శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇథనాల్‌ బ్లెండింగ్‌ విధానాన్ని మార్చాలి !

10 గంటల క్రితం

petrol
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 12:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం డిమాండ్‌

న్యూఢిల్లీ : ఇథనాల్‌ ‌బ్లెండింగ్‌ ‌విధానం వల్ల తలెత్తే విస్తృత ప్రభావాలపై సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పొలిట్‌‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇథనాల్‌ ‌బ్లెండెడ్‌ ఇంధనం కలగచేసే నష్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విధానంతో ముడిపడి వున్న తీవ్రమైన ముప్పుల గురించి వివరిస్తూ సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ ‌మాన్యుఫాక్చరర్స్‌ (ఎస్‌ఐఎఎం) కేంద్ర పెట్రోలియం శాఖకు ఇటీవల ఒక లేఖ రాసింది. అయితే తీవ్రమైన ఒత్తిళ్ళ కారణంగా తర్వాత ఆ లేఖను ఉపసంహరించుకున్నప్పటికీ ఆ లేఖలో వ్యక్తమైన ఆందోళనలను తోసిపుచ్చలేమని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. ఇథనాల్‌ ‌బ్లెండింగ్‌ ‌విధానం ప్రకటించినపుడు, పూర్తి పెట్రోల్‌ ‌కన్నా ఇథనాల్‌ ‌లేదా ఇబిపి తక్కువ ఖరీదుకే వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఇ20ని ప్రవేశపెట్టడానికి ముందు పెట్రోల్‌ ‌ధర ఎంత వుందో ఆ ధరకే ఇ20ని కూడా అమ్ముతున్నారు. ఇ20 ఇచ్చే మైలేజీ తక్కువగా వుంటుంది, పైగా దీనివల్ల అరుగుదల కూడా ఎక్కువగా వుంటుంది, అయినా అదే ధరకు అమ్ముతున్నారని ఆ ప్రకటనలో పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. వాహనాల పనితీరు, నిర్వహణపై అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ, మరే ఇతర ప్రత్యామ్నాయం లేనందున బ్లెండెడ్‌ ఇంధనాన్ని ఉపయోగించడం మినహా వినియోగదారులకు మరో మార్గం లేదు.

జనాభాలో కొన్ని వర్గాలు ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి మళ్లించడం ఈ విధానంలో కనిపిస్తోంది. ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచేందుకు గానూ మొక్కజొన్నను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల కార్పొరేట్‌‌ సంస్థలు, పెద్ద పెద్ద చక్కెర మిల్లులకు లబ్ది చేకూరుతుంది, కానీ మరోవైపు పంటల సాగు విధానాల్లో వక్రీకరణలకు ఈ విధానం దారి తీస్తుందని పొలిట్‌‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, అధికంగా నీటిని ఉపయోగించే సాగు కారణంగా ఇప్పటికే కొరతగా వున్న భూగర్భ జల వనరులు మరింతగా హరించుకుపోయే ప్రమాదం కూడా పొంచి వుందని పేర్కొంది.

ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ల లాభాలకే మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ విధానం బహిర్గతం చేస్తోంది. మన ఆహార భద్రతను దెబ్బతీసే, రైతుల ప్రయోజనాలకు హాని కలిగించే, వినియోగదారుల హక్కులకు, పర్యావరణ సుస్థిరతకు ముప్పు చేకూర్చేఈ విధానాన్ని ఎంత మాత్రమూ కొనసాగించరాదని సిపిఎం పేర్కొంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించాల్సిన అవసరం వుంది, అయితే అదే సమయంలో ఆహార భద్రత, పర్యావరణ ఆందోళనలను పణంగా పెట్టరాదని, అలాగే వినియోగదారుల ఆందోళనల పరిష్కారాన్ని దెబ్బతీసేలా వుండరాదని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది.

బ్లెండెడ్‌ ఇంధనమా లేదా మరొకటా అనే ఎంపిక వినియోగదారులకే వదిలిపెట్టాలని, అన్ని దుకాణాల్లో ఈ రెండూ అందుబాటులో వుంచాలని పొలిట్‌‌బ్యూరో డిమాండ్‌ ‌చేసింది. తక్కువ మైలేజీ రావడం, అరుగుదల ఎక్కువగా వుండడాన్ని భర్తీ చేసేందుకు గానూ ఇథనాల్‌ ‌బ్లెండెడ్‌ ఇంథనం పెట్రోల్‌ ‌కన్నా తక్కువకే లభించాలని పేర్కొంది. 20శాతం కంటే ఎక్కువగా ఇథనాల్‌‌ బ్లెండింగ్‌‌ను తోసిపుచ్చాలి. జిఎం మొక్కజొన్నను మన దేశంలోకి దిగుమతి చేసుకునేలా అమెరికా ప్రయత్నిస్తోందని, కానీ దాన్ని దిగుమతి చేసుకోరాదని కూడా సిపిఎం హెచ్చరించింది. ఈ మొక్కజొన్నను మానవ వినిమయానికి కూడా మళ్లించే ప్రమాదముందని, అలాగే మన పంటలను కూడా దెబ్బతీసే అవకాశముందని హెచ్చరించింది. వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం వినాలని, దానికి తగ్గట్లుగా తన విధానాన్ని మార్చుకోవాలని సిపిఎం ఆశిస్తోంది. లేనిపక్షంలో, ఈ విధానానికి వ్యతిరేకంగా ఉధృతంగా తలెత్తే ప్రజా నిరసనలు, ఆందోళనలు ఎదుర్కొనక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్