కేవలం 10 రోజులు. నాలుగు ఎన్నికలు. నాలుగు దేశాలు. నాలుగు రకాల రాజకీయ పరిస్థితులు. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో ఏదైనా ఉమ్మడి రాజకీయ సందేశం ఉందా? అక్టోబర్ 25 నుంచి నవంబర్ 4 వరకు కేవలం పది రోజుల్లో బ్రెజిల్, సెర్బియా, ఇజ్రాయిల్, అమెరికాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రపంచ రాజకీయాలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి.
బ్రెజిల్లో లూలా మళ్లీ అధికారంలోకి రావడం, సెర్బియాలో విద్యార్థి ఉద్యమం అనూహ్య విజయం సాధించడం, ఇజ్రాయిల్ లో నెతన్యాహు మెజారిటీని కోల్పోవడం, అమెరికాలో ట్రంప్‌పై డెమోక్రాట్లు భారీ విజయం సాధించడం – ఇవన్నీ వేర్వేరు సంఘటనలుగా కనిపించవచ్చు. కానీ వీటి మధ్య కొన్ని రాజకీయ సారూప్యతలు ఉన్నాయి.
ముఖ్యంగా మితవాద రాజకీయాల భవిష్యత్తు, నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తుల పోరాటం, అధికారంలో ఉన్నవారిపై పెరుగుతున్న ప్రజల అసంతృప్తి వంటి అంశాలు ఈ ఎన్నికల ద్వారా ముందుకొచ్చాయి.
బ్రెజిల్: మితవాద రాజకీయాలపై లూలా విజయం
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్ 25న జరిగిన రెండో విడత ఎన్నికల్లో విజయం సాధించి నాలుగోసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆయన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో కుమారుడు ఫ్లావియో బోల్సనారో.
లాటిన్ అమెరికాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్లో లూలా విజయం అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటిది, సామాజిక అసమానతలు, పేదరికం, కార్మికుల హక్కులు, సామాజిక భద్రత వంటి అంశాలు ఇప్పటికీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవని ఈ ఫలితం నిరూపించింది.
రెండవది, బోల్సనారోకు అంతర్జాతీయ మితవాద శక్తుల మద్దతు ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదు.
మూడవది, బ్రిక్స్ కూటమి బలోపేతం, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ, అమెరికా ఆధిపత్యానికి బయట స్వతంత్ర అంతర్జాతీయ విధానాన్ని అనుసరించడం వంటి అంశాల్లో లూలా నాయకత్వం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
సెర్బియా: విద్యార్థి ఉద్యమంతో అధికార మార్పు
సెర్బియా ఎన్నికల ఫలితాలు ఐరోపా రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచాయి. విద్యార్థి ఉద్యమం మద్దతుతో ఏర్పడిన 'స్టూడెంట్ లిస్ట్' పార్లమెంటు ఎన్నికల్లో 250 స్థానాలకు గాను 140 స్థానాలను గెలుచుకుంది. దీంతో అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌కు ఉన్న సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యానికి తెర పడింది. వుచిచ్‌కు మద్దతు ఇచ్చిన కూటమికి 103 స్థానాలు మాత్రమే లభించాయి. ఈ మార్పునకు దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమమే ప్రధాన కారణం. అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు, అధికార కేంద్రీకరణ, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతకు సంబంధించి విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రమంగా ఈ ఉద్యమానికి విస్తృత ప్రజా మద్దతు లభించింది. సమాజంలోని ఇతర వర్గాల అసంతృప్తితో విద్యార్థుల ఉద్యమం కలిసినప్పుడు, అది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగగలదని సెర్బియా అనుభవం చాటిచెప్పింది.
ఇజ్రాయిల్: నెతన్యాహు రాజకీయ ఆధిపత్యానికి గట్టి దెబ్బ
అక్టోబర్ 27న జరిగిన ఇజ్రాయిల్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి మెజారిటీని కోల్పోయింది. మొత్తం 120 స్థానాలున్న పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 61 స్థానాలు అవసరం. తుది ఫలితాల ప్రకారం నెతన్యాహు కూటమికి 53 స్థానాలు మాత్రమే వచ్చాయి.
