ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశీ నమూనాలను యథాతథంగా అనుకరించకూడదు

1 గంట క్రితం

Air Chief Marshal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

థియేటరైజేషన్‌పై వైమానిక దళాధిపతి ఏపీ సింగ్‌

న్యూఢిల్లీ : విదేశీ నమూనాలను యథాతథంగా అనుకరించకుండా, భారతదేశ ప్రత్యేక భద్రతా అవసరాలకు అనుగుణంగా సైనిక విభాగాల ఏకీకరణ (థియేటరైజేషన్‌) వ్యవస్థను రూపొందించుకోవాలని భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. యుద్ధ విమానాలను భౌగోళిక ప్రాంతాల వారీగా శాశ్వతంగా విభజించడమే థియేటరైజేషన్‌ కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని, తద్వారా సైనిక కార్యాచరణ సంసిద్ధతకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. సైనికీకరణపై ఆదివారం మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న సంఘర్షణలు వైమానిక శక్తి సైనిక ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయగలదని మరోసారి నిరూపించాయని ఏపీ సింగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో, వాయుసేన సామర్థ్యాలను ఏకీకృత సైనిక నిర్మాణంలో అత్యంత సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాలని అన్నారు. అవసరమైన చోట కేంద్రీకృత నియంత్రణ, తగిన సందర్భాల్లో వికేంద్రీకృత అమలు అనే సూత్రంతో ముందుకెళ్లాలని సూచించారు.

ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా ఉమ్మడి సైనిక వ్యవస్థ సమర్థంగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌), మూడు సైనిక విభాగాల అధిపతుల సమన్వయంతో కీలక వనరులను కేంద్రీకృతంగా కేటాయించడం, అవసరాన్ని బట్టి సకాలంలో తిరిగి కేటాయించడం ఆపరేషన్‌ ఫలితాల్లో కీలక పాత్ర పోషించాయని చెప్పుకొచ్చారు. వాయుసేన ప్రధాన బలాలు వేగం, విస్తృతి, సౌలభ్యంతోపాటు అవసరమైన సమయంలో పోరాట సామర్థ్యాన్ని వేగంగా ఒకచోట కేంద్రీకరించగలగడమేనని ఏపీ సింగ్‌ అన్నారు. గగనతలంలోనే ఇంధనం నింపుకునే సదుపాయాలు, సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, అనుసంధానిత సెన్సార్లు, సమర్థవంతమైన స్థావరాల ద్వారా విమానాలను సుదూర ప్రాంతాల్లోనూ వినియోగించవచ్చని తెలిపారు. ముప్పు తీవ్రతను అనుసరించి వివిధ ప్రాంతాలకు వైమానిక శక్తిని వేగంగా తరలించే వెసులుబాటు ఉండాలని చెప్పారు. భవిష్యత్‌ యుద్ధ స్వరూపాన్ని అత్యంత కచ్చితత్వంతో ముందుగానే అంచనా వేయాలనుకోవడం సరికాదని ఆయన హెచ్చరించారు. రానున్న సంఘర్షణలు మరింత వేగంగా, స్వయంప్రతిపత్తితో, నెట్‌వర్క్‌లపై అధికంగా ఆధారపడేలా మారవచ్చని పేర్కొన్నారు. అదే సమయంలో యుద్ధరంగం మరింత పారదర్శకంగా కనిపించినప్పటికీ, మభ్యపెట్టే వ్యూహాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ మార్పులను తట్టుకునేలా సైనిక వ్యవస్థలను రూపొందించుకోవాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్