శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయోద్యమ స్ఫూర్తితో సాహిత్యోద్యమం

1 గంట క్రితం

national struggle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 05:15 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

బ్రిటీష్ పాలన అంతం కావాలని, దేశానికి స్వాతంత్య్రం సాధించాలని జరిగిన పోరాటంతోపాటే దేశంలో భూస్వామ్య, జమీందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా రైతాంగం తిరుగుబాటు చేసింది. భూస్వాముల కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం రైతులు సుదీర్ఘ పోరాటాలు సాగించారు. జమీందారీ వ్యతిరేక ఉద్యమాల్లో వేలాది మంది రైతులు ప్రాణ త్యాగాలు చేశారు. ఈ పోరాటాలకు కవులు, రచయితలు తమ రచనల ద్వారా అపూర్వమైన బలాన్ని చేకూర్చారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం భారత స్వాతంత్య్ర సమరానికి శంఖారావంగా మారింది. యువతలో దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని రగిలించింది. బ్రిటీష్ పాలన అంతమవడమే కాదు, దానికి అండగా నిలిచిన భూస్వామ్య, జమీందారీ వ్యవస్థలు కూడా రూపుమాపాలనే సంకల్పం ప్రజల్లో బలపడింది. తీవ్ర దోపిడీకి గురైన కౌలుదారీ రైతులు తమ హక్కుల పరిరక్షణకు చట్టాలు కావాలని ఉద్యమించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రవీంద్రనాథ్ టాగూర్, సుబ్రమణ్య భారతి, సరోజినీ నాయుడు, భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న, గరిమెళ్ల సత్యనారాయణ, జాషువా, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, సురవరం ప్రతాపరెడ్డి, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు వంటి కవులు, రచయితలు స్వాతంత్య్రోద్యమానికి ప్రాణం పోశారు. వారి రచనలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి ఉద్యమంలో విస్తృత భాగస్వామ్యానికి దోహదపడ్డాయి. భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న, జాషువా, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, సుంకర సత్యనారాయణ వంటి వారి సాహిత్యం, సామాజిక కృషి దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలను ఉద్యమంతో మరింత మమేకం చేశాయి. ఈ విధంగా స్వాతంత్య్రోద్యమ సాహిత్యం ప్రజా చైతన్యాన్ని విస్తరించి, ఉద్యమాన్ని మరింత సుసంపన్నం చేసింది.

స్వాతంత్య్రానంతరం దేశ నిర్మాణంలోనూ సాహిత్యం కీలక పాత్ర పోషించింది. జాతీయోద్యమం సాధించిన విజయాల ఫలితంగా కొంతమేరకు భూమిలేని వారికి భూములు అందే పరిస్థితి ఏర్పడింది. కౌలుదారీ చట్టాలు రైతులకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. చిన్న, సన్నకారు రైతులు నిలదొక్కుకునేందుకు సబ్సిడీలు, పరపతి సౌకర్యాలు అమలులోకి వచ్చాయి. నవభారత నిర్మాణానికి సాహిత్యం మరోసారి నడుంబిగించింది. ప్రేమ్‌చంద్, తాపీ ధర్మారావు, పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య ఆత్రేయ, కొండేపూడి లక్ష్మీనారాయణ, పులుపుల శివయ్య, వేములపల్లి శ్రీకృష్ణ, అవంత్స సోమసుందర్, వాసిరెడ్డి సీతాదేవి, శెట్టి ఈశ్వరరావు తదితరులు తమ రచనల ద్వారా ప్రజాస్వామ్య, లౌకిక, అభ్యుదయ విలువలను బలోపేతం చేశారు. స్వేచ్ఛను సార్థకం చేసుకోవాలంటే జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలు పూర్తిగా అంతరించాలనీ, కౌలుదారీ రైతులకు రక్షణ కల్పించే చట్టాలు రావాలనీ, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వ మద్దతు, సబ్సిడీలు కొనసాగాలనీ వారు నొక్కిచెప్పారు. దేశం ఆర్థిక స్వావలంబన సాధించాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు బలోపేతం కావాలని, బ్యాంకులు, బీమా సంస్థలు వంటి కీలక రంగాలు ప్రజా ప్రయోజనాలకు సేవ చేయాలని ప్రతిపాదించారు. సాధించిన స్వాతంత్య్రాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాటి రచయితలు సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఆయుధంగా మలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి భూస్వామ్య ఆధిపత్యం పునరుద్ధరించబడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజాపక్ష సాహిత్యానికి బలమైన పునాదులు వేశారు.

