mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌పై దాడికి వంద రోజులు

10 జూన్, 2026

iran vs us
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 06:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ 2026 ఫిబ్రవరి 28న ప్రారంభించిన ఏకపక్ష దాడులకు వంద రోజులు నిండాయి. పోరు నిలిపివేయాలని ట్రంప్‌ ఆదేశించినప్పటికీ మంగళవారం నాడు లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు జరిపి అనేక మందిని బలిగొన్నది. అయితే ఆదివారం, సోమవారం నాడు పరస్పర దాడులకు పాల్పడిన ఇరాన్‌, ఇజ్రాయిల్‌ వైపు నుంచి ఎలాంటి చర్యలూ జరగలేదు. లెబనాన్‌ మీద దాడులకు తెగబడటం అంటే ట్రంప్‌కు తెలియకుండా జరిగేది కాదు. ఇరాన్‌ను రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగమే. అమెరికా జరిపిన ఈ దుర్మార్గానికి అప్పటి నుంచి ప్రపంచంలో ప్రతికూలంగా ప్రభావితంగాని దేశం లేదంటే అతిశయోక్తి కాదు.అయినా మనతో సహా అనేక దేశాలు అమెరికా వైఖరిని ఖండించేందుకు ముందుకు రావటం లేదు. అదే దానికి బలం చేకూరుస్తోంది. సోమవారం నాడు హర్మూజ్‌ జలసంధిలో అమెరికా అపాచీ రకం యుద్ధ హెలికాప్టర్‌ కూలిపోయింది. ఇరాన్‌ జరిపిన కాల్పులు కారణమా మరొకటా అన్నది ఇంకా తెలియలేదు. హర్మూజ్‌ నుంచి బాబ్‌ ఎల్‌ మాండెబ్‌ (ఎర్ర సముద్రం) జలసంధి ప్రాంతాన్ని ప్రతిఘటన భద్రతా ప్రాంతంగా ఇరాన్‌ ప్రకటించింది. వంద రోజుల తరువాత జరిగిన ఈ పరిణామం పశ్చిమాసియా సంక్షోభాన్ని మరో మలుపు తిప్పిందని చెప్పవచ్చు. మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి అక్కడి నుంచి హిందూ మహాసముద్రం (అరేబియా సముద్రం) ద్వారా జరిగే నౌకా రవాణా ఇప్పుడు అనిశ్చితంగా మారింది. తన అనుయాయులను కాపాడుకొనేందుకు ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అమెరికా-ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులు, ఆడుతున్న నాటకాలకు తెర పడాలంటే ఇరాన్‌కు ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించటం లేనట్లుగా ఉంది.
హర్మూజ్‌ జలసంధి ద్వారా జరిగే రవాణాకు ఆటంకం కలిగితే ఆసియా దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. అదే ఏడెన్‌ జలసంధి దిగ్బంధనానికి గురైతే ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలన్నీ ప్రభావితం అవుతాయి. ప్రపంచ వాణిజ్యంలో 9 నుంచి 12 శాతం వరకు ఈ మార్గం ద్వారా జరుగుతున్నది. ఒకవేళ ఇది మూతపడితే నౌకలు ఆఫ్రికాలోని గుడ్‌హోప్‌ ఆగ్రం మీదుగా తిరిగి వచ్చేందుకు అదనంగా 15 రోజుల వ్యవధితో పాటు రవాణా, బీమా ఖర్చులు కూడా పెరుగుతాయి. చమురు, గ్యాస్‌తో పాటు ఇతర వస్తువుల రవాణా కూడా గణనీయంగా ప్రభావితం అవుతుంది. అమెరికా తనకున్న ఆయుధ శక్తిని ప్రయోగిస్తుంటే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ తనకున్న అవకాశాలతో అడ్డుకుంటున్నది. అమెరికా దుశ్చర్యలకు జవాబిస్తున్నది. అక్టోబరులో ఇజ్రాయిల్‌ ఎన్నికలు, నవంబరులో అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో నెతన్యాహు, డోనాల్డ్‌ ట్రంప్‌కు ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. వారిని గుడ్డిగా సమర్ధిస్తున్న ఇతర ఇతర దేశాల నేతల పరిస్థితీ అంతే ఉంది. వారిద్దరు సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించాల్సింది కూడా వారే, దాన్ని ఎలా చేస్తారో చూడాలి.