మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐడిబిఐ-ఫెయిర్‌ఫాక్స్‌ ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు విఘాతం

1 గంట క్రితం

idbi ff toon.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 05:03 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఐడిబిఐ బ్యాంకు నియంత్రణాధికారాన్ని కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు బదిలీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి, బ్యాంకుల యాజమాన్య ఉనికికి, భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రశ్నలకు కేంద్రబిందువు అయింది.

దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలనే ఉన్నత ఆశయంతో ఏర్పాటుచేసిన ఐడిబిఐ, దేశ ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించటంలో విశేష పాత్ర పోషించింది. ప్రజాధనం, ఉద్యోగుల శ్రమ, ఖాతాదారుల నమ్మకమనే పునాది ప్రాతిపదికన నిర్మితమైన ఈ బ్యాంకింగ్‌ సౌధాన్ని విక్రయించదగిన వాణిజ్య ఆస్తిగా పరిగణించడం సమంజసం కాదు.

'ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' (ఐడిబిఐ) 1964 జులై 1న, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం ప్రకారం ఏర్పడి దేశ పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల ఆధునీకరణ, ఉత్పాదక సంస్థల విస్తరణ, వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామిక కార్యకలాపాలకు తోడ్పాటునందిస్తూ 2004లో బ్యాంకింగ్‌ సంస్థగా రూపాంతరం చెందింది.

కేవలం లాభాల ప్రాతిపదికన పనిచేసే సంస్థగా కాకుండా, ఉపాధి కల్పన, దేశీయ పొదుపు సమీకరణలో ముఖ్య పాత్ర, సమ్మిళితాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి వంటి ఉన్నత లక్ష్యాలతో ముడిపడిన ఆర్థిక చోదక శక్తిగా ఐడిబిఐ పనిచేసింది. సామాజిక భద్రతా కార్యక్రమాలకు తోడ్పడటం, కుటుంబాలకు, సూక్ష్మ వ్యాపార సంస్థలకు, చిన్న రుణ గ్రహీతలకు రుణాలను అందించటం, మూలధన మార్కెట్ల పురోగతిలో, బ్యాంకింగ్‌ సేవల విస్తరణలో, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోభివృద్ధిలో, వ్యాపార సంస్థల విస్తరణలో, ప్రజల పొదుపు సమీకరణలో బ్యాంకింగ్‌ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటంలో సుదీర్ఘకాలంగా విస్తృత బాధ్యతలను నిర్వహించిన ఐడిబిఐ బ్యాంకును విదేశీ యాజమాన్యానికి అప్పగించటం వలన దేశ ప్రజలకు కలిగే అదనపు ప్రయోజనం ఏమిటనేది మౌలిక ప్రశ్న.

దశాబ్దాల పయనంలో ఐడిబిడిలో ఏర్పడిన ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు, మూలధన అవసరాల నేపథ్యంలో, 2019లో ఎ‌ల్‌ఐసి ఆఫ్‌ ఇండియా ఐడిబిఐ బ్యాంకులో నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. అనంతరం రిజర్వు బ్యాంకు వర్గీకరణ, నియంత్రణా నిబంధనల ప్రకారం ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటురంగ బ్యాంకుగా పరిగణించింది. ఫెయిర్‌ఫాక్స్‌కు యాజమాన్య బదిలీ ప్రతిపాదన ముందు భారత ప్రభుత్వం 45.48 శాతం, ఎల్‌ఐసి 49.24 శాతం వాటాలను కలిగి ఉంది. అంటే ఈ రెండిటి వాటా 94.72 శాతం. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసి ఐడిబిఐలో ప్రధాన వాటాదారుగా మారి బ్యాంకు స్థిరీకరణ తోడ్పడటం కీలకాంశం.

ఐడిబిఐ బ్యాంకు వాటాల ఉపసంహణ ప్రక్రియ 2002లో ప్రారంభమైంది. ప్రభుత్వం ఒక్కో షేరుకు రూ. 94.42 గా నిర్ణయించినప్పటికీ, ప్రారంభ రిజర్వు ధరకు తగిన బిడ్‌లు రాకపోవడంతో... ఆర్థిక వ్యవహారాల క్యాబి‌నెట్‌ కమిటీ షేరు రూ. 81 చొప్పున, మొత్తం 60.72 శాతం మేర వాటాకు, సుమారు రూ.52,878 కోట్ల విలువైన ఫెయిర్‌ఫాక్స్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

స్వతంత్ర విలువ నిర్ధారణ ప్రమాణం ప్రకారం ఒక్కో షేరు విలువ రూ. 75.99 అని, ఈ ప్రమాణం కంటే ఎక్కువ ధర లభించిన కారణంతోనే ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌కు ఐడిబిఐ నియంత్రణాధికారాన్ని బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. విలువ నిర్ధారణలో ఉపయోగించిన అంచనాలు, ఆస్తుల విలువ మూల్యాంకన పద్ధతులు, భవిష్యత్‌ ఆదాయ అంచనా, పని తీరు సామర్థ్యం, విదేశీ సంస్థకు బదిలీ చేయకుండా ప్రభుత్వ యాజమాన్యాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాలపై పారదర్శకంగా చర్చ జరగకపోవడం తీవ్ర విమర్శకు గురైంది.

