శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మణిపూర్ మంటలు!

5 గంటల క్రితం

manipur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 04:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మణిపూర్ మండుతూనే ఉంది. హత్యలు జరుగుతూనే వున్నాయి. ఈ హత్యలతో మణిపూర్ అల్లర్లను జాతుల మధ్య ద్వేషాలుగా చిత్రించాలన్నది పాలకవర్గ పన్నాగం. కాశ్మీరీలకు భూమి హక్కునిచ్చిన రాజ్యాంగ అధికరణలు 370, 35(ఎ) రద్దు చేసి...కాశ్మీర్ భూములను కార్పొరేట్లకిచ్చారు. లక్షద్వీప్ కేంద్ర పాలనాధికారి చేసిన రాజ్యాంగబాహ్య చట్టాలు, సంస్కరణలతో ప్రకృతి సంపద, సముద్ర తీరాలు, నిర్జన ద్వీపాలను కార్పొరేట్లకు పంచారు. ఈ పాలకవర్గ బహుళజాతి సంస్థల పక్షపాతమే మణిపూర్ మంటలకు కారణం.

కొండల్లో నివసించే కుకీలు, నాగాలు... మెయితీలుండే మణిపూర్‌ ‌లోయలో పిల్లలను చదివిస్తారు. చిన్న చితక పనులతో అద్దె ఇళ్ళలో బతుకుతారు. సంఘ్‌ పరివార్‌ ‌దాడులతో పిల్లల చదువు, పెద్దల బతుకుదెరువు పోయాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే శాంతిభద్రతలు, జీవన ప్రమాణాలు పెంచుతామని, మెయితీలకు ఎస్‌.టి హోదా ఇస్తామని మోడీ ప్రచారం చేశారు. రాజ్యాంగ విరుద్ధ వాగ్దానాలతో దోచుకున్న సీట్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పర్చారు. అభివృద్ధి నిధుల్లో 80 శాతం మెయితీలకు, 20 శాతం గిరిజనులకు ఇచ్చారు. మెయితీలకు ఎస్టీ హోదా ఇమ్మని మణిపూర్ హైకోర్టు రాజ్యాంగ విరుద్ధ తీర్పునిచ్చింది. ఇది అధర్మ తీర్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎస్టీ హోదా కోసం మెయితీలు ఉద్యమించారు. వారి తీవ్రవాద సంస్థలు, సంఘ్ పరివార్‌ వత్తాసు పలికాయి. తమ రక్షణ పోతుందన్న భయంతో క్రైస్తవ కుకి-జో గిరిజనులు దీనికి నిరసన తెలిపారు. వీరితో నాగాలు కూడా స్వరం కలిపారు. వీరిని అడ్డుకునేందుకు మెయితీలు హింసకు పాల్పడ్డారు.

కుకీలు నివసించే మణిపూర్ పర్వత ప్రాంతాల్లో బొగ్గు, చమురు, వజ్రాల నిధులున్నాయి. వాటిని తమ కార్పొరేట్లకు దోచిపెట్టాలని బిజెపి పథకం. రక్షిత, వన్యప్రాణ అభయారణ్య అడవులన్న సాకుతో కుకీల భూములను ఆక్రమించారు. వారిని తరిమేశారు. నల్ల మందు పండిస్తున్నారన్న సాకుతో కుకీల తోటలను ధ్వంసం చేశారు. ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, జాతుల వైషమ్యాలు కుకీలను నల్లమందు పంట వైపునకు, గిరిజన స్త్రీలను వ్యభిచారానికి నెట్టాయి. ఈ సమస్యలను పాలకులు పరిష్కరిస్తే కుకీలు నల్లమందు జోలికి పోరు. ఎయిడ్స్ వ్యాధి తగ్గుతుంది.

క్రైస్తవాన్ని ఆపడానికి జాతీయ పౌరసత్వ, జనాభా జాబితాలను తయారు చేయమని, 1951 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరించమని సంఘ్ పరివార్‌ గొడవ చేసింది. 1961 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరిస్తే 80 శాతం, 1951 ఆధారంగా సవరిస్తే 95 శాతం కుకీలు, నాగాలు పౌరసత్వం కోల్పోయి రాష్ట్రాన్ని వదలాలి. అల్లర్లలో 6 వేల ఆయుధాలు చోరీ అయ్యాయి. పోయింది వెయ్యేనని, 200 రికవరీ చేశామని ముఖ్యమంత్రి అన్నారు. అల్లర్లు జరిగిన చురాచందపూర్ లోనే కాక అనేక చోట్ల రాష్ట్ర రక్షణ దళాల భాండాగారాల నుంచే చోరీలు జరిగాయి. ఒక్కటీ పట్టుబడలేదు. పాలకుల, అధికారుల మద్దతుతో సంఘ్ పరివార్‌, మెయితీ సంస్థలకు ఈ ఆయుధాలు చేరాయి. కుకీలవి 20 వేల ఇళ్ళు, 200 చర్చిలు, 17 గుళ్ళు, 124 గ్రామాలు, వారి ఆస్తులు, వాహనాలు బుగ్గయ్యాయి.

మహిళలు, క్రీడాకారులు, కళాకారులు, మేధావులు మణిపూర్ అల్లర్లను నిరసించారు. కేంద్రం జోక్యం చేసుకొని, దమనకాండను ఆపాలని కోరుతూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ, 550 మంది పౌరసమాజ బాధ్యులు లేఖలు రాశారు. కాని రాష్ట్రపతిగాని, ​ప్రధానిగాని పట్టించుకోలేదు. వందల మంది మహిళల మానప్రాణాలు పోయాయి. ఇంత జరిగినా సర్వసైన్యాధిపతి ముర్ము మౌనంగా ఉన్నారు. దేశ ప్రతిష్ట, లౌకికత్వం, మానవత్వాల రక్షణకుగాను ప్రభుత్వాధిపతికి సూచనలివ్వడం దేశాధిపతి బాధ్యత. భారతీయుల ప్రతినిధిగా, భారత ప్రభుత్వ అధినేతగా మణిపూర్ మంటలను, దేశవ్యాపిత నిరసనలను ప్రధాని పరిష్కరించాలి. కార్పొరేట్ల కొమ్ము కాస్తూ దేశాన్ని బలిచేయరాదు.


- సంగిరెడ్డి హనుమంత రెడ్డి,

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం

జాతీయ కార్యదర్శి,

సెల్‌: 9490204545.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్