గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజంతర్ మంతర్ నుండి 'ఢిల్లీ చలో' వరకు...

5 గంటల క్రితం

From Jantar Mantar to Delhi Chalo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 05:44 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

​గత కొన్ని నెలలుగా, భారతదేశంలో మూడు విభిన్నమైన నిరసన ధోరణులు వెలువడ్డాయి- కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, వామపక్ష విద్యార్థి సంఘాల నిరసనలు, కాంగ్రెస్, 'ఇండియా' వేదిక నేతృత్వంలోని ప్రచారాలు. ఈ ధోరణులు చాలా వరకు విడివిడిగా రూపుదిద్దుకున్నప్పటికీ, ప్రజాస్వామ్యం, నిరసన, పౌర హక్కులు, రాజకీయ, ఎన్నికల ప్రక్రియల పారదర్శకతపై ఉన్న ఆందోళనల చుట్టూ క్రమంగా ఏకమయ్యాయి. విభిన్న అసంతృప్తులను, వర్గాలను ఒకచోటకు చేర్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద సవాల్‌గా మార్చగల సామర్థ్యమే వాటి ప్రాముఖ్యత.

కొత్తగా వెల్లువెత్తుతున్న నిరసనలు

ఈ ఆందోళన మొదటి దశ జూన్ - జులై నెలల్లో జంతర్ మంతర్‌లో జరిగింది. ఇది విద్యా సంస్కరణలు, నీట్‌ ‌పరిక్షాప్రతాల లీకులు, (అప్పటి) విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌పై దృష్టి సారించాయి. ప్రజల అసంతృప్తిని కూడగట్టడంలో సి.జె.పి కీ0లక పాత్ర పోషించింది. వీధుల్లోకి భారీ సంఖ్యలో యువతను ఆకర్షించింది. అక్కడ విలక్షణమైన హాస్యం, సృజనాత్మకత మేళవింపుతో యువశక్తి తమ సమస్యలను వినిపించింది.

​ పాలకవర్గంపై అసంతృప్తి వ్యక్తీకరణ కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే పరిమితం కాదని, రాజకీయ ప్రమేయం లేని అసంతృప్తిని ఇప్పటివరకు తక్కువగా అంచనా వేస్తున్నట్లు సి.జె.పి నిర్వహించిన ఉద్యమం సూచిస్తుంది. కేంద్ర మంత్రి రాజీనామా ఆ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది, నికరమైన ప్రజా ఒత్తిడి రాజకీయ రాయితీలను రాబట్టగలదని నిరూపించింది.

గాంధీ జయంతి రోజున, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి, ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అవకతవకల కారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద 700 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్టోబర్ 10న జంతర్ మంతర్ 2.0 కోసం కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మరింత తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంది. రెండు రోజుల తరువాత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ‘ఇండియా’ ‌వేదిక నాయకులు సెంట్రల్ ఢిల్లీ నుండి అపూర్వమైన రీతిలో 'ఢిల్లీ చలో' మార్చ్ నిర్వహించారు.

ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కుపై విస్తరిస్తున్న పోరాటం ఈ ప్రజా ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్నది. 2026 సెప్టెంబర్ ప్రారంభం నాటికి, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ముసాయిదా ఓటరు జాబితాల నుండి 13.37 కోట్ల మంది పౌరుల పేర్లు తొలగించబడ్డాయి - ఇది ‘సర్’ చేపట్టక మునుపు ఉన్న ఓటరు జాబితాలో 14.1 శాతానికి సమానం.

‘సర్’ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లను తొలగించే అవకాశం మెండుగా ఉన్నదనే ఆందోళన రేకెత్తిస్తోంది. పేర్లను తొలగించడానికి ఉపయోగించే కేంద్రీకృత సాఫ్ట్‌వేర్, విధానాల విశ్వసనీయతపై ఆందోళనల దృష్ట్యా, ఏకపక్ష తొలగింపునకు వ్యతిరేకంగా తగిన రక్షణలతో ఈ సవరణ పారదర్శకంగా, ధృవీకరించదగినదిగా ఉందా లేదా అనేది ఇవాళ ప్రధాన ప్రశ్నగా నిలిచింది.

ఓటర్ల తొలగింపుపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ దాఖలు చేసిన రోజునే ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నిర్వహించబడింది. ఓటర్ల జాబితా నుండి ఏకపక్ష తొలగింపునకు వ్యతిరేకంగా రక్షణ ఉండాలని, ఇప్పటి వరకు తొలగించిన జాబితాలను ఆడిట్ చేయడానికి అనుమతించాలని, ఎన్నికల సంఘం పని తీరులో పారదర్శకతను ప్రదర్శించాలని, అలాగే ‘సర్’ ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది ప్రజా సమీకరణ, ప్రతిపక్షాల సమీకరణ, నిరోధక చర్యల కలయిక యొక్క రాజకీయ ప్రభావం చెబుతుంది. కార్యనిర్వాహక నిర్ణయాలు న్యాయ పరిశీలన నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా, రాజ్యాంగ హక్కులను న్యాయ సమీక్ష ద్వారా కాపాడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని డిమాండ్ చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు విభేదించినట్లు వెలువడిన నివేదికలు ఎన్నికల సంఘం పనితీరుపై నెలకొని ఉన్న సందేహాలను మరింత బలపరిచాయి. దీంతో ‘సర్’ ప్రక్రియపై ప్రతిపక్షాలు తమ వ్యతిరేకతను ముమ్మరం చేశాయి. ఎన్నికల నిర్వహణ అనేది ప్రజాస్వామిక జవాబుదారీతనంతో కూడుకుని ఉండాలని డిమాండు చేస్తున్నాయి.

