న్యూఢిల్లీ: నీట్ యూజీ (NEET-UG) పేపర్ లీకేజీకి నిరసనగా జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనపై పోలీసుల దాడి ఘటనలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీని పునర్వ్యవస్థీకరించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కమిటీ సభ్యులకు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
జూలై 20న జరిగిన నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గుండ్లను ఉపయోగించారని, మహిళా నిరసనకారులపై పురుష పోలీసులు దౌర్జన్యానికి దిగి దారుణంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలపై విచారణకు ఆగస్టు 20న సుప్రెంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రవిశంకర్ ఝా, జస్టిస్ శాలిందర్ కౌర్, రుషికుమార్ శుక్లా, ఎల్.ఆర్. బిష్ణోయ్ సభ్యులుగా ఉన్నారు.
కమిటీ పని ప్రారంభించక ముందే దానిపై ఆరోపణలు చేయడం పట్ల చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. అదే సమయంలో, భద్రతా ముప్పు ఉన్న సాక్షులు తమ ఆధారాలు, వాంగ్మూలాలను రహస్యంగా సమర్పించేందుకు వీలుగా ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను సిద్ధం చేయాలని కమిటీని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో సీనియర్ అడ్వకేట్ మోనికా గుసేన్, అడ్వకేట్ సి. సోలమన్లను కోర్టు అమికస్ క్యూరీగా నియమించింది. నిరసన స్థలంలో పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను ఉపయోగించారనే ఆరోపణలతో సహా ఇతర అంశాలను కోర్టు తరువాత పరిశీలిస్తుందని తెలిపింది.







కామెంట్‌లు (0)