ముంబయి : అనుకోకుండా విభిన్న ప్రతిభావంతుల కోసం కేటాయించిన లోకల్ రైలు బోగీలోకి ఎక్కిన మహిళను వేధించడమే కాకుండా, ఆమెను నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసేసిన ఘటన మహారాష్ట్రలోని నైగావ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు తన ఎడమ చేతిని కోల్పోయింది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని భయందర్ రైల్వే పోలీసులు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నైగావ్ ఈస్ట్‌లోని వాకిపాడకు చెందిన జితేంద్ర హిర్ముఖే (53) ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు సుప్రియ షిండే (20) నవంబర్ 4న సాయంత్రం బోరివలి నుంచి విరార్‌కు లోకల్ రైలులో ప్రయాణిస్తోంది. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో పొరపాటున దివ్యాంగుల కోసం కేటాయించిన బోగీలోకి ఎక్కింది. అదే బోగీలో ఉన్న హిర్ముఖే ఆమెపై వేధింపులకు దిగాడు. ఆమె అతనిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైలు నైగావ్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో నిందితుడు ఆమెను రైలు నుంచి బయటకు తోసేయడంతో రెండు కోచ్‌ల మధ్య ఉన్న ఖాళీలో మహిళ పడిపోయింది. ఆమె పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగానే రైలు కదలడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర గాయాల కారణంగా ఆమె ఎడమ చేతిని మోచేతి కింది భాగం నుంచి తొలగించాల్సి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు చేతిరుమాలుతో ముఖాన్ని కప్పుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే రైల్వే పోలీసులు పలు ప్రాంతాల్లోని సిసిటివి ఫుటేజీలను పరిశీలించి అతడిని గుర్తించి అరెస్టు చేసినట్లు భయందర్ రైల్వే పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ గణపత్ తుంబాడ తెలిపారు.








కామెంట్‌లు (0)