రిజర్వు బ్యాంకు 2017లో అధిక నిరర్ధక ఆస్తులు, నష్టాల కారణంగా ప్రాంప్ట్ కరెక్టివ్‌ యాక్షన్‌ పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ, అనంతరం మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2021లో ఆ పరిమితులను తొలగించింది. 2018లో 31.78 శాతంగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి, 2026 మార్చి నాటికి 2.32 శాతానికి, నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 0.15 శాతానికి తగ్గింది. మూలధన సంవృద్ధి నిష్పత్తి 26.65 శాతానికి చేరి, గణనీయమైన పనితీరును ప్రదర్శించింది. బ్యాంకు పునరుద్ధరణలో ఉద్యోగుల చేసిన కృషి, రుణాల వసూళ్ళలో కనపరిచిన ప్రగతి, ఇప్పటికే అమలుపరిచిన నిర్వాహణ సంస్కరణలు, సంస్థాగత సహకారంలో సాధించిన పురోగతి వంటివి విస్మరించకూడని విలువైన అంశాలు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐడిబిఐ బ్యాంకు సుమారు రూ. 9,513 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు మునుపు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, 26.6 శాతం నికర లాభంలో వృద్ధిని సాధించింది. డిపాజిట్లలో 12 శాతం పురోగతిని సాధించింది.

బ్యాంకింగ్‌ రంగంలో విదేశీ యాజమాన్య భాగస్వామ్య పరిమితి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యం, ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతున్న పరిస్థితులు, పెట్టుబడి వ్యూహాలకే ప్రాధాన్యతనిచ్చే విదేశీ సంస్థతో ఒప్పందం వంటి అంశాలు కూడా విమర్శలకు కారణమయ్యాయి. వివిధ ఆర్థిక నియంత్రణా సంస్థలలో ఉన్నత స్థానాలలో పదవీ విరమణ చేసిన వారికి ఫెయిర్‌ ఫాక్స్‌ గ్రూప్‌ తన కంపెనీల బోర్డులలో ఉన్నత పదవులకు అవకాశం కల్పించడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది.

కాథలిక్‌ సిరియన్‌ బ్యాంకులో పెట్టుబడి పెట్టడం ద్వారా, భారత బ్యాంకింగ్‌ రంగంలో ఫెయిర్‌ఫాక్స్‌ ఇప్పటికే సంబంధాలను కలిగివుంది. ఇప్పుడు ఐడిబిఐ యాజమాన్య బదిలీ ప్రక్రియ ద్వారా దేశీయ బ్యాంకింగ్‌ రంగంపై, దేశ ప్రజల పొదుపుపై విదేశీ యాజమాన్య పట్టు మరింత పెరిగేందుకు ఈ చర్య ఆస్కారం కలిగిస్తోంది.

ఐడిబిఐ బ్యాంకు-ఫెయిర్‌ఫాక్స్‌ ఒప్పందం, దేశ ఆర్థిక, బ్యాంకుల యాజమాన్య బదిలీ విధానంలో ఆందోళనకరమైన ధోరణికి ప్రతీక. గణనీయమైన ఆర్థిక పునరుద్ధరణ సాధించిన బ్యాంకు నిర్వహణాధికారాన్ని విదేశీ పెట్టుబడిదారులకు బదిలీ చేయడం దేశ ఆర్థిక రంగ, ప్రజల పొదుపు ప్రయోజనాలపరంగా సమర్ధించాల్సిన అంశం కాదు.

ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ, ప్రైవేటీకరణ స్థాయిని దాటిపోయి ప్రభుత్వ విధానాలు పరాయీకరణ దిశగా పయనించే పరిస్థితికి చేరాయనేదానికి ఈ ప్రక్రియ ఒక ఉదాహరణ. సుమారు 2000 శాఖలతో విస్తరించిన ఐడిబిఐలో ప్రభుత్వ మెజారిటీ వాటాను కొనసాగించడం, పారదర్శకంగా విలువ నిర్ధారణ చేయడం, ఉద్యోగుల, డిపాజిటర్ల హక్కులకు చట్టబద్ధత కలిగించడం, ఉత్పాదక రంగాలకు రుణాల మంజూరును పరిరక్షించడం, పార్లమెంటరీ కమిటీని నియమించడం వంటి చర్యలు తక్షణం చేపట్టాలి.

ఈ నేపథ్యంలో 2026 నవంబర్‌ 2,3 తేదీలలో ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగులు నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె, నిరాహారదీక్ష వంటి కార్యక్రమాలు కేవలం ఉద్యోగుల హక్కులు, పదోన్నతులు, నియామకాలు, సంక్షేమం వంటి డిమాండ్లకు మాత్రమే పరిమితమైనవి కావని, డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్‌ రంగ అభివృద్ధి లక్ష్యాలు, వాణిజ్య లాభాలు-సామాజిక బాధ్యతల మధ్య సమతౌల్యం, దేశీయ పొదుపుపై విదేశీ యాజమాన్యాల పెత్తనం వంటి అంశాలను విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళే ప్రచారాందోళన ఉద్యమంలో భాగంగా పరిగణించి, ఉద్యోగ సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలియజేయటం మన కర్తవ్యం.

kishore kumar g.jpg

వ్యాసకర్త : జి. కిషోర్‌ కుమార్‌

ఎస్‌.సి.జడ్‌.ఐ.ఇ.ఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్‌.ఐ.సి ఉద్యోగ సంఘం) జాయింట్‌ సెక్రటరీ,
సెల్‌: 9440905501

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్