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఏ రోజు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు. అతగాడి కనుసన్నలలో పని చేస్తున్న నెతన్యాహు ఒక వైపు లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే దాడులు కొనసాగిస్తున్నాడు. అందువలన ఇరాన్‌-అమెరికా ఒప్పందం కుదరటం ఒక సమస్య అయితే తరువాత అయినా అమెరికా-ఇజ్రాయిల్‌ దానికి కట్టుబడి ఉంటాయా అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఈ పూర్వ రంగంలో వంద రోజుల సంక్షోభం గురించి ఒకసారి ప్రధాన అంశాలను సింహావలోకనం చేసుకుందాం. యావత్‌ ప్రపంచంలో అన్ని రంగాలలో అనిశ్చితి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల చోటుచేసుకుంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి మదుపుదార్లకు భారీ నష్టం వాటిల్లింది. ముడి చమురు దిగుమతి చేసుకొనే దేశాల వినియోగదారులే కాదు, ఎగుమతి చేసే అమెరికాలోనూ ధర మంట బాధితులు ఉన్నారు. సామాన్యులు తమ బడ్జెట్లను ఎలా సర్దుకోవాలా అని ఆందోళన పడుతుంటే కార్పొరేట్‌ కంపెనీలు తమ లాభాలను ఎలా నిలబెట్టుకోవాలా అని చూస్తున్నాయి. చమురు ధరలు తగ్గినప్పటికీ ఆందోళన ఇంకా తగ్గటం లేదు. ఉదాహరణకు మన దేశం ఏప్రిల్‌ నెలలో ముడి చమురు పీపాను సగటున 114.48 డాలర్లకు కొనుగోలు చేస్తే మే నెలలో 106.23 డాలర్లకు తగ్గినప్పటికీ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు నష్టం వస్తున్నదని పెట్రోలు, డీజిలు, ఇతర ఉత్పత్తుల ధరలను పెంచారు. జూన్‌ నెలలో ఇది రాసిన సమయానికి సగటున కొనుగోలు చేసిన ధర 97.44 డాలర్లకు తగ్గినా వినియోగదారుల నుంచి పెంచిన రేట్లే వసూలు చేస్తున్నారు తప్ప పైసా కూడా తగ్గించలేదు. ఫిబ్రవరి 28కి ముందు 70 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడూ తగ్గించలేదు.1970 దశకంలో తగిలిన చమురు షాక్‌ కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ చెప్పింది. ఈ పోరు సామాన్యుల జేబులను ఖాళీ చేస్తుండగా చమురు కంపెనీలకు అపార లాభాలను సమకూర్చుతున్నది. ఏప్రిల్‌ ఏడవ తేదీన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బహిరంగ మార్కెట్‌లో 138 డాలర్లు పలికింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి చమురు, గ్యాస్‌ కంపెనీలు దాడులు ప్రారంభమైన తొలి నెల రోజుల్లో సగటున గంటకు మూడు కోట్ల డాలర్లమేర అదనంగా లాభాలు పొందాయంటే ఆమేరకు జనం జేబులు ఖాళీ అయినట్లే! ముడిచమురు ధర వంద డాలర్లకు అటూ ఇటూగా కొనసాగితే 2026 ఆఖరుకు 234 బిలియన్‌ డాలర్ల మేర అదనపు లాభాలు పొందుతాయని అంచనా.
