శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇక ఫోటోలు, చిత్ర ప్రదర్శనలకూ సెన్సార్‌

26 నిమిషాల క్రితం

rehan.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:24 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఇబ్బంది కలిగించేదేదైనా లేకుండా చేయడమే మార్గమనే అప్రజాస్వామిక ధోరణి ఒకసారి తలకెక్కాక ఒక పట్టాన వదలదు. ప్రతిదీ తప్పుగా ముప్పుగా కనిపిస్తుంది. నోళ్లు మూసేయాలనీ జైళ్లలో తోసేయాలనీ రెచ్చగొడుతుంటుంది. విమర్శనాత్మక వ్యాఖ్యలు, పోస్టులపై ఇప్పుడు సాగుతున్న దాడి అలాంటిదే. ప్రత్యక్ష దాడితో పాటు పరోక్షంగా ఆయా ప్లాట్‌‌ఫామ్‌లకు చెప్పి బ్లాక్‌ ‌చేయించడం కూడా ఒక తంతుగా మారింది. అయితే అలా చేయించే ముందు సంబంధిత క్రియేటర్లకు చెప్పాలని తాజాగా న్యాయస్థానాలు ఆదేశిస్తున్నాయి. ఇక కేంద్రమేమో మీడియాకు ఒక భారీ తాఖీదు జారీ చేసింది. ఎవరూ ఏది ప్రసారం చేయాలన్నా వెనుకాడేటట్టున్నాయి ఆ నిబంధనలు, నియంత్రణలు. ఇవన్నీ ఒకటనుకుంటే ఇప్పుడు ఫోటోలు, చిత్రకళా ప్రదర్శనలపై పడ్డారు. అందులోనూ సాక్షాత్తూ ప్రియాంక వా‌ద్రా కుమారుడి షోపై. రెహాన్‌ ‌వాద్రా జెన్‌ ‌జీ ఆందోళనలను జంతర్‌‌ మంతర్‌, కన్నాట్‌ ‌ప్లేస్‌ ‌ఘటనలను ఫోటోలు తీసి పెట్టాడట. దానికి క్యాప్షన్లు గానీ నినాదాలు గానీ ఏమీ జోడించలేదు. నో ఐడియా ఈజ్‌ ‌ఫైనల్‌. ఏ భావం అంతిమం కాదు అని షోకు పేరు పెట్టాడు. మామూలుగా ఇలాంటివి జరిగే బికనూర్‌ ‌హౌస్‌‌కు డబ్బులు కట్టి తీసుకుని 105 ఫోటోలను ప్రదర్శనకు పెట్టాడు. అయితే వాటిలో కొన్ని అభ్యంతరకరంగా వున్నాయని భవనం చూసే రెసిడెంట్‌ ‌కమిషన్‌ అభ్యంతరాలు పెట్టింది. వినకపోవడంతో వెంటపడి 75 ఫోటోలు తీసేయించింది. అయితే ఇదేమీ అధికారిక ఆంక్షలతో కాదు, మామూలు నిబంధనల మేరకే అంటున్నారట. అలా అయితే మొదటే అనుమతించేవారు కాదు కదా. బహిరంగంగా సాగే ప్రదర్శనలను ఎవరైనా ఫోటోలు తీయొచ్చు, వేయొచ్చు. వాటినే ఒక చోట షో పెడితే తప్పేంటి? ఇంతకూ ఆయన ఇందిరా గాంధీ ముని మనవడు కావడమే కొంప ముంచిందా అని అడిగితే కావచ్చునేమో అన్నాడట రెహాన్‌.​

