సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

15 రోజులుగా లోయలో చిక్కుకున్న టీచర్‌

6 గంటల క్రితం

15 రోజులుగా లోయలో చిక్కుకున్న టీచర్‌
- మేకల కాపరి సాయంతో దక్కిన ప్రాణాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మేకల కాపరి సాయంతో దక్కిన ప్రాణాలు

భువనేశ్వర్‌: ఒడిశాలో ప్రకృతి విపత్తు కారణంగా 15 రోజులుగా అటవీ ప్రాంతంలోని లోతైన లోయలో చిక్కుకుపోయిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. మేకలను మేపేందుకు అడవిలోకి వెళ్లిన ఓ యువకుడు ఆయన ఆర్తనాదాలు విని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర నీరసం, ఆకలితో బలహీనపడిన ఆయనను శనివారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కంధమాల్ జిల్లాలోని దుబా ప్రాంతం సర్సపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మోహన్ కుమార్ మహారాణా (47) అక్టోబర్ 29న పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తుపాను ఆర్నబ్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డంగేసి గ్రామం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో కొండపై నుంచి జారిపడిన ఆయన అడవిలోని లోతైన గోతిలో చిక్కుకుపోయారు. చుట్టుపక్కల వారు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడంతో ఆయన ఇతరుల నుంచి విడిపోయారు. అడవిలో చిక్కుకున్న ఆయనకు బయటకు వచ్చే మార్గం కనిపించలేదు. నిరంతర వర్షాలు, వరదలు, సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఆకలి, అలసటతో సాయం కోసం చేసే అరుపులు కూడా క్రమంగా బలహీనపడ్డాయి. మేకల కాపరి అడవిలోకి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి నుంచి మెల్లగా అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూడగా మహారాణా ఓ రాతిపై అత్యంత దీనస్థితిలో కనిపించారు. వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని రైకియా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి ఏ స్వర్ణలత పాత్రా వెల్లడించారు. పోలీసు సిబ్బంది, స్థానికులతో కలిసి ఆమె సహాయక చర్యలు చేపట్టారు. దట్టమైన అడవిలో సుమారు 7 నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన రక్షణ బృందం.. చెక్క కర్ర, బెడ్‌షీట్‌తో తాత్కాలిక పల్లకీ తయారుచేసి ఆయనను బయటకు తీసుకొచ్చింది. కాగా అడవిలో బతికేందుకు గోతిలో నిలిచిన బురద నీటితోపాటు సమీపంలోని వాగుల నీటిని తాగినట్లు మహారాణా భార్య తెలిపారు. తినేందుకు దొరికిన ఆహార పదార్థాలను తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, తుఫాను ఆర్నబ్, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో రైకియా ప్రాంతంలో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. ప్రభావిత గ్రామాల ప్రజలను మానికేశ్వర్‌లోని సహాయక శిబిరాలతోపాటు ఇతర ప్రభుత్వ శిబిరాలకు తరలించారు. పాఠశాలలు మూతపడటం, గ్రామాలు ఖాళీ కావడంతో అడవికి సమీప ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్