యుద్ధ ప్రభావం ఆహార రంగం మీద కూడా పడింది. 2023 తరువాత తొలిసారిగా అధిక ధరలు నమోదయ్యాయి. ఇంధనం, ఎరువుల ధరలు పెరిగితే ఆహార ధరలతో పాటు ప్యాకింగ్‌, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎరువుల కంపెనీలకు విపరీత లాభాలు వచ్చాయంటే ఆ మేరకు రైతాంగం నష్టపోవటంతో పాటు వినియోగదారుల మీద అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఎరువుల ధరలు 31 శాతం పెరుగుతాయని, వాటిలో యూరియా ధర 60 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ప్రపంచంలో 60 శాతం చమురు గిరాకీ రవాణా రంగం నుంచే ఉంటున్నది. దాని మీద పడే భారం సామాన్యులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది. ధరల పెరుగుదల కారణంగా అనేక దేశాలు చేపట్టిన చర్యలతో చమురు గిరాకీ రెండు శాతం తగ్గిందని అంచనా. 76 దేశాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో జరిగింది. వాహన వేగ పరిమితి, ఇంటి నుంచే పని, పౌర రవాణా వ్యవస్థలకు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకున్నాయి. మన వంటి దేశాలలో సంక్షోభాల సమయంలో జనం మీద పడే భారాలు, కుటుంబాలకు అయ్యే అదనపు ఖర్చుల గురించి మదింపు వేసేందుకు సరైన యంత్రాంగం, సంస్థలు లేవు. ప్రభుత్వం ఎలాంటి సమాచార సేకరణ చేయటం లేదు గనుక వాటి గురించి చెప్పటం కష్టం. పెరుగుతున్న భారాలను తగ్గించుకొనేందుకు సంక్షేమ పథకాలకు కోత పెడతారు. గతంలో ఏడాదికి ఉజ్వల పథకం కింద పన్నెండు సిలిండర్లు రాయితీ ధరకు ఇవ్వగా తరువాత వాటిని తొమ్మిదికి ఇప్పుడు నాలుగు చేశారు. మూడీ ఎనలిటిక్స్‌ చెబుతున్నదాని ప్రకారం అమెరికాలో సగటున ప్రతి కుటుంబం యుద్ధ సమయంలో 750 డాలర్లు అదనంగా ఖర్చు చేశారు. ఇంధనం మీదనే దీనిలో 447 డాలర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న సగటున ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు) ధర 2.98 డాలర్లు ఉండగా ఈ వారంలో 4.22 డాలర్లుగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువవారు బాధితులుగా మారారు.ఈ కారణంగానే 66 శాతం మంది ట్రంప్‌ పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఒక సర్వే ప్రకారం ఇరాన్‌పై మిలిటరీ చర్య తప్పు అని 61శాతం మంది భావించారు.
ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధాలు, ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ ఆయుధాలు అమ్ముకుంటూ అమెరికా కార్పొరేట్లు లబ్ధి పొందుతున్నాయి. వాటికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వెనుకాడటం లేదు. ఇరాన్‌పై పోరులో గెలిచేది లేదని తెలిసినప్పటికీ అమెరికా భారీ మొత్తాలను కేటాయిస్తున్నది. ఇరాన్‌పై మిలిటరీ చర్యకు అమెరికా రక్షణ శాఖ రోజుకు రెండు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నది. వచ్చే ఏడాది లక్షన్నర కోట్ల డాలర్లు రక్షణ బడ్జెట్‌కు కేటాయించాలని ట్రంప్‌ సర్కార్‌ కోరింది. ఇదే సమయంలో ఇతర బడ్జెట్లలో 10 శాతం కోత విధించాలని కూడా కోరింది. ముందే చెప్పుకున్నట్లు రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించామని చెప్పుకొనేందుకు ఇరాన్‌పై బెదిరింపులతో ఒప్పందానికి తెచ్చుకోవాలని అమెరికా చూస్తోంది. తమ ప్రతిఘటనను హర్మూజ్‌తో పాటు బాబ్‌ అల్‌ మెండాబ్‌కు కూడా విస్తరిస్తామని ఇరాన్‌ ప్రకటించటంతో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అది ఎన్ని రోజులు అన్నది ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుంది !

  • ఎం. కోటేశ్వరరావు 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్