ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథమే లక్ష్యం

8 గంటల క్రితం

china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- భారత్‌, చైనా నేతల పునరుద్ఘాటన

- సరిహద్దుల్లో శాంతి వుంటేనే అన్నీ : ప్రధాని మోడీ

- సభ్య దేశాల మధ్య సమన్వయం అవసరమన్న జిన్‌‌పింగ్‌

న్యూఢిల్లీ : బ్రిక్స్‌ ‌దేశాల శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో శనివారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్‌‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. గత ఏడాది తియాన్‌‌జిన్‌‌లో చివరిసారిగా సమావేశమైన తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో నెలకొన్న పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. రెండు దేశాలు తమ సంబంధాల్లో వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగివుండాలని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని స్వాగతించారు. సాంస్కృతిక మార్పిడి, వ్యాపార, వాణిజ్య సంబంధాలను, రెండు దేశాల మధ్య రాకపోకలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇక ఆర్థిక, వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే, వ్యవస్థాగత వాణిజ్య అసమతుల్యత, సరఫరా మార్గాల్లో సమస్యలతోపాటు ఒకరి ఆందోళనలను మరొకరు పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత వుందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై, సవాళ్లను పరిష్కరించుకోవడంపై ఉభయ పక్షాలు తమ ఉమ్మడి అవగాహనను మరింత విస్తరించుకోవాల్సి వుందని అంగీకరించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

​సరిహద్దుల్లో శాంతి వుంటేనే..

ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందుతూ ఉండాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలు కొనసాగడమనేది అత్యవసరమైన ప్రాతిపదిక అని భారత ప్రధాని మోడీ చైనా నేతకు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు ఈ మూడు అంశాల ప్రాతిపదికనే ఉభయ పక్షాలు వ్యవహరించాలని తెలిపారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా జిన్‌‌పింగ్‌ ‌మాట్లాడుతూ, చైనా, భారత్‌‌లు ఒకరి సామర్ధ్యాలు, బలం నుండి మరొకరు నేర్చుకుంటూ ఉమ్మడి అభివృద్ధిని సాధించగలవని అన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన బ్రిక్స్‌ ‌సహకారాన్ని మరింత విస్తరించేందుకు చైనా, భారత్‌‌లు చేతులు కలపాలని అన్నారు. సమానమైన, సమర్ధవంతమైన బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థను రెండు దేశాలు సమర్ధించాలన్నారు. ఈ మేరకు జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.

​పశ్చిమాసియా యుద్ధంతో తీవ్ర నష్టం : జిన్‌పింగ్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగల్చడమే కాకుండా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తోందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ పాలన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై బ్రిక్స్‌ నేతలు చర్చిస్తున్న వేళ జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే చర్యలను బ్రిక్స్‌ సభ్య దేశాలు వ్యతిరేకించాలని ఆయన సూచించారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్‌ ప్రాంతంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలికేందుకు మనందరం సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరస్పర సహకారం, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో సహకారాన్ని బలోపేతం చేయాలని బ్రిక్స్ దేశాలకు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ నూతన సాంకేతిక రంగంలో సభ్య దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని నొక్కి చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న 21వ బ్రిక్స్‌ ‌శిఖరాగ్ర సదస్సుకు చైనా ఆతిధ్యం ఇవ్వనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్