గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రభుత్వమే చట్టాలు ఉల్లంఘిస్తే...

6 గంటల క్రితం

akp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 05:22 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం, డి.ఎల్‌.పురంలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్‌కు సంబంధించిన క్యాప్టివ్‌ పోర్టు ప్రజాభిప్రాయసేకరణ ఈ నెల 15న ఎ.పి కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించింది. పరిశ్రమలు, పోర్టులు, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల వంటి పర్యావరణ ప్రభావం చూపే వాటిపై ప్రజాభిసేకరణ నిర్వహించడం చట్టబద్ధ ప్రక్రియ. పర్యావరణ అనుమతుల కోసం ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటక్షన్‌ యాక్ట్‌ 1986, ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఇ.ఐ.ఎ) నోటిఫికేషన్‌ 2006 నిబంధనలలో ప్రజాభిప్రాయసేకరణ ఒక దశ. దీంట్లో గాలి, తాగునీరు, నేల, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం, తీరప్రాంతం, సముద్రం, చెట్లు, కొండలు, సహజ నీటి ప్రవాహాలు, మత్స్యకారులు, రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానిక నివాసితులు, ప్రజల జీవనోపాధుల ప్రభావంపై ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలు, అనుమానాలకు వివరణ ఇవ్వాలి. ప్రాజెక్టు లేదా పోర్టుతో స్థానికుల జీవనోపాధి ఏ విధంగా దెబ్బతింటుంది? ముడిసరుకు, రవాణా, నిల్వ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఎలా నియంత్రిస్తారు? అనేది కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, యాజమాన్యం సవివర సమాధానం చెప్పాలి.​

ప్రజాభిప్రాయ సేకరణలో ఈ అంశాలపై మాట్లాడే అవకాశమే ప్రభుత్వం లేకుండా చేసింది. ప్రజల బతుకులు, పర్యావరణం, వంటి పలు అంశాలపై మాట్లాడాల్సిన వారిని రాకుండా అడ్డుకుంది. యాజమాన్యానికి, ప్రభుత్వ భజన చేసే వారిని ఎక్కువగా సమీకరించింది. వాస్తవ విషయాలు, అనుభవం కల్గిన వారికి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రవేశమే లేకుండా నిలువరించింది. ఎ.పి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజును ప్రజాభిప్రాయ సేకరణకు మూడు రోజుల ముందు నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావును వెళ్లకుండా మధ్యలోనే ఆపేసి పోలీసు స్టేషన్‌లో వుంచారు. ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండా అడ్డుకోవడం, గృహ నిర్బంధం చేయడం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనలకు విరుద్ధం. అడ్డుకోవాల్సిన అగత్యముందని పోలీసులు భావిస్తే ఏ చట్టం కింద అరెస్టు చేశారు? నిర్బంధించారో ఉత్తర్వు ఇవ్వాలి. ప్రజాభిప్రాయ సేకరణ, పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో జరగాలన్న ఇ.ఐ.ఎ నిబంధనలకు ఈ ప్రభుత్వం విలువ ఇచ్చినట్లులేదు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం, అప్పన్నపాలెం, గొరపూడిలో కొబ్బరి, అరటి, జీడిమామిడి, సరుగుడు తోటలు పెంచుకొని బతుకుతున్న తమ భూములను లారస్‌ ఫార్మా కోసం తీసుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు, పరిహారం కోర్టులో డిపాజిట్‌ చేశామంటూ వారిని భూముల్లోకి వెళ్లకుండా చుట్టూ ఇనుప కంచె వేశారు. రైతులను తమ భూముల్లోకి వెళ్లనీయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. ​

2013 భూ సేకరణ చట్టం సబ్‌ సెక్షన్‌ 1 ప్రకారం ప్రజావసరాల కోసం భూ సేకరణ చేపడితే, ప్రభావ కుటుంబాల్లో కనీసం 80 శాతం మంది అంగీకరించాలి. సెక్షన్‌ 3లో 1,5 క్లాజ్‌ల ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సమిష్టి భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు అయితే 70 శాతం కుటుంబాలు ఆమోదించాలి. ప్రతిపాదిత ప్రాజెక్టుతో ఎవరికి లాభం? ఎవరికి ఎంత నష్టం? ఆ నష్టాన్ని భర్తీ ఎలా చేయాలి? అనే అంశాలను పరిశీలించాలి. ఎంతమందికి జీవనోపాధికి లభిస్తుంది? ఎంతమంది నిర్వాసితులవుతారు? ఎంతమంది జీవనోపాధి కోల్పోతారు? పర్యావరణంపై ఎటువంటి ప్రభావం పడుతుందనేది పరిపూర్ణ అధ్యయనం చేయాలి. ప్రజా ప్రయోజనం ఎక్కువగా లేనప్పుడు, ప్రతిపాదిత ప్రాజెక్టు విరమించుకోవాలి. వాస్తవానికి ఈ నిబంధనలు, పద్ధతులేవీ ప్రభుత్వం పాటించడంలేదు. తమకు కావాల్సిన వారికి భూములు కేటాయించడం కోసం ఎంత విలువైన పంట భూములునైనా సేకరించడానికి ప్రభుత్వం వెనుకాడ్డంలేదు.

అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టకూడదు. అభివృద్ధి పేరుతో ప్రకృతి, జీవ వైవిధ్యం దెబ్బతింటే, ఆ ప్రకృతిలో భాగమైన మానవ జీవితాలు దెబ్బతింటాయి. ఒకప్పుడు ఇ.ఐ.ఎ నివేదిక తయారుచేసే నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి భవిష్యత్‌లో వచ్చే పరిణామాలు, పర్యవసానాలు, జీవనోపాధిపై పడబోయే ప్రమాదాల వంటి వాస్తవాలు నివేదికలో పొందుపర్చేది. క్రమంగా దాని స్వభావంలో మార్పు వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల కోసం యజమానులకు సహాయపడే నివేదికలు వుంటున్నాయి. పెట్టుబడిదారులకు అనుకూలమైన నివేదిక కన్సల్టెన్సీలు తయారుచేస్తున్నాయి. ప్రాజెక్టుతో నష్టం కంటే లాభమే ఎక్కువ వుండాలి. స్థానికుల జీవనోపాధి మెరుగుపడాలి. ఈ ప్రాథమిక ప్రమాణాలు పట్టించుకోకుండా ఇఐఎ నివేదిక తయారు చేయడం, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం, ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తెప్పించుకోవడం వెనుక పెట్టుబడిదారుల లాభాపేక్ష మాత్రమే కనబడుతుంది.

Kanta Rao.jpg

వ్యాసకర్త - గుల్ల కాంతారావు
సెల్‌ : 94900 994871


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్