న్యూఢిల్లీ : `గో ప్రధాన్ గో' అంటూ పళ్లాలు మోగిస్తూ జంతర్ మంతర్ లో యువత నినదించారు. నీట్ -యుజి సహా ప్రశ్నా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ లో యువత శనివారం ఆందోళన చేపట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి ) ఈ నిరసరనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ లో ఆందోళన చేపట్టడం ఇది రెండవసారి. నిరసన ప్రాంతానికి చేరుకున్న సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే .. ఈ ప్రాంతం జనసంద్రమైందని అన్నారు. ఆందోళనకారులు పళ్లాలపై స్పూన్ లతో కొడుగూ.. `గో ప్రధాన్ గో' అంటూ నినాదాలు చేశారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పిల్లలు కూడా సాధారణ ప్రజలు చదివే పాఠశాలలకు వెళ్లినపుడే ఈ విద్యావ్యవస్థలో మార్పు వస్తుందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సూచించారు.
మధ్యాహ్నం 1.00 గంట సమయానికి నిరసన ప్రారంభం కావాల్సి వుండగా.. ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. అడుగడుగునా బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు యత్నించింది. పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులను కూడా రంగంలోకి దింపింది. కార్లను తనిఖీ చేస్తూ .. యువతను జంతర్ మంతర్ కు చేరకుండా నిరోధించింది.









కామెంట్‌లు (0)