"అందరూ ఉత్తరాంధ్రోళ్ళు అని సులకనగా సూస్తే.. తూరుపోళ్లు...అని, గవురవంగా పిలిసినోళ్ళు ఒక్క బెజవాడోల్లే! మనమంటే ఎంత గవురవమో సూడండి. బెజవాడ డెవలప్మెంట్ లో మన కష్టమేటో ఆళ్లకి తెలుసు.. ప్రెకాశం బేరేజికి రాలెత్తిన కూలీలెవరు? తూరుపోలు! ఈ కొండల మీద తొలేత గుడిసిలేసి..ఈవేళ.. బిల్డింగిలకి దారి సూపిందెవరు.. తూరుపోలు గాదా?. తోపుడుబల్లేసుకొని మన మొగోలు.. గంపల్లో పళ్లూ, కూరగాయలేసుకొని మన ఆడోలూ ..కీకలేస్తే గానీ.. బెజవాడకు తెల్లారదు"-- పరదేశి మాటలకు వాంబే కాలనీ మొత్తం వినబడినట్టు చప్పట్లు!
" ఉండవలసినోడండి మనోడు"- దశుమంతు నాయుడు చెవి దగ్గర చిన్నగా నవ్వుతూ, గుసగుసలాడేడు నారాయణమూర్తి.
" బుడమేరు బెడద మాత్రం ప్రెభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలొస్తే పడవలెక్కి తిరగాల్సిన గాత్సర్యం( ఖర్మ ) ఏటీ ?ఆనాడు సెంద్రబాబు సెప్పిన మాటలు ఆ ఒరదలోనా..బురదలోనే కొట్టుకుపోనాయి"- ఒకాయన లేచి కేకలేసాడు.
" ఆ మాట అడుగుతావని తెల్సు మామా! ఆ మద్దిన ఫోన్లో సెప్పి.. బాధపడ్డావు కదా! అన్నిటికీ ఎస్సనేస్తే..ఎస్కోటోడివి.. ఎందుకవుతావ్!"- బుస్సీ, సర్దిచెప్పేందుకు లేచాడు.
" ఆ ఇశాలాంద్ర ఎనకాల ఉన్నప్పుడే బాగుండేది. గుడిసెలో ఉన్నా గుండారు ( చీర ) తడిసీదు కాదు "- మరొకడు లేచాడు.
" నీ పేరేటి నాయనా?"-అడిగాడు పరదేశి."పోలీసండీ" అన్నాడతడు.
" ఏ స్టేషను?"
" పేరే పోలీసండీ!..శికాకోళం.. టెక్కలేరియా!"
"అదేగదూ! స్టేషను పోలీసువేమో! క్రిష్ణలంకలో ఏయించీద్దుమనీ.. అడిగాను!"- వాతావరణం నవ్వుల్లోకి మార్చాడు పరదేశి.
" ప్రెకాశం బేరేజీ మన తాతలు గట్టారు. ఈ బుడమేరుకి అడ్డగా, గోడ మనం కట్టీలేమా!"అన్నాడు మళ్ళీ!
"అంత వీజీ కాద్లెండి "- అడిగినోడు ఉసూరుమంటూ కూర్చున్నాడు.
నారాయణ మూర్తి లేచి -"నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. ఇక్కడ ముంపు బెడద ఉన్నోళ్ళకి అమరావతి.. రాజధాని ఏరియాలో స్పెషల్ గా ఒక కాలనీ కట్టించాలని, బాబు గారికి చెప్పి చేయించేస్తే సరిపోలా?" అని, చప్పట్లు ఆశించాడు. కానీ, పడలేదు.
" మేమేటి.. ఎమ్మెల్యేలమేటి బాబో? సిటీలో డూటీలు సెయ్యొద్దా?"
" ఆనాటి ఒరదకి, బాబు గోరింటి పామంచాలే ( మెట్లు ) తడిసిపోనాయట గదా! ఇక్కడే, ఏదో ఒక గట్టు కట్టీసి పున్నిం గట్టుకోండి "- ఎదురుగా కూర్చున్న ఒక ముసలామె గట్టిగానే గొణిగింది.
"మా దృష్టిలో పెట్టారు కదా! ఆ పని పూర్తి చేయించే బాధ్యత మాది. ఆ సాయం సెయ్యకపోతే, ఈసారి ఓట్లు అడగడానికి మీదగ్గరికి రాము "- లేచి, దశమంతు నాయుడు ప్రకటించాడు. ఆయనంటే, అందరికీ గౌరవం.. అందుకే చప్పట్లు కొట్టారు.
" ఈసారి ముంచీస్తే మీ ఊరొచ్చి పడిపోతాము.. అప్పుడు నువ్వే పెంచుదువు గానీ!"- పకాపకా నవ్వుతూ, ముసలమ్మ పక్కావిడ మొహం చూసింది.
" ఆ పని సెయ్యర్రా.. మాడుగులకి కొత్త కంపెనీలు ఒస్తాయని ఆ