గాడీ ఐసెన్ కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించాయి. మరోవైపు, అరబ్ నాయకత్వంలోని రెండు రాజకీయ శక్తులకు కలిపి 19 స్థానాలు వచ్చాయి. దీంతో ఏ ఒక్క కూటమికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించలేదు.
2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి, గాజాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం, సైనిక, భద్రతా వైఫల్యాలు, పాలస్తీనా సమస్య, ఇజ్రాయిల్ లోని అంతర్గత రాజకీయ విభేదాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయి. భద్రతా వైఫల్యాలపై విచారణ జరపాలని, ప్రభుత్వ విధానాలను మార్చాలని నెతన్యాహు వ్యతిరేకులు డిమాండ్ చేశారు.
అరబ్ పార్టీలకు లభించిన 19 స్థానాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. అవి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఐసెన్ కోట్ వర్గానికి మద్దతిస్తున్నాయి. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పార్లమెంటు సభ్యులతో చర్చల అనంతరం ప్రధానమంత్రి పదవికి ఐసెన్ కోట్ కు 67 మంది మద్దతు ప్రకటించగా, నెతన్యాహుకు 46 మంది మాత్రమే మద్దతు తెలిపారు. నిబంధనల ప్రకారం ఐసెన్ కోట్ కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొదట 28 రోజుల గడువు ఉంటుంది. అవసరమైతే మరో 14 రోజులు పొడిగించవచ్చు. పచ్చి మితవాద నాయకుడైన నెతన్యాహు తిరిగి అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
అమెరికా: ట్రంప్‌నకు వ్యతిరేకంగా డెమోక్రాట్ల భారీ విజయం
ఈ నాలుగు ఎన్నికల్లో నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికలు అంతర్జాతీయ రాజకీయాల పరంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగినవి. ఇవి అధ్యక్ష ఎన్నికలు కానప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన మధ్య కాలంలో జరిగిన ఎన్నికలు కావడంతో ఆయన ప్రభుత్వ విధానాలపై ప్రజాభిప్రాయానికి పరీక్షగా మారాయి.
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభలోనే కాకుండా సెనేట్ లోనూ మెజారిటీ సాధించారు. అంటే కాంగ్రెస్‌లోని రెండు సభలపైనా రిపబ్లికన్ల ఆధిపత్యం ముగిసి, డెమోక్రాట్ల చేతుల్లోకి అధికారం వెళ్లింది.
రిపబ్లికన్లకు బలమైన పట్టున్న ప్రాంతాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు సాధించడం విశేషం. కాన్సాస్, టెక్సాస్, దక్షిణ కరోలినా, ఒహియో వంటి రాష్ట్రాల్లో గణనీయమైన విజయాలు నమోదు చేశారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత కాన్సాస్‌లో డెమోక్రాట్లు ఒక సెనేట్ స్థానాన్ని గెలుచుకున్నారు. టెక్సాస్‌లోనూ సెనేట్ స్థానంతో పాటు గవర్నర్ పదవిని కైవసం చేసుకున్నారు.
ట్రంప్ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటం ఈ ఫలితాలకు కారణం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్థిక అనిశ్చితి, ఇరాన్‌తో యుద్ధం, ప్రభుత్వ నిర్వహణలో వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎన్నికలకు ముందే ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఎన్నికల అనంతరం నిర్వహించిన సర్వేల్లో దాదాపు సగం మంది ఓటర్లు అధ్యక్షుడి విధానాలను వ్యతిరేకించేందుకే తాము ఓటు వేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్‌లోని రెండు సభలపై డెమోక్రాట్లకు ఆధిపత్యం లభించడంతో...ట్రంప్ ప్రభుత్వం చట్టాలు చేయడం, ఉన్నత పదవులకు నియామకాలు చేపట్టడం, వివిధ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంపై పరిమితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరుపై విచారణ జరిపే అవకాశం డెమోక్రాట్లకు లభిస్తుంది. అందువల్ల ఈ ఫలితం డెమోక్రాట్లకు కేవలం ఎన్నికల విజయమే కాదు. ట్రంప్ రాజకీయ అధికారానికి గట్టి ఎదురుదెబ్బ.
