మన దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ''నో ఎడ్యుకేషన్, ఎర్నింగ్స్, ట్రైనింగ్ (నీట్)'' (చదువుకోవడం, ఉద్యోగం చేయడం లేదా శిక్షణ పొందడం) లేదని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకటించింది. వీరు కాక మరో 2 కోట్ల మంది యువతకు ఏ ఉద్యోగం లేదని కూడా ఈ నివేదిక పేర్కొంది. సుమారు 11 కోట్ల యువ శక్తి ఇలా వుండడం తీవ్ర ఆందోళనకరం. 2021లో నిర్వహించిన 78వ విడత జాతీయ నమూనా సర్వే లెక్కల ఆధారంగా 'వికసిత్ భారత్- 2047 కోసం నైపుణ్యాభివృద్ధిని పునఃసమీక్షించడం' అనే రిపోర్టును నీతి ఆయోగ్ రూపొందించింది. ఈ నివేదిక అంచనాలకు కారణమైన అంశాలన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో సాధించిన పురోగతి ఏమీ లేనందున ఈ అంకెలు మరింతగా దిగజారే వుంటాయి. మార్చి 2026లో, అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వారి 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026' నివేదిక ప్రకారం 15-25 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, పట్టభద్రులలో 7 శాతం మంది మాత్రమే ఒక సంవత్సరంలోపు శాశ్వత (పర్మినెంట్) ఉద్యోగం పొందగలుగుతున్నారని పేర్కొంది. పట్టభద్రులలో 8.25 శాతం మంది మాత్రమే వారి అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలు పొందుతున్నారని నీతి ఆయోగ్ నివేదిక కూడా పేర్కొంది. ప్రపంచ నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని పాలకులు చెప్పే మాటలకు, యువత ఎదుర్కొంటున్న ఉపాధి కొరతకు ఎంత వ్యత్యాసం వుందో ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇందుకు నీతి ఆయోగ్ సూచించిన పరిష్కారాలు మాత్రం రోగమొకటైతే, మందు మరొకటిలాగ ఉంది.
నివేదికలో ఏముంది?
మారుతున్న సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడమే ఈ నివేదిక లక్ష్యంగా నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో 65.4 కోట్ల మంది (జనాభాలో 45.1 శాతం మంది) శ్రామిక శక్తిగా వున్నారు. ఇందులో 29.2 కోట్ల మంది (44.7 శాతం) వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు. వ్యవసాయేతర రంగాల్లో వున్న 34.2 కోట్ల మందిలో సర్వీసు రంగం (అన్ని రకాల సర్వీసు సెక్టార్లు)లో 19 కోట్ల మంది, నిర్మాణ రంగంలో 7.6 కోట్ల మంది, తయారీ రంగంలో 7.2 కోట్ల మంది వుండగా మైనింగ్, క్వారీ, విద్యుత్, నీటి రంగాల్లో 49 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని ఈ నివేదిక తెలిపింది. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతను ఐదు విభాగాలుగా వర్గీకరించి పరిశీలించారు. అవి ఒకటి పాఠశాల విద్య, రెండు ఉన్నత విద్య, మూడు రెగ్యులర్, నాన్-రెగ్యులర్ పని (ఫార్మల్- నాన్ ఫార్మల్), నాలుగు విద్య, ఉపాధి, శిక్షణలో లేని యువత, ఐదు మహిళలు. ప్రస్తుత యువతకు నైపుణ్యం తగినంతగా లేదంటూ ''డిగ్రీలను బట్టి కాకుండా, నైపుణ్యాలను బట్టి ఎంచుకోండి'' అని కంపెనీలకు ఈ నివేదిక సూచించడం ద్వారా నీతి ఆయోగ్ లక్ష్యం స్పష్టమైంది. ''శ్రామికులు, యువత నైపుణ్యాలను తిరిగి నేర్చుకోవడం, స్వయం ఉపాధి మార్గాలు పొందడం, స్థానిక డిమాండ్, అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా ఉండే శిక్షణల ఎంపికల అవసరం చాలా వుంది. పాఠశాల స్థాయిలోనే ''నైపుణ్య శిక్షణ ప్రారంభమై, విద్యార్థులలో పాతుకుపోవాలి'' అని ఈ సిఫారస్సు చేసింది.