1991లో ప్రపంచీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయోద్యమ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న సంక్షేమ రాజ్య భావన క్రమంగా బలహీనపడింది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు వేగం పుంజుకున్నాయి. ప్రజా సంక్షేమానికి బదులుగా మార్కెట్ ఆధారిత ఆర్థిక విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ప్రభావం సాహిత్య రంగంపైనా పడింది. మార్కెట్ విలువలను ప్రోత్సహించే ధోరణులు బలపడగా, ప్రజల జీవన సమస్యలను ప్రతిబింబించే అభ్యుదయ సాహిత్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంది. 2014 తర్వాత మత ఆధారిత రాజకీయాలు మరింత బలపడటంతో ఈ మార్పులు వేగవంతమయ్యాయి. ఆర్థిక విధానాలు, సాంస్కృతిక విధానాలు పరస్పరం ఒకదానిని ఒకటి బలపరుస్తూ ప్రజా సంక్షేమ భావనను వెనక్కు నెట్టాయి. రైతాంగానికి సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, గిట్టుబాటు ధరలు క్రమంగా తగ్గిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడంతో సంక్షేమ కార్యక్రమాలు కోతలకు గురయ్యాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, విద్య వంటి రంగాల్లో ప్రభుత్వ బాధ్యత తగ్గి, ప్రైవేటీకరణ వేగం పెరిగింది. అభివృద్ధికి దోహదపడిన ప్రభుత్వ రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూనే, మార్కెట్ విధానాలను సమర్థించే సాంస్కృతిక ధోరణులను ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రభావం సాహిత్య సృజనలోనూ కనిపించింది.

ఈ పరిణామాల మధ్య సాహిత్యోద్యమం అనేక సవాళ్లను ఎదుర్కొంది. జాతీయోద్యమ కాలం నుంచి కొనసాగుతున్న అభ్యుదయ సాహిత్య సంప్రదాయంలో భిన్న ధోరణులు, విభజనలు చోటుచేసుకున్నాయి. అస్తిత్వవాద చర్చలు, కొత్త సామాజిక ప్రశ్నలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజా జీవన సమస్యలను కేంద్రంగా చేసుకున్న సాహిత్య ప్రవాహం నిలిచిపోలేదు. తెలుగుగడ్డపై ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలిచే రచనా సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఓల్గా, సినారె, గుంటూరు శేషేంద్ర శర్మ, రంగనాయకమ్మ, కళ్యాణరావు, బి.ఎస్. రాములు, కె.ఎన్.వై. పతంజలి, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, చాగంటి సోమయాజులు (చాసో), రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి రచయితలు తమ తమ రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని విస్తరించారు. వీరితోపాటు పెద్దగా ప్రచారంలోకి రాని అనేక మంది కవులు, రచయితలు కూడా ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ ప్రజాపక్ష సాహిత్య సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అందువల్ల మారిన కాలానుగుణంగా సమస్యల రూపాలు మారినా, ప్రజల పక్షాన నిలిచే సాహిత్య బాధ్యత మాత్రం మారలేదని ఈ కాలం స్పష్టం చేసింది.

ఈ కాలంలోనే మాతృభాషలో విద్యాబోధన స్థానంలో ఇంగ్లీషు మాధ్యమానికి ప్రాధాన్యం పెరిగింది. ఒకే దేశం, ఒకే భాష అనే పేరుతో ప్రాంతీయ భాషలపై దాడులు ముమ్మరమయ్యాయి. సాహిత్య పురస్కారాల ఎంపికలో ప్రభుత్వాల జోక్యం పెరిగింది. భాషాభివృద్ధికి దోహదపడిన ప్రచురణలు, ప్రోత్సాహకాలు నిర్వీర్యమయ్యాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని చేరవేసిన గ్రంథాలయాలు నేడు పుస్తకాలు లేక, సారథులు లేక వెలవెలబోతున్నాయి. గ్రంథాలయ సెస్సు వసూలు చేస్తున్నప్పటికీ, ఆ నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించడం లేదు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీవ్రమైంది. స్కూళ్లు, కళాశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో పాటు విద్యా నిర్వహణలోనూ ప్రైవేటీకరణ పెరిగింది. నవభారత నిర్మాణానికి మూలాధారమైన విద్య, విజ్ఞాన రంగాలు క్రమంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అందరికీ చదవడం, రాయడం నేర్పించి నిరక్షరాస్యతను నిర్మూలించాలన్న స్వాతంత్య్రానంతర లక్ష్యం అసంపూర్తిగానే మిగిలిపోయింది.