పొగడకపోతే పొండి!​

ఇది కూడా అలాంటి విశేషమే. ఈ మధ్య నటుడు ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ముంబాయిలో ‘ఓట్‌ ‌చోరీ’పై నిరసనలో పాల్గొన్నారని దేశం వదలిపోవాలనే ఉత్తుర్వులిచ్చారు. ఇమ్రాన్‌ అమీర్‌ ‌ఖాన్‌‌ మేనల్లుడు కూడా. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్‌ ‌దేశంలో రాజకీయ వ్యవహారాలలో పాల్గొనరాదని ఒక షరతు వుందని అధికారులు వెంటబడ్డారు. సిఇసి జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌రాజీనామా చేయాలని కోరడం, ఓటు హక్కు తొలగించరాదని కోరడం ఎలాంటి రాజకీయమని ఇమ్రాన్‌ ‌ఉదంతం ప్రశ్న లేవనెత్తింది. నిజానికి వీరికి ఒఐసి కార్డులిచ్చారు. ఓవర్‌ ‌సీస్‌ ఇండియన్‌ ‌సిటిజన్స్‌ అన్నమాట. అలాంటివారిని మోడీ సర్కారు ఎంతగా నెత్తిన పెట్టుకుందో అందరికీ తెలుసు. కానీ ఆయనను పొగడాలి తప్ప నిరసనలంటే ఎలా? కనుకనే మీరు వెనక్కు పోవాలని ఒత్తిడి పెట్టారు. అతనిప్పుడు కోర్టులో కేసేశాడు. ఏమవుతుందో చూడాలి. ఈ సందర్భంలోనే మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇలాంటి స్టార్‌ ‌కిడ్స్‌ ‌కనీసం పది మంది ఒఐసి జాబితాలో వున్నారట. ఆలియా భట్‌, అఖిల్‌ అక్కినేని, సన్నీ లియోన్‌, ఖత్రినా కైఫ్‌, జాక్విలిన్‌ ‌ఫెర్నాండెజ్‌, ఇంకా ఇంకా...వీరంతా వచ్చి పొగిడి పోవాలి గానీ తప్పులు చూపిస్తే ఒప్పుకుంటామా అంటున్నారట హోంశాఖ వారు!

నీలి సంద్రం నీదా డాన్‌‌?

నీలాకాశం నాదేలే... కావాలంటే ఇస్తాలే... నావన్నీ ఇక నీవేలే.. అని పాడతాడు ‘మిస్సమ్మ’లో ఎన్టీఆర్‌. ఇలాంటివే పాడాలని మన ట్రంప్‌ ‌గారి మహా ముచ్చట. కాకుంటే ఆయన ఉద్దేశాలు, వ్యూహాలు వేరు. ‘కెనడాను అమెరికాలో 52వ రాష్ర్టంగా ప్రకటిస్తాను. హర్మూజ్‌‌ను ట్రంప్‌ ‌జలసంధిగా పేరు మారుస్తాను’ అని తన లోకంలో తాను చెప్పుకుంటూ ప్రపంచం పైనా పెత్తనం కోసం అర్రులు జాస్తుంటాడు. మెక్సికో అగాథానికీ పేరు మార్చేశాడు. ఆయనకు ఈ మధ్య అట్లాంటిక్‌‌ మహాసమ్రుదానికో లేక ఫసిఫిక్‌‌కో తన పేరు పెట్టుకోవాలని కోరిక కలిగిందట. ఆ వేంటనే మన సుందర్‌‌ పిచాయ్‌‌కు ఫోన్‌ ‌చేశారు. నేనిలా పేరు మార్పిస్తే మీ గూగుల్‌ ‌సెర్చి మానేజ్‌ ‌చేయగలదా సుందర్‌ అని వాకబు చేశాడు. కేవలం మన వైపున్న పశ్చిమార్థ గోళంలో సముద్రాల పేర్లే మారుస్తాను గాని పూర్వార్థగోళం జోలికి పోనులే అని హామీ కూడా ఇచ్చాడట. అయితే గూగుల్‌ ‌పిచాయ్‌ ‌మాత్రం కుదర్దు డాన్‌ అని బదులిచ్చాట్ట. సముద్రాలు అందరివీ కదా...అని లైట్‌‌గా తోసేశాడట, ఈ సంగతి డాన్‌ ‌స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పి కోప్పడిపోయాడట. ఈ టాపిక్‌‌లో ఇంకా లోతుగా వెళితే ఏం తేలుతుందో మరి; చూద్దాం.

బొద్దింకకు పబ్లిసిటీ...

గతంలో సిజెఐ సూర్యకాంత్‌ అన్న మాటతో పుట్టుకొచ్చిన సిజెపి అనే కాక్రోచ్‌ ‌జనతా పార్టీ కావలసినంత ప్రచారం పొందింది కదా. ఇప్పుడా బాధ్యత ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌పరివార్‌ ‌తీసుకుందా? ఢిల్లీ రామ్‌‌లీలా మైదాన్‌‌లో రావణుడు, కుంభకర్ణుడి భారీ దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటారు కదా.. ఈ సారి స్వచ్ఛ డిల్లీ పేరుతో వారి పక్కనే పేద్ద బొద్దింక బొమ్మ కూడా పెట్టి తగలబెట్టారు. పైకి శుభ్రత గురించి చెప్పడానికి అన్నారు గానీ వాస్తవంలో వారి ఆంతర్యం వేరు. దీనికి తగ్గట్టే సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్‌ ‌దీప్కే కూడా స్పందించారు. ‘మాకు ఉచిత ప్రచారం కల్పిస్తామంటే వద్దంటామా? మరీ హ్యాపీసు’ అన్నాట్ట అదేదో సినిమాలో రావుగోపాలరావులా.

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్