ఒంగోలు : ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక విధానాలపై ప్రజల్లో ఆకాంక్ష పెరుగుతోందని, ముఖ్యంగా యువతలో సోషలిస్టు ఆలోచనల పట్ల ఆసక్తి విస్తరిస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. విద్యార్థులు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాల్లోకి వస్తున్నారని, మహిళల్లో శ్రామిక చైతన్యం పెరుగుతోందని తెలిపారు. ఈ పరిణామాలను కేవలం నిరసనలకే పరిమితం చేయకుండా సమాజంలో సమూల మార్పులకు దోహదపడే ప్రజా ఉద్యమాలుగా నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలు, కుల వివక్ష, లింగ అసమానతలు, నిరుద్యోగం, విద్యా, వైద్య సమస్యలపై ప్రజలను సమీకరించాలని సూచించారు.
ఒంగోలు లోని స్థానిక సుందరయ్య భవన్లో మంగళవారం సాయంత్రం 109వ అక్టోబర్ విప్లవ దినోత్సవం సందర్భంగా 'వర్తమాన ప్రపంచం – సోషలిజం ఆవశ్యకత' అంశంపై నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు అధ్యక్షత వహించారు.
పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం అవసరం.....
1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత సోషలిజానికి భవిష్యత్తు లేదని, పెట్టుబడిదారీ వ్యవస్థే శాశ్వతమనే ప్రచారం విస్తృతంగా జరిగిందని రాఘవులు గుర్తుచేశారు. అయితే నేటి ప్రపంచ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లోనూ యువత సోషలిజం వైపు ఆసక్తి చూపుతోందని, పెట్టుబడిదారీ విధానంలోని అసమానతలు, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాలు ప్రత్యామ్నాయ వ్యవస్థపై ఆలోచించేలా చేస్తున్నాయని వివరించారు. సంపదను సృష్టించే శ్రమజీవులకు దాని ఫలాలు దక్కకుండా కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమవుతోందని విమర్శించారు.
దేశంలో ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే 60 శాతం సంపద కేంద్రీకృతమైందని పేర్కొంటూ, మరోవైపు పేదలు విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి వంటి కనీస అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యా విధానం పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారం, ఉచిత విద్య, ఆరోగ్యం, ఇల్లు, ఉపాధి, న్యాయమైన వేతనం, పెన్షన్ వంటి వాటిని ప్రభుత్వాలు ప్రజలకు దయతో అందించే పథకాలుగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కులుగా కల్పించాలని ప్రతిపాదించారు.
వారసత్వ సంపదపై 33 శాతం పన్ను విధించాలి....
సంపద కొద్దిమంది కుటుంబాలకే తరతరాలుగా పరిమితం కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని రాఘవులు అభిప్రాయపడ్డారు. భారీ వారసత్వ ఆస్తుల బదిలీపై 33 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఉదాహరణకు వంద కోట్ల రూపాయల ఆస్తి వారసులకు సంక్రమిస్తే అందులో 33 కోట్లు పన్నుగా ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన 67 కోట్లను వారసులకు అందించే విధానం ఉండాలన్నారు. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో వారసత్వ పన్ను విధానాలు అమల్లో ఉన్నాయని ప్రస్తావించారు. దేశంలోని సంపన్నుల సంపదపై రెండు శాతం పన్ను విధించినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
కుల, లింగ వివక్షల నిర్మూలనతోనే సామాజిక మార్పు...
భారతదేశంలో సోషలిస్టు సమాజ నిర్మాణానికి కుల వ్యవస్థ నిర్మూలన కీలకమని రాఘవులు పేర్కొన్నారు. కుల వ్యవస్థ శ్రమను గౌరవించకుండా శ్రమజీవులను వివక్షకు గురిచేస్తోందని విమర్శించారు. అంటరానితనం నిర్మూలనతోపాటు కుల వ్యవస్థ నిర్మూలనను కూడా రాజ్యాంగ లక్ష్యంగా చేర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మహిళలకు సమాన హక్కులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉత్పత్తి, సేవా రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. కుల, లింగ వివక్షలు కొనసాగుతున్నంతకాలం సమానత్వ సాధన సాధ్యం కాదని స్పష్టం చేశారు.
యుద్ధాలు, పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలి....
పెట్టుబడిదారీ విధానంలోని లాభాపేక్ష ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, మారణకాండలకు కారణమవుతోందని రాఘవులు విమర్శించారు. పాలస్తీనా, ఉక్రెయిన్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గాజాలో విధ్వంసానికి వ్యతిరేకంగా అమెరికా, ఐరోపా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న శాంతికాంక్షకు నిదర్శనమన్నారు. మరోవైపు ప్రకృతి వనరులను లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం వల్ల పర్యావరణ విధ్వంసం, భూతాపం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరువులు, అడవుల్లో కార్చిచ్చులు వంటి విపత్తులు భవిష్యత్ తరాల మనుగడకు ముప్పుగా మారుతున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం అవసరమన్నారు.








కామెంట్లు (0)