స్వాతంత్య్రోద్యమం ప్రజలకు అందించిన మరో గొప్ప విలువ లౌకికతత్వం. అన్ని మతాల ప్రజలు ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనను బలపరిచారు. రాజ్యం మతానికి దూరంగా ఉండాలన్న సూత్రాన్ని రాజ్యాంగం ఆమోదించింది. కానీ పాలక వర్గాలు దానిని అన్ని మతాలకు సమాన దూరం అనే వ్యాఖ్యానానికి పరిమితం చేసి, ఆచరణలో వక్రీకరించాయి. ఫలితంగా ఓటు బ్యాంకు రాజకీయాలు, మత విభజనలు, మతోన్మాద శక్తులు బలపడ్డాయి. లౌకికవాదం నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. అందువల్ల లౌకికవాదాన్ని కాపాడటం నేటి సాహిత్యోద్యమం ప్రధాన బాధ్యతగా మారింది.

మారిన విధానాల వల్ల గతంలో దళితులు, గిరిజనులు పొందిన అసైన్డ్ భూములకూ ముప్పు ఏర్పడింది. పరిశ్రమల పేరుతో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ప్రైవేటు వర్గాలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త భూములు ఇవ్వకపోగా, ఇప్పటికే వున్న అసైన్డ్ భూములను కూడా సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్లేలా విధానాలు రూపొందుతున్నాయి. స్వాతంత్య్రానంతరం ప్రజలు సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనేక నిబంధనలు, షరతులు మధ్య నేడు కుదింపునకు గురౌతున్నాయి. ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం, కార్మికులు, కూలీలు, అణగారిన వర్గాల పక్షాన నిలబడటం నేటి సాహిత్యం బాధ్యత. విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు జరుగుతున్న పోరాటాలకు, ఉద్యమాలకు సాహిత్యం బాసటగా నిలవాలి.

ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్లే, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాద శక్తులు వివిధ రూపాల్లో దాడులు కొనసాగిస్తున్నాయి. పశ్చిమాసియాలో చమురు సంపదపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇరాన్ ఆటంకంగా ఉందని ట్రంప్‌ దానిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అనేక దేశాలను తన సైనిక, ఆర్థిక బలంతో లొంగదీసుకున్నట్లే, లొంగని దేశాలను కూడా లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే వెనిజులాపై అర్ధరాత్రి దాడి చేసి దేశాధ్యక్షుడు మదురో, ఆయన భార్యను బలవంతంగా ఎత్తుకుపోయి న్యూయార్క్ జైలులో నిర్బంధించాడు. ప్రపంచ ప్రజాభిప్రాయం ఈ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలో ప్రజాభ్రిపాయ చుక్కెదురైనందునే ఇరాన్లో అమెరికా ఆటలు సాగలేదు. ప్రాణాలైనా ఇస్తాం గానీ లొంగేది లేదని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ బలాబలాలు ఏకపక్షంగా లేవని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పత్రికలు వ్యాఖ్యానించాయి. మన దేశంలో సాహిత్య ప్రియులు, కవులు, రచయితలు ట్రం‌ప్‌ దుశ్చర్యలను ఖండించి ప్రజల పక్షాన నిలిచారు.

రిటైర్మెంట్ అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యసభ సభ్యులుగా నియమితులవడాన్ని యువత ప్రశ్నిస్తోంది. మతం ఆధారంగా పౌరసత్వం, పౌరసత్వం ఆధారంగా ఓట్ల నమోదు వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఓట్లు ‌తొలగించే ప్రక్రియపై నిరసనలు పెరుగుతున్నాయి. అదానీ, అంబానీ కార్పొరేట్ యాజమాన్యంలో ఉన్న మీడియా ఏకపక్ష ధోరణిని అవలంబిస్తూ ఆధిపత్య శక్తులకు తొత్తుగా మారిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సాహిత్యం ప్రజల పక్షాన నిలవాలి. యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో సాహిత్యం వారికి అండగా నిలవాలి. ప్రజల పక్షాన నిలిచేందుకే 2026 జులై 11,12 తేదీలలో విజయవాడలో సాహిత్య సమ్మేళనం జరుగుతోంది. జాతీయోద్యమ స్ఫూర్తి నేటి సాహిత్యోద్యమ లక్ష్యం కావాలి.


- వ్యాసకర్త: పెనుమల్లి మధు, ఎం.బి.వి.కె ట్రస్టు చైర్మన్‌

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్