నాలుగు ఎన్నికలు నేర్పుతున్న పాఠాలు
ఈ నాలుగు దేశాల రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన రాజకీయ ధోరణులు కనిపిస్తాయి.
జాతీయవాదం, వలసదారుల వ్యతిరేకత, మతపరమైన సమర్థనలు, బలమైన నాయకుడనే ప్రచారం, ప్రజలను ఆకర్షించే నినాదాల ఆధారంగా అనేక దేశాల్లో మితవాద శక్తులు అధికారంలోకి వచ్చాయి. అయితే బ్రెజిల్, సెర్బియా, అమెరికా ఎన్నికల ఫలితాలు ఈ రాజకీయ ధోరణిని ఓడించడం సాధ్యమేనని నిరూపించాయి.
సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నాయకత్వం, అధికార కేంద్రీకరణ, భిన్నాభిప్రాయాలను సహించని ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమైనప్పుడు ఎన్నికల ద్వారా రాజకీయ మార్పు సాధ్యమవుతుందని ఈ ఫలితాలు చూపించాయి.
ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదు. భావప్రకటనా స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పత్రికా స్వేచ్ఛ, ప్రతిపక్ష అభిప్రాయాలకు గౌరవం, ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ జవాబుదారీతనం కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగాలే. విద్యార్థి ఉద్యమాలు విస్తృత పౌర సమాజంతో కలిసినప్పుడు, అవి ఇప్పటికే ఉన్న రాజకీయ శక్తులకు ప్రత్యామ్నాయంగా ఎదగగలవు. సెర్బియా ఎన్నికలు ఈ అంశాన్ని అంతర్జాతీయ చర్చలోకి తీసుకొచ్చాయి.
మరోవైపు ఆర్థిక అసంతృప్తి, సామాజిక అసమానతలు కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్రెజిల్, అమెరికా ఎన్నికల్లో నిత్యావసర వస్తువుల ధరలు, ఉపాధి, వేతనాలు, సామాజిక భద్రత, సంపదలో అసమాన పంపిణీ వంటి అంశాలు ప్రజల రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేశాయి.
కేవలం కుల, మత, జాతీయవాద భావాలను రెచ్చగొట్టడం ద్వారా దీర్ఘకాలం ప్రజల మద్దతును నిలుపుకోవడం సాధ్యం కాదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, అంతర్జాతీయ మితవాద రాజకీయ శక్తుల మధ్య పరస్పర సహకారం, మద్దతు ఉన్నప్పటికీ ఈ నాలుగు దేశాల్లోనూ వాటికి ఎదురుదెబ్బలు తగలడం.
ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయన్నది ఎన్నికల్లో విజయం సాధించిన శక్తులు ప్రజల ఆకాంక్షలను ఎంతవరకు నెరవేరుస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కేవలం బలమైన నాయకత్వం గురించిన హామీల కోసం ఎదురుచూడటం లేదు. ఆర్థిక భద్రత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కులు, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారు.
మితవాద రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోసం...!
ఇది వామపక్షాలకు కూడా ఒక ముఖ్యమైన పాఠం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, శ్రామిక ప్రజల హక్కుల చుట్టూ విస్తృతమైన ఐక్యతను నిర్మించకపోతే మితవాద శక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల విజయాలు శాశ్వత రాజకీయ ప్రత్యామ్నాయంగా మారవు. ఇప్పుడు అవసరమైంది కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురాగల ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించడం.
(‘గణశక్తి’ సౌజన్యంతో)
అనిమేష్ రాయ్








కామెంట్లు (0)