శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో అద్భుతం: 9 రోజుల పాటు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు సురక్షితం

1 గంట క్రితం

త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో అద్భుతం: 9 రోజుల పాటు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు సురక్షితం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 04:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఖాట్మండు: సొరంగం లోపల చీకటి.. చుట్టూ ముంచెత్తిన బురద నీరు.. బాహ్య ప్రపంచంతో పూర్తిగా తెగిపోయిన సంబంధాలు.. ఇన్ని ప్రతికూలతల మధ్య చావు అంచుల దాకా వెళ్లిన ఇద్దరు జలవిద్యుత్ రంగ కార్మికులు ఏకంగా తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. నేపాల్‌లోని 'త్రిశూలి 3ఏ' జలవిద్యుత్ ప్రాజెక్టు భూగర్భ నిర్మాణంలో చిక్కుకున్న మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్‌లను సహాయక బృందాలు శుక్రవారం బయటకు తీశాయి.


ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద మంచు-రాతి కొండచరియలు విరిగిపడటంతో సంభవించిన ఆకస్మిక వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని అనేక నగరాలు, గ్రామాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో భోటెకోషి నదిలో ఒక్కసారిగా ఉప్పొంగిన వరదలు త్రిశూలి 3ఏ ప్రాజెక్టును ముంచెత్తాయి. వరద నీరు, బురద, వ్యర్థాలు వేగంగా భూగర్భ సొరంగంలోకి చేరుకోవడంతో లోపల ఉన్న ఉద్యోగుల ప్రాణాలు ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న ఈ వరదల కారణంగా నేపాల్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 1,282కి చేరింది.

త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో అద్భుతం: 9 రోజుల పాటు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు సురక్షితం

సంజయ్ షా:

సప్తరి జిల్లాకు చెందిన 30 ఏళ్ల సంజయ్ షా కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదం గ్రహించిన ఆయన వెంటనే అప్రమత్తమై లోపల ఉన్న 40-45 మంది సహచర సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపించారు. అందరినీ కాపాడే ప్రయత్నంలో ఆయన సొరంగంలోనే చిక్కుకుపోయాడు. "కంట్రోల్ రూమ్‌లో ఉన్న నా బాధ్యత అందరి ప్రాణాలు కాపాడటమే. అందుకే నేను చివరిదాకా ఉన్నాను" అని ఆయన పేర్కోన్నారు. సొరంగం లోపలి భాగంలో మరికొందరు కూడా చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


కబీర్ మహర్జన్ :

కిర్తీపూర్‌కు చెందిన కబీర్ మహర్జన్ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం కులేఖానీ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆగస్టు 26 ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడి, టిఫిన్ చేశాక హైడ్రోపవర్ టన్నెల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే ఈ ఘోరం జరిగి ఆయన సమాచార వ్యవస్థకు దూరమయ్యారు.



నేపాలీ ఆర్మీ ఆధ్వర్యంలో నేపాల్ పోలీస్, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ మరియు విదేశీ నిపుణుల సాయంతో భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వీరిద్దరినీ వెలికితీశారు. అనంతరం వీరిని హెలికాప్టర్‌లో ఖాట్మండుకు తరలించారు. కాలికి గాయమైన కబీర్ మహర్జన్‌ను బీరేంద్ర సైనిక్ ఆసుపత్రిలోని ఐసియు (ICU)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రసుతం ఆయన మాట్లాడుతున్నారని ఆయన భార్య తెలిపారు. సంజయ్ షా ఆరోగ్యం నిలకడగా ఉందని, తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రిలోనే ఉంచామని వైద్యులు వెల్లడించారు. కాగా, సహాయక బృందాలు గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్