లక్నో (ఉత్తరప్రదేశ్):
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ సోమవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, దీనివల్ల ఓటర్ల జాబితా పవిత్రత దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "ఉత్తరప్రదేశ్‌లో లక్షలాది నకిలీ ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరిట పది ఓట్లు వరకు నమోదయ్యాయి. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి నకిలీ ఓట్లను మేం గుర్తించాం... త్వరలోనే ఆ జాబితాను విడుదల చేస్తాం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ లోపాలు ఉన్నాయని దీనివల్ల స్పష్టమవుతోంది. ఎస్ఐఆర్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, సమయం వృథా చేశారు. రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాల్లో బీజేపీ చేస్తున్న ఈ మోసాన్ని మేం చూస్తూ ఊరుకోబోం" అని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.
లక్నోలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పార్టీ నేతలతో కలిసి లోహియా ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. లోహియా అందించిన 'సప్త క్రాంతి' సిద్ధాంతాలను ఆచరిస్తామని, సమాజంలో ఎలాంటి వివక్ష ఉన్నా దానిని ఐక్యంగా ఎదుర్కొని రూపుమాపుతామని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం, రామ్ మనోహర్ లోహియా సోషలిజం, ములాయం పోరాట స్పూర్తితో సమసమాజాన్ని, లౌకిక సమాజాన్ని నిర్మిస్తామని అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై, ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తొలగింపును డిమాండ్ చేస్తూ విపక్ష నేతలు, ఎంపీలు సోమవారం ఉదయం సుప్రీంకోర్టు వైపు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 'ఇండియా' (INDIA) కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలు పాల్గొననున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మధ్య ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పటేల్ చౌక్, జన్పథ్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు ప్రవేశం, నిష్క్రమణలను నిలిపివేశారు. బారాఖంబా రోడ్, మండి హౌస్ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను భారీగా మోహరించారు.







కామెంట్‌లు (0)