వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నేతగా ఉమ్మడి రాష్ట్ర కేంద్రంలో పని చేసిన కామ్రేడ్ ఆర్. కుప్పానాయుడు అంకితభావం, చొరవ, త్యాగం, భవిష్యత్ తరానికి ఆదర్శం. పలుమార్లు అనారోగ్యం వచ్చినా ఏనాడూ వెరవలేదు. ఎన్నో ఉన్నత ఉద్యోగావకాశాలు వచ్చినా వాటన్నింటినీ వదులుకున్నారు. నిత్యం పేదల కోసం పరితపించే కుప్పానాయుడు చివరకు ఆ పేదల మధ్యే కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం రామసముద్రంలో ఆదమ్మ, ఎంకంనాయుడు దంపతులకు జన్మించిన కుప్పానాయుడు ఆంధ్రా యూనివర్సిటీలో పిహెచ్‌డి పట్టా పొందారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం వైపు అడుగులు వేసిన ఆయన ఎస్‌ఎఫ్‌ఐలో చేరి, విద్యార్థుల సమస్యలపై పోరాడారు. పిహెచ్‌డి అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చినా తిరస్కరించి, వెనుకబడిన విజయనగరం జిల్లాలో పని చేయాలనుకున్నారు. 1983లో నేరుగా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పేదలు, వ్యవసాయ కార్మికులతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సిపియం పూర్తికాలం కార్యకర్తగా, విజయనగరం జిల్లా కమిటీ సభ్యుడుగా కుప్పానాయుడు దీర్ఘకాలం పనిచేశారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. మొట్టమొదటి జిల్లా కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేశారు. కూలి, భూమి, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు...వంటి అనేక సమస్యలపై పేదలను కూడగట్టి పోరాడారు. సారా నిషేధానికి విశేష కృషి చేశారు. మెంటాడ మండలం ఆగూరు పంచాయితీలో 1994లో గిరిజనులను కూడగట్టి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన భూపోరాటం చేశారు. పురిటిపెంటలో కూలి రేట్లు పెంచాలని పెత్తందార్లకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలబడి పోరాడారు. అడ్డంకులు, దాడులూ ఎన్ని ఎదురైనా వెనుదిరగలేదు. నేడు పురిటిపెంటలో సాగుచేస్తున్న నాలావారి భూములకు పట్టాల సాధన ఆయన నేతృత్వాన సాగించిన పోరాట ఫలితమే! 1991లో సంభవించిన భారీ తుఫానులో మెంటాడ మండలం ఆగూరు వద్ద ఎం.ఎన్ ఛానలుకు పడిన గండిని పూడ్చేందుకు 18 గ్రామాల రైతులను కదిలించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి పూడిక పనులు చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా 1998లో గజపతినగరం, మెంటాడ, బొండపల్లి మండలాల్లోని 50 గ్రామాల్లో వారం రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. మరుపల్లి, కొణిశ, మెంటాడ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో 2007లో పెద్దఎత్తున భూపోరాటం నిర్వహించి 600 ఎకరాల ఫారెస్టు, వన సంరక్షణ సమితి భూములను పేదలకు అందేలా చేశారు. నిత్యం పేదల మధ్యే వుంటూ వారు పెట్టిందే తింటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కామ్రేడ్ కుప్పానాయుడు ఆశయ బాటలో నడవడమే ఆయనకు మనం అర్పించే నివాళి.
/ నేడు కామ్రేడ్ ఆర్.కుప్పానాయుడు వర్ధంతి /
- రెడ్డి శంకరరావు,
విజయనగరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సెల్: 9494333511






కామెంట్‌లు (0)