సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపిని ఓడించడమే లక్ష్యం

17 గంటల క్రితం

ma baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 10:43 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- భయాన్ని ఛేదించిన జంతర్‌మంతర్ విద్యార్థి ఉద్యమం

- విలేక‌రుల స‌మావేశంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

- రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం కార్యాచరణ వెల్లడి

- బలమైన కార్మికవర్గ విప్లవ పార్టీగా సిపిఎంను తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : రానున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, సంఘ్‌పరివార్‌ను ఓడించడమే సిపిఎం లక్ష్యమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌ విద్యార్థి ఉద్యమంతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందని ఆయన తెలిపారు. ఆదివారం సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎ బేబీ మాట్లాడారు. రెండు రోజుల పాటు జరిగిన సిపిఎం పొలిట్ బ్యూరో సమావేశం వివరాలను వెల్లడించారు. బిజెపి, సంఘ్‌పరివార్‌ శక్తులను ఓడించేందుకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతను బలోపేతం చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పంజాబ్‌లో బిజెపిని ఓడించే అవకాశాలు అత్యధికంగా ఉన్న అభ్యర్థికి సిపిఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ అంశంపై పంజాబ్‌ రాష్ట్ర కమిటీ ఇప్పటికే సమగ్రంగా చర్చించిందని, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోనూ బిజెపిని ఓడించేందుకు సిపిఎం పనిచేస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం, సంఘ్‌పరివార్‌ కొంతకాలంగా దేశంలో సృష్టిస్తున్న భయానక వాతావరణాన్ని జంతర్‌మంతర్‌ విద్యార్థి ఉద్యమం బద్దలు కొట్టిందని ఆయన అన్నారు. ఎలాంటి భయానికీ లొంగకుండా విద్యార్థులు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. విద్యార్థి ఉద్యమం ముందు ప్రభుత్వం తలవచిందన్నారు. సిజెపి, ఎస్‌ఎఫ్‌ఐతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు జంతర్‌మంతర్‌ ఉద్యమానికి నాయకత్వం వహించాయని చెప్పారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింద న్నారు. బీహార్‌లోని బంకిపూర్‌ ఉప ఎన్నికలో బిజెపికి ఎదురైన ఓటమి కూడా జంతర్‌మంతర్‌ ఉద్యమ ప్రభావానికి నిదర్శనమని అన్నారు.


​రైతు, కార్మిక ఉద్యమాలతో బిజెపికి ఎదురుదెబ్బ

​గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతులు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించాయని గుర్తుచేశారు. ఉద్యమాలు బలంగా సాగిన ప్రాంతాల్లో బిజెపికి ఎదురుదెబ్బ తగిలిందని, స్వల్ప మెజారిటీతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపికి మరో అవకాశం ఇవ్వడానికి వీల్లేదని బేబీ స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాటి ప్రభావాన్ని ఎన్నికల రాజకీ యాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.


​వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం

​పార్టీ రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత ప్రయో జనాల కంటే పార్టీ ప్రయోజనాలను ఉన్నతంగా ఉంచడమే సిపిఎం సభ్యులు పాటించాల్సిన నిబంధన అని ఎం.ఎ బేబీ తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో అభిప్రాయ భేదాలు, ఫిర్యాదులు ఉండవచ్చని, వాటిని పార్టీ అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదులు, మనోవేదనల పేరుతో పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే స్థాయికి వెళ్లడం సరికాదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీకి అండగా నిలవాల్సిన బాధ్యత నుంచి వైదొలగడం తప్పేనని అన్నారు. కేరళతోపాటు పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు. పార్టీకి కాకుండా ప్రత్యర్థులకు ఓటేసిన వారు తమ తప్పును గ్ర‌హించాల‌ని సూచించారు.


​తప్పులు జరిగితే అంగీకరించి సరిదిద్దుకుంటాం

కేర‌ళ ఎన్నికలపై పార్టీ అవసరమైన సమీక్ష నిర్వహిస్తుందని బేబీ తెలిపారు. ఈ పరిశీలన జిల్లా స్థాయి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కన్నూరు జిల్లా క‌మిటీ ఇప్పటికే అవసరమైన సమీక్ష నిర్వహించిందని, అభ్యర్థుల ఎంపికలో తప్పులు జరిగాయని గుర్తించిందని తెలిపారు. తప్పులు, పొరపాట్లు జరిగితే వాటిని అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని సరిదిద్దుకునే పార్టీ సిపిఎం అని స్పష్టం చేశారు. ప్రజలు పార్టీని అపార్థం చేసుకోవడానికి, పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు అవకాశం కల్పించిన కొన్ని లోపాలు, వైఫల్యాలు, నిర్లక్ష్యాలు పార్టీ వైపు నుంచి చోటుచేసుకున్నాయని అంగీకరించారు. వాటిని గుర్తించి సరిదిద్దుకుంటామని ప్రజలకు చెప్పడమే తమ బాధ్యత అన్నారు. పార్టీకి చెందిన తప్పులు, లోపాలను సరిదిద్దుకోవడం, పార్టీ పట్ల సభ్యులు తమ బాధ్యతను నిర్వర్తించడం రెండూ సమాంతరంగా కొనసాగాల్సిన అంశాలని ఎంఎ బేబీ తెలిపారు.

పార్టీని పునరుద్ధరించేందుకు అంతర్గత చర్చలు

కేరళలో త్వరలో జరగనున్న రాష్ట్ర విస్తృత స్థాయి స‌మావేశంలో పార్టీ తప్పులు, లోపాలను సరిదిద్దుకుని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విస్తృతంగా చర్చిస్తామని, పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే తరహాలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని చెప్పారు. పార్టీ పునరుద్ధరణకు అవసరమైన అంతర్గత ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు. దిద్దుబాటు అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు శాఖ స్థాయి నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. సిపిఎంను బలమైన కార్మికవర్గ విప్లవ పార్టీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి పార్టీ సభ్యుడు అందుకు అవసరమైన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటరీ భ్ర‌మ‌పై లోతైన సమీక్ష

దిద్దుబాటు ఉద్యమంలో భాగంగా పార్లమెంటరీ భ్ర‌మ‌, ప్రజలతో సంబంధాల కొర‌త‌, సమిష్టి కార్యాచరణ అనే మూడు అంశాలపై పొలిట్‌బ్యూరోలో విస్తృత చర్చ జరిగిందని బేబీ తెలిపారు. ప్రతి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఈ మూడు అంశాలపై స్వీయ అంచ‌నా నివేదిక సమర్పించారని చెప్పారు. పార్టీలో పార్లమెంటరీ భ్ర‌మ‌లు ఏ మేరకు ఉన్నాయి, ప్రజలతో పార్టీ ఎంతమేరకు మమేకమవుతోంది, సమిష్టి కార్యాచరణ ఎలా అమలవుతోంది అనే అంశాలపై లోతుగా సమీక్షించారని తెలిపారు. ఇలాంటి చర్చలు అన్ని స్థాయిల పార్టీ కమిటీల్లోనూ జరుగుతాయని చెప్పారు. అవసరమైన దిద్దుబాటు చేపడుతూ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్