ఖాఠ్మండు:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సాంకేతిక సంస్థగా ఎదిగిన అమెరికాకు చెందిన 'ఎన్విడియా' (Nvidia), ఇటీవల నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సంభవించిన నష్టం నుంచి కోలుకోవడానికి $10 మిలియన్లు (సుమారు రూ. 83 కోట్లు) విరాళంగా ప్రకటించింది.
సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సన్ హువాంగ్ తో కలిసి అందించిన ఈ మొత్తాన్ని హిమాలయన్ బ్యాంక్ ద్వారా నేపాల్ 'ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి'కి జమ చేసినట్లు బ్యాంక్ సీఈఓ అశోక్ రాణా సామాజిక మాధ్యమాల ద్వారా ధృవీకరించారు. ఆగస్టు 26న భోటెకోషి నదికి వచ్చిన వరదల తర్వాత నేపాల్‌కి ఒక విదేశీ టెక్నాలజీ కంపెనీ నుండి వచ్చిన అతిపెద్ద సహాయం ఇది.
నేపాల్ ఉద్యోగుల చొరవ:
ఎన్విడియాలో పనిచేస్తున్న 50 మందికి పైగా నేపాల్ ఉద్యోగులు ఈ విరాళం అందేలా కీలక పాత్ర పోషించారు. బాధితులను ఆదుకోవడానికి కంపెనీ యాజమాన్యాన్ని అభ్యర్థించడమే కాకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించడంలోనూ చొరవ చూపారని సామాజిక కార్యకర్త హిక్మత్ థాపా తెలిపారు. అశోక్ పాండే, ఆర్తి నేపాల్‌లతో కూడిన ఉద్యోగుల బృందం ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించింది.
ప్రభుత్వ హామీ :
నిధులు సక్రమంగా వినియోగించబడతాయని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే హామీ ఇవ్వడంతో ఎన్విడియా ఈ మొత్తాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విరాళం ఇతర అంతర్జాతీయ సంస్థలకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్విడియా ప్రస్థానం:
1993లో కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఎన్విడియా, మొదట్లో కంప్యూటర్ గేమ్‌ల కోసం గ్రాఫిక్స్ ప్రొసెసర్లను (GPUs) తయారుచేసేది. కానీ, ఈ ప్రాసెసర్లు AI వ్యవస్థలకు ఎంతో ఉపయోగకరంగా మారడంతో, నేడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలకు కీలకమైన ప్రాసెసర్లను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం రూ.520 లక్షల కోట్ల ($5.5 ట్రిలియన్ల) కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా ఎన్విడియా నిలిచింది.







కామెంట్‌లు (0)