న్యూఢిల్లీ : దీపావళి సందర్భంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో బాణాసంచాపై నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. ధృవీకృత పర్యావరణ అనుకూల (గ్రీన్) బాణసంచాను కాల్చడానికి అనుమతించింది. దీపావళి పండుగ సందర్భంగా, నవంబర్ 7,8 తేదీల్లో ఉదయం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు, రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు బాణసంచాను కాల్చుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, నోటిఫై అయిన సైలెన్స్ జోన్ల చుట్టూ 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చకూడదని, ఇటువంటి ప్రాంతాలను బాణసంచా రహిత ప్రాంతాలు (నో క్రాకర్స్ జోన్) ప్రకటించాలని తెలిపింది. ఆ ప్రాంతాలను గుర్తించడంతో పాటు బహిరంగపరచాలని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది. ఇదే నిబంధన విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలను సక్రమంగా పాటించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోర్టు పేర్కొంది. దీపావళి సమయంలో బాణసంచా కాల్చడాన్ని ఒక "మతపరమైన ఆచారంగా" పేర్కొన్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలందరి ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడటం అత్యవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణ లేకుండా బాణసంచా కాల్చడం వలన అందరూ ప్రభావితమవుతారని కోర్టు పేర్కొంది. బాణసంచా కాల్చడం మతపరమైన ఆచారం అయినప్పటికీ.. ఇది ఘన వ్యర్థాలను సృష్టించడంతో పాటు వాయు, శబ్దకాలుష్యానికి కారణమవుతుందని, ఫలితంగా పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తుందని పేర్కొంది. చిన్నారులు, విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, అత్యంత బలహీన వర్గాలుగా ఉన్నవారి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని సుప్రీంకోర్టు 23 పేజీల ఉత్తర్వుల్లో తెలిపింది.
ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో బాణాసంచాపై నిషేధం తొలగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 04:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)