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ

ఓటరు జాబితా ప్రక్షాళనకు వ్యతిరేకంగా, ఎన్నికల సంఘం ఎన్నికలను నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తుచేస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అక్టోబర్ ప్రారంభం నుండి ఈ ఆందోళనలు ఊపు అందుకోవడంతో ప్రతిపక్ష రాజకీయాల్లో గణనీయమైన మార్పునకు దారి తీసింది. ‘సర్’ ప్రక్రియ రద్దు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు ఇంతకు ముందు అసాధ్యమైనవిగా భావించబడ్డాయి. కానీ తాజాగా నిరసనలకు అవే డిమాండ్లు కేంద్ర బిందువుగా మారాయి. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ అన్న అంశాన్ని కూడా ముందుకు తెచ్చింది. ఈ తాజా అంశాలు పార్లమెంటు, న్యాయస్థానాల సంస్థాగత పరిధులను దాటి వీధుల్లోకి వచ్చి చేరాయి. తగిన రక్షణలు లేదా సమర్థవంతమైన నివారణలు, పరిష్కారాలు లేకుండా అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా మినహాయించినప్పుడు, ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య బద్ధతకు ఎంత మాత్రం గ్యారంటీ ఇవ్వలేదు. ఎన్నికల ప్రజాస్వామ్యం నుండి ఎన్నికల నిరంకుశత్వం దిశగా సాగుతున్న పరిణామాల పట్ల సహజంగానే ఆందోళనలు తలెత్తుతాయి. దేశంలో ప్రజాస్వామ్య పతనం ఏ స్థాయిలో ఉందో ఇది తెలియచెబుతోంది.

అధికారపక్షం బలహీనత

ప్రస్తుత పరిణామాలు బిజెపి ఆధిపత్యంలోని దుర్బలత్వాలను బట్టబయలు చేస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికలలో పార్లమెంటరీ మెజారిటీని సాధించడంలో బిజెపి విఫలమవడంతో, ఆ పార్టీకి ఎదురు లేదు, తిరుగు లేదు అన్న భావన ఇప్పటికే పటాపంచలు అయిపోయింది.

ఎన్నికల సంస్థాగత నిర్మాణాన్ని తమ పార్టీ సంస్థలకు అనుగుణంగా పునర్నిర్మించుకోవడానికి, ఎన్నికల ఎదురుదెబ్బ పునరావృతం కాకుండా నిరోధించడానికి, అధికారంలో శాశ్వతంగా తిష్ఠ వేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కొద్దీ ఈ ఆందోళనలకు ఆజ్యం పోసినట్లయింది.

రాజకీయ పరిష్కారాలను అందించలేకపోయిన మోడీ ప్రభుత్వం, ముఖ్యంగా యువతలో ఎదురవుతున్న అసంతృప్తిని అణచివేయడానికి బలప్రయోగం మీద ఆధారపడింది. అయితే, అటువంటి అణిచివేత చర్యలు ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి గల రాజ్యాంగబద్ధమైన హక్కు నిరాకరణకు గురికావడంపై ఉన్న తీవ్రమైన ఆందోళనలను మరుగుపరచలేవు. అరాచకాన్ని రెచ్చగొడుతున్నారని లేదా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రతిపక్షం, సి.జె.పి, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని నిందించడం ద్వారా ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణల నుండి తప్పించుకోలేదు. ఎన్నికల ద్వారా మాత్రమే అధికార మార్పిడి జరగాలని బిజెపి సుద్దులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది.

ఎన్నికల ప్రక్రియనే తొత్తడంగా మార్చి, ఎన్నికయిన ప్రభుత్వాలనే చీల్చి, కూల్చి అక్రమ మార్గాల ద్వారా అనేక రాష్ట్రాలలో అధికారం చేపట్టిన బిజెపి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడాన్ని ప్రజలు విశ్వసించడం లేదు. అణచివేతను ఆశ్రయించడం ద్వారా, ప్రభుత్వం తన రాజకీయ ఆధిపత్య పరిమితులను బయట పెట్టుకుంది. యువతకు, పాలక వర్గానికి మధ్య ఉన్న అంతరాన్ని, అలాగే అది నియంత్రించే సంస్థలపై ఉన్న నమ్మకాన్ని మరింత దిగజార్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే, అది తన పట్టును కోల్పోతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ రోజున ప్రజాస్వామ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కు గురించిన పోరాటం కీలకమైన అంతిమ పోరాటం. ఈ పరిణామాలు కొత్త రాజకీయ సమీకరణలకు దారితీయనప్పటికీ, అవి నిరసనల జాగాను విస్తరించాయి, కార్యనిర్వాహక అధికార కేంద్రీకరణపై తీవ్రమైన విమర్శలకు దారితీశాయి.

అన్నిటికంటే ముఖ్యంగా, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఏజెంటుగా మారిందనే అభిప్రాయం స్థిరపడింది. కాబట్టి ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతపై ఉన్న అనుమానాలను తొలగించి, సంస్థాగత స్వయంప్రతిపత్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

నానాటికీ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను మితవాద శక్తుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్థిరమైన రాజకీయ అడ్డుకట్టగా మార్చగలమా లేదా అన్నదే ఇప్పుడున్న సవాలు. ఎన్నికల ప్రక్రియపై ఈ నిరసనల ఉధృతి ...విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై ఉన్న విస్తృత ప్రజా అసంతృప్తితో అనుసంధానం కాగలదా? వాటిని రాజకీయ మార్పుగా అనువదించగలదా? అనేదే మన ముందున్న ప్రధాన ప్రశ్న. సమాధానం కోసం మనం వేచి చూడాలి.


వ్యాసకర్త -జోయా హసన్‌

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - ప్రొఫెసర్ ఎమెరిటా )

‘హిందూ’ సౌజన్యంతో/


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్