ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెలసరి పరిశుభ్రతపై రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు అసహనం

1 గంట క్రితం

sc-18
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 04:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నెలసరి పరిశుభ్రతను ప్రాథమిక హక్కులో భాగంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు అమలుపై నివేదికలు సమర్పించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారానికి ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పులు కేవలం కాగితాలకే పరిమితమైతే, బాలికలకు ఈ ప్రాథమిక హక్కు ఎలా అందుతుందని ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కూడా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించకపోతే సంబంధిత ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 13న ఈ అంశంపై విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి నెలసరి ఆరోగ్యం, పరిశుభ్రత కూడా వస్తాయని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ హక్కును అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సంబంధించి అవసరమైన వివరాలు అందించాలని కోరుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసిందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు.


దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్రం సమాచారం కోరినప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలసరి పరిశుభ్రతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు ప్రాధాన్యాన్ని కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాయని తాము భావిస్తున్నామని తెలిపింది. అయితే, ఆ తీర్పును ఆచరణలో అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. దేశంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నెలసరి పరిశుభ్రతకు అవసరమైన సదుపాయాలు లేక బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. పాఠశాలల్లో తగిన మరుగుదొడ్లు, నీటి సౌకర్యాలు, శానిటరీ నాప్‌కిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల కొందరు బాలికలు చదువును మధ్యలోనే మానేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులను మార్చి, బాలికల విద్యకు ఆటంకాలు తొలగించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా చర్చించాలని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను ఆయా ప్రభుత్వాల నుంచి లిఖితపూర్వకంగా సేకరించాలని సూచించింది. తీర్పులోని ప్రతి అంశాన్ని మరోసారి సమీక్షించి, అమలుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని కేంద్రానికి తెలిపింది. తదుపరి విచారణ సమయంలోనూ కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించలేదని కేంద్రం నివేదిస్తే, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైన చర్యలు తీసుకునేందుకు చివరి అవకాశం ఇస్తూ విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.


ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు నెలసరి పరిశుభ్రత సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం రూపొందించిన విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నెలసరి ఆరోగ్యాన్ని కేవలం వ్యక్తిగత పరిశుభ్రత సమస్యగా కాకుండా, బాలికల విద్య, ఆరోగ్యం, గౌరవం, సమాన అవకాశాలతో ముడిపడిన ప్రాథమిక హక్కుగా పరిగణించాల్సిన అవసరాన్ని ధర్మాసనం తన ఆదేశాల ద్వారా స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్