కట్' పేరుతో వారిని ఆదుకుంటున్నారు. అధికార పార్టీకి సేవచేసినందుకు గొప్ప ప్రతిఫలంగా ఇలాంటి ఉదారతను చూపుతుండటం శోచనీయం.
భారతదేశంలో, వేలాది మంది రుణగ్రస్తులైన రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, రోజువారీ కూలీలు రుణాలు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేదలు, అణగారిన వర్గాల వారు చిన్న మొత్తాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు వారిని బెదిరిస్తున్నారు. భయపెట్టడంతోపాటు అవమానిస్తూ, ఇళ్ల నుంచి గెంటివేస్తున్నారు. ఆర్‌బిఐ నివేదికల ప్రకారం, గృహ రుణాలు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 45.5 శాతంతో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడాన్ని తప్పుపడుతున్న వారు కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నప్పుడు నోరుమెదపడం లేదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక ఆర్‌టిఐ సమాధానం కఠోర వాస్తవాలను వెల్లడిస్తోంది. చిన్న రుణగ్రహీతలకు (ఒక కోటి రూపాయలు, అంతకంటే తక్కువ) రుణ వసూలు రేటు 74 శాతంగా ఉండగా, పెద్ద రుణగ్రహీతలకు (రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ) ఇది కేవలం 14.5 శాతంగా ఉంది. ఎన్‌సిఎల్‌టి ఉత్తర్వును రద్దు చేయాలని, సాధారణ పన్ను చెల్లింపుదారుల ఖర్చుతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు బహుమతులు ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని’ సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది.








కామెంట్‌లు (0)