నగర, పుర పాలికలకు ఆదివారం జరిగిన పోలింగ్ సందర్భంగా అధికారపక్షం బహిరంగ బరితెగింపునకు దిగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసింది. పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, రిగ్గింగ్, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్ల గెంటివేత, అపహరణలు, గృహ నిర్బంధాలు, అభ్యర్థులపై దాడులు, ఓటర్ల అడ్డగింత, యధేచ్ఛగా దొంగ ఓట్లు, ప్రలోభాలు... ఒకటేమిటి అన్ని రకాల అరాచకాలకు, టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలకు కూటమి ఎలాంటి జంకు గొంకు లేకుండా పాల్పడింది. ఈ దారుణాలన్నీ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా ప్రసారమయ్యాయి. అమాంబాపతు అక్రమాలను దగ్గరుండి చేయించింది కూటమి మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఇతర నాయకులు. ఈ దౌర్జన్యాలు బహిరంగ రహస్యాలు. ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో అధికారులు, పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూశారు. కొన్ని చోట్ల వాళ్లే వత్తాసు పలకడం రాజ్యం, ఎన్నికల వ్యవస్థ కూడబలుక్కొని తలపెట్టిన దుర్మార్గం. అర్బన్ లోకల్‌బాడీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజునే అధికార పక్షం హింసను ప్రేరేపించింది. సుప్రీం కోర్టు జోక్యంతో నామినేషన్ల స్వీకరణకు గడువు పెంపు, ఆ వరసలో పోలింగ్, కౌంటింగ్ తేదీల మార్పునకు ఎస్‌ఇసి దిగి రావాల్సి వచ్చింది. ఈ అనుభవంతోనైనా ఎస్‌ఇసి పోలింగ్‌నకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని అందరూ ఆశించారు. ఆదివారం పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తతలనుబట్టి ఎస్‌ఇసి చేష్టలుడిగి తోలుబొమ్మ అయిందని అర్థమవుతుంది.
పులివెందుల, కడప, మదనపల్లె, చిత్తూరు, చీమకుర్తి, మాచర్ల, చిలకలూరిపేట, తాడిపత్రి, తిరుపతి, అనంతపురం, గుంటూరు, విజయవాడ, ఇంకా అనేక చోట్ల అధికారపక్షం అమానుషాలకు ఒడిగట్టిందని ఎస్‌ఇసికి, పోలీసులకు ఫిర్యాదులందాయి. పులివెందులలో 80 పోలింగ్ కేంద్రాలకుగాను 70 చోట్ల ప్రధాన ప్రతిపక్ష వైసిపి ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా జరుపుతారని ఆ పార్టీ చీఫ్, మాజీ సిఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏజెంట్లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. మరోవైపు ఎస్‌ఇసి కార్యాలయం ఎదుట కూడా పలు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆందోళనలు జరిగాయి. డోన్, బేతంచర్లలో అధికారపార్టీ ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో యధేచ్ఛగా బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్ జరిగింది. అడ్డుకోబోయిన సిపిఎం అభ్యర్థులు, కార్యకర్తలను చెదరగొట్టారు. రౌడీషిట్ వంటి ఆరోపణలతో గృహనిర్బంధం చేశారు. తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం లేచింది. వేరే ప్రాంతాల నుంచి ఫేక్ ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించారు. ఇవన్నీ స్వల్ప సంఘటనలుగా ఎస్‌ఇసి, డిజిపి కొట్టిపారేశారు. చాలా ఆరోపణలకు ఆధారాల్లేవని ఫిర్యాదులను తిరస్కరించారు. అర్థరాత్రి దాటాక రాష్ట్ర వ్యాప్తంగా 12 వార్డులలోని 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించారు. సోమవారంనాటి రీపోలింగ్‌నకు సైతం ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించలేకపోవడాన్నిబట్టి ప్రభుత్వ ప్రభావానికి ఎస్‌ఇసి లోనైందని భావించాలి.
ఇన్ని వేల మంది సిబ్బంది, అన్ని వేల మంది పోలీసులు, సిసి కెమెరాల నిఘా, వెబ్‌కాస్టింగ్ పోలింగ్‌ను సజావుగా జరిపించలేకపోవడం ఎస్‌ఇసి, పోలీస్ ఘోర వైఫల్యాన్ని తెలుపుతుంది. అధికార దుర్వినియోగానికి ఆ వ్యవస్థలు గేట్లు ఎత్తి లైసెన్స్‌లు ఇచ్చాయని అనుకోవాలి. ఎన్నికలు జరిగిన 92 పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు 96 లక్షలకుపైన ఓటర్లుండగా 60 లక్షల పైచిలుకు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు ఎస్‌ఇసి అధికారికంగా వెల్లడించింది. పోలింగ్ శాతం 62.16 శాతం. గొడవలు జరిగిన తిరుపతిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 46.85 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్, రీపోలింగ్ దృశ్యాలు పోలైన ఓట్లు నిజమైన ప్రజాభిప్రాయానికి ప్రతిరూపం కాదు. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలంటే తాము ఏం చేస్తామో చెప్పి ఒప్పంచాలి. దౌర్జన్యాలు, దాష్టీకాలు, బెదిరింపులతో భయభ్రాంతులను చేసి కాదు. ప్రజాస్వామ్యం అందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యంలో అదే కీలకం. ప్రజల ఓటు హక్కును నలిపేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. యథా రాజా తథా ప్రజా అన్నట్లు కేంద్రంలో మోడీ ప్రభుత్వం సిఇసిని తన గుప్పెట్లో పెట్టుకోగా రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎస్‌ఇసిని శాసిస్తోంది. విజ్ఞులు ఆలోచించాలి. అర్బన్ ఓట్ల లెక్కింపు, పరిషత్ ఎన్నికలల్లోనైనా ఎస్‌ఇసి స్వతంత్రంగా వ్యవహరించాలి.








కామెంట్‌లు (0)