అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో 10వ తేదీన సదస్సులో ఇటీవల అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం, కొద్ది రోజుల క్రితం వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ‘ఎకనామిక్స్ టైమ్స్’ పత్రిక ప్రత్యేక వ్యాసంలో ''వాటర్ మ్యాన్''గా అభివర్ణించిందని దీనికి ప్రతిగా బాబు గారికి 'స్టాండింగ్ ఒవేషన్' (మొత్తం కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి గౌరవించడం) రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ చేయించారు. దీనిని టిడిపి సోషల్ మీడియాలో, పత్రికల్లో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 1996 నాటి అంటే మూడు దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తేనే రాష్ట్రమంతా నీటితో కళకళలాడుతుందని వాటర్ మ్యాన్ అని ప్రశంసించారనుకుంటే వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో దీనికి భిన్నంగా కనిపిస్తోంది! ఆ పత్రికలో రాసినట్లుగా ‘నాడు సిఇఒ, సి.ఎం నుండి నేడు వాటర్ మ్యాన్ వరకు’ నాయుడు గారి సుదీర్ఘ ప్రయాణం కొత్త దశలోకి వచ్చినట్లు, నాడు ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో హైదరాబాద్‌ను నిలిపి ఒక సిఇఒగాను... నేడు ఈ ప్రాజెక్టులను ప్రారంభించడంతో వాటర్ మ్యాన్‌గాను కీర్తించారు.
రాష్ట్రంలో నీటి పరిస్థితులను పరిశీలిస్తే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్న సంగతి అందరికీ తెలిసినదే! ఇదే కలెక్టర్ల సదస్సులో చెప్పిన లెక్కల ప్రకారం క్షేత్ర స్థాయి నివేదికల ఆధారంగా చూసినా గతేడాది (2025 సెప్టెంబర్) ఇదే సమయానికి రాష్ట్రంలో రిజర్వాయర్లలో 85 శాతం నీరు ఉండేది. ఇప్పుడు కేవలం 57 శాతం మాత్రమే ఉంది. రాయలసీమలో అయితే మరింత దారుణ పరిస్థితులు ఉన్నాయి. తెలుగు గంగ ప్రాజెక్టుకు 40 ఏళ్ల క్రితం 2.75 లక్షల ఎకరాలకు నీరివ్వాలని మొదలైతే ఇప్పుడు 20 వేల ఎకరాలకు కూడా నీరు వెళ్లడం లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో రాయలసీమలో కేవలం 40 శాతం మాత్రమే సాగు జరిగింది. భూగర్భ జలాలు 12-20 మీటర్లకు పడిపోయినట్లు, పాడి పశువుల మేత లేక పాల ఉత్పత్తి 75 శాతం తగ్గినట్లు అక్కడ రైతాంగం గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు నేడు ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు ఎండిపోయి తోటపల్లి బ్యారేజీలో 0.98 టిఎంసిల నీరు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో రైతులు నీటి ఎద్దడి పంటలు వేయవద్దని, మెట్ట పంటలు వేయమని మంత్రులే సూచిస్తున్నారు. రాష్ట్రంలో 65 చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లో మరీ దారుణమైన పరిస్థితులున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కేవలం 36 శాతం మాత్రమే నీటితో ఉన్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజి సంగతి చూస్తున్నాం. సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 80-90 శాతం వరకు అన్ని రిజర్వాయర్లు నిండి ఉండాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యూసి) ప్రకారం చూసినా 70 శాతం దాటితేనే సేఫ్ జోన్. 50 శాతం దిగువ ఉంటే అత్యవసర పరిస్థితి. వాస్తవంగా ఉండాల్సిన 80-85 శాతంలో 57 శాతమే ఉన్నదంటే 23-28 శాతం కొరత ఉన్నదన్నమాట! వర్షాలు ముగిసిన తరువాత అక్టోబర్ నాటికి రిజర్వాయర్లలో ఉన్న నీరే మళ్లీ జూన్ వరకు ఉపయోగించాలి. అంటే రాబోయే ఏడాది కూడా ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే అర్థమైపోతుంది. అందుకే ప్రభుత్వం కూడా సాగునీటికి ఉన్న రిజర్వాయర్లలో నీరు ఎలాగూ సరిపోదని గ్రహించే తాగునీటికి మొదటి ప్రాధాన్యత అని చెబుతున్న పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు వుండగా, నీటి విషయంలో ఎంతో ప్రగతి సాధించినట్లు ఇంతటి ఘనత మరెవరూ సాధించలేరన్నట్లు కీర్తించుకోవడం విడ్డూరంగా ఉంది!

వ్యాసకర్త : సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వి.వి. శ్రీనివాసరావు







కామెంట్‌లు (0)