ఎర్రకోటపై జాతీయ జండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా (భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా (భారత్‌లో తయారీ) పిలుపునిచ్చారు. '' రండి, భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయించండి, కానీ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి '' అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులు ఇస్తూనే ఉన్నారు తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివృద్ధి చేయాలని, హైపర్ సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండు సంవత్సరాలుగా ఎవరు వద్దన్నారు! ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్ లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మన దేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా? మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా? మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడప దాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి. 2014 నుంచి అధికారంలో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో నలభయ్యవదిగా, చైనా 21వ స్థానంలో ఉంది. పైన చెప్పుకున్నట్లు తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చానని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు. మోడీ అధికారానికి వచ్చినపుడు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చి నెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్య లోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్య లోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బిజెపి నేతలు చైనా నుంచి మనం సెల్‌ఫోన్ల దిగుమతులను తగ్గించాం, చూశారా మోడీ ఘనత అంటూ అడ్డు సవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నది గనుక అనేక కంపెనీలు మన దేశంలోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతులు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు? మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి?
ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా ఒక భాగంగా ఉండాలని, వస్తువులను ఎగుమతి చేయాలని నీతి ఆయోగ్ నివేదికలు ఎప్పటికపుడు చెబుతూనే ఉన్నాయి, ఇదిగో ఫలానా రంగంలో అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొనే 2047 నాటికి లక్ష్యాలను చేరాలంటే మొత్తం 62 అంశాల జాబితాను రూపొందించి వాటిలో 12 రంగాలను గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇన్నేళ్ల నుంచి ఎందుకు విఫలమయ్యామనే అంశాన్ని మోడీ ఎప్పుడైనా చెప్పారా! ఈ రంగాల్లోకి అత్యధికంగా ప్రైవేటు పెట్టుబడులు వస్తేనే లక్ష్యాన్ని సాధించగలమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి చెప్పారు. మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో జిడిపి లో 25-26 శాతం ప్రైవేటు రంగ పెట్టుబడులు ఉండేవి, ఇటీవల 22 శాతానికి తగ్గాయి. అదీ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర రాయితీలు ఇచ్చినప్పటికీ పెరగకపోగా తగ్గాయి. దేశంలో ఉన్న ప్రైవేటు రంగమే ముందుకు రాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఎలా వస్తాయి? 2047 నాటికి దేశ జిడిపిని 30 లక్షల కోట్లకు చేరుస్తామని చెబుతున్నారు. అందుకు గాను వచ్చే 20 ఏళ్లు ఏటా పది శాతంపైగా వాస్తవ వృద్ధి రేటు ఉండాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దానికి ప్రాతిపదిక ఉందా? అలా జరిగితే ఇలా జరిగితే లక్ష్యాలను సాధించటం కష్టమేమీ కాదని చెప్పేవారు కోకొల్లలు.
ప్రపంచ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 28 శాతం కాగా మనం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ మన వాటా మూడు శాతం దగ్గరే ఉంది. 2004లో చైనా వాటా పది శాతం లోపుగానే ఉంది. విలువలో 625 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 4.66 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇదే కాలలో 22 శాతం నుంచి 17కు, ఐరోపా ప్రాంత వాటా తగ్గి 15 శాతానికి పరిమితం కాగా జపాన్ ఐదు శాతం కలిగి ఉంది. ఇదే సమయంలో మన వాటా 1.6-1.8 శాతం మధ్య ఉంది, అది 2014 నాటికి రెండు శాతానికి చేరింది. మోడీ ఏలుబడిలో ఇప్పటివరకు మూడు శాతానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ మూడింటి కంటే ఎక్కువగా చైనా ఉత్పత్తి ఉంది.
కరోనా సమయంలో చైనాలోని కంపెనీలన్నీ అక్కడి నుంచి దుకాణాలు ఎత్తేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడా చప్పుడు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన పని లేదు, ఉద్యోగ సృష్టి జరుగుతుంది. అమెరికా అంత అగ్రరాజ్యమే మా దేశంలో పెట్టుబడులు పెడతారా లేక మీ సంగతి చూడమంటారా అని బెదిరింపులకు దిగటం వెనుక పరమార్ధం ఇదే. చైనా ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల మీద కేంద్రీకరిస్తోంది, అది కేంద్రీకరణ తగ్గించిన రంగాల్లో మనం బలపడవచ్చని నీతి ఆయోగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 2000 సంవత్సరంలో ఆరు శాతమే. 2030 నాటికి 45 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ప్రపంచ కేంద్రంగా మన దేశాన్ని మారుస్తానని, మోడీ, ఆయన భజన బృందం చెబితే నమ్మేదెలా? పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే కొన్ని రంగాల్లో పురోగతి ఉండవచ్చు కానీ మా ఊర్లో మిరియాలు తాటికాయలంత అంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే.

ఎం. కోటేశ్వరరావు






కామెంట్‌లు (0)