సరైన నైపుణ్యం ఎందుకు లేదు?
'విద్యార్థులు, ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల వారు, ఇప్పటికే కళాశాల ఖర్చులు, ప్రైవేట్ ట్యూషన్ ఫీజుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు' అని నీతి ఆయోగ్ సరిగానే పేర్కొంది. దీని ఫలితంగా దిగువ కులాలు, వ్యవసాయ కుటుంబాల పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఇప్పటికే అనేక నివేదికలు ప్రకటించాయి. అయితే దీని మూలాలను నీతి ఆయోగ్ పట్టించుకున్నట్లు లేదు. సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మోయలేని భారంగా మారిన విద్యా వ్యాపారాన్ని గూర్చి ఈ నివేదిక ఒక్క మాట పేర్కొనలేదు. ఈ కుటుంబాల ఆర్థికశక్తి పెరగడానికి కీలకమైన భూ పంపిణీ, స్థిరమైన, భద్రతతో కూడిన ఉద్యోగాలు లేని స్థితిని పాలకుల విధానాల్లో భాగంగా ఈ నివేదిక పట్టించుకోలేదు. చాలామంది విద్యార్థులు ఇలా ఖర్చుపెట్టే పరిస్థితి లేనందున తమ కుటుంబాలను పోషించుకోవడానికి గ్రాడ్యుయేషన్ తర్వాత తక్కువ జీతం ఉన్నప్పటికీ ఏదో ఒక ఉద్యోగం లేదా ఆదాయం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనేది వాస్తవం. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కార్మికులను చౌకగా దోచుకుంటున్నారు.
కంపెనీలకు అనుగుణంగా సిఫారస్సులు
2014-15 నుండి 7.67 కోట్లకు పైగా యువతకు నైపుణ్య ఆధారిత శిక్షణ ఇచ్చినట్లు చెప్పిన ఈ నివేదిక 'ఇలా ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వడంపై కాకుండా, నైపుణ్యాలు ఉద్యోగాలకు, అధిక వేతనాలకు, కెరీర్ పురోగతికి దారితీసేలా చూడటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది' అని పేర్కొనడం ద్వారా కంపెనీల అవసరాల కోసం నైపుణ్యం అని స్పష్టమౌతోంది. ఆరవ తరగతి నుంచే ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెట్టడం, అప్రెంటిస్‌షిప్‌లను (పనిలో శిక్షణ) ఉపాధికి ప్రాథమిక మార్గంగా మార్చడం, అధికారిక డిగ్రీ అవసరం లేని విధంగా నైపుణ్యాలకు ప్రాధాన్యతనివ్వాలని చేసిన సిఫార్సులు సామాజిక అంతరాలను మరింతగా పెంచేలా ఉన్నాయి. సంపన్నులకు నాణ్యమైన విద్య, ఉన్నతమైన ఉద్యోగాలు, పేద, మధ్యతరగతి వారికి అప్రెంటిస్‌షిప్ విద్య, తక్కువ వేతనాల వ్యవస్థను బలపరచేలా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో వివిధ మంత్రిత్వ శాఖలు నైపుణ్య శిక్షణ కోసం రూ.34,000 కోట్లను కేటాయించాయని ''ఫలితాలు మాత్రం అస్థిరంగా ఉన్నాయి'' అని ఈ నివేదిక పేర్కొనడాన్నిబట్టి నైపుణ్యాన్ని నేర్పే పని నుండి ప్రభుత్వం తప్పుకుంటుందనే సందేహం బలపడుతుంది. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా ఇప్పటికే అనేక రంగాల్లో అమలు చేస్తున్న కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) మందుగా వున్న పిపిపి విధానాన్నే నైపుణ్య శిక్షణ, ఉపాధి సమస్యకు పరిష్కారంగా చూపిన నీతి ఆయోగ్ 'ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా, అలాగే అప్రెంటిస్‌షిప్‌లను కలిగి ఉండే డిగ్రీలు, డిప్లొమాల ద్వారా ఉన్నత విద్యలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచాలి' అని చెప్పింది. విశ్వవిద్యాలయాలు సాధారణ డిగ్రీలకు బదులుగా, పరిశ్రమల-అనుసంధాన కోర్సులను ఎక్కువగా అందించాలని సూచించింది.
ప్రస్తుతం 12వ తరగతి (ఇంటర్మీడియట్) స్థాయిల్లో వున్న విద్యాలయాల్లో వృత్తి విద్యా సబ్జెక్టులను నేర్పుతున్నవి నూటికి ఒకటికన్నా తక్కువ వున్నాయని, దీన్ని సరిదిద్దాలని పేర్కొంది. దీనికి పరిష్కారంగా ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు ఉన్న విద్యార్థులందరికీ జనరల్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ (జి.ఇ.ఇ.ఎస్)ను నేర్పాలని ప్రతిపాదించింది. విద్య, ఉపాధి మధ్య అప్రెంటిస్‌షిప్ విధానం కీలకమైనదని, అది సరిగా అమలు కావడం లేదని, అన్ని స్థాయిల్లో ఈ విధానం అమలు చేయాలని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ విధానాన్ని గతంలోనే ప్రధాని ప్రకటించారు. దాని అనుభవం ఏమిటో నీతి ఆయోగ్ చెప్పకుండా దాటవేసింది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్.ఎ.టి.ఎస్)ను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను కూడా ఇందులోకి తీసుకురావాలని చెప్పింది. కార్మికులను దేశవ్యాప్తంగా సమీకరించుకోవడానికి, ఏకీకృత విద్యా విధానం అనే కేంద్ర ప్రభుత్వ విధాన అమలులో భాగంగా ఈ సిఫారస్సు ఉంది. ''శ్రామికులు, యువత నైపుణ్యాలను తిరిగి నేర్చుకోవడం, స్వయం ఉపాధి మార్గాలు పొందడం, స్థానిక డిమాండ్, అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా ఉండే శిక్షణల ఎంపికల అవసరం చాలా వుంద’’ట! మహిళల్లో నైపుణ్యాన్ని పెంచడానికి సాయంత్రం, వారాంతం, హైబ్రిడ్, పార్ట్-టైమ్ ద్వారా శిక్షణ ఇచ్చే పద్ధతులను చేపట్టాలని, ఇప్పటికే ఉపాధి పొందుతున్న కార్మికులు నైపుణ్య సర్టిఫికేషన్ కోర్సులు లేదా పరిశ్రమకు అవసరమైన ఇతర ట్రైనింగ్‌ల కోసం ఒకటి నుండి మూడు నెలల వరకు వేతనం లేని సెలవు తీసుకునే అవకాశాన్ని పరిశ్రమలు కల్పించాలని ఈ నివేదిక 'ఉదారంగా' ప్రతిపాదించింది. ఆ కాలమంతా వారు ఎలా జీవించాలో, నైపుణ్యం సరిగా లేదని ఉన్న పనిని తొలగిస్తే ఏమి చేయాలో ఈ నివేదిక పేర్కొనలేదు.
ఉపాధి దేశ యువత ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. ఢిల్లీలో జరిగిన ఉద్యమం దేశ యువతలోని ఆందోళనను, ఆవేదనను పాలకుల ముందు ఉంచింది. దీనికి సరైన పరిష్కారం చూపకుండా చిట్కాలతో వైద్యం చేయాలని చూస్తే అది కచ్చితంగా మరింతగా వికటిస్తుంది. రోగానికి సరిపడ మందును యువతే గుర్తిస్తుంది.
- వి. రాంభూపాల్






కామెంట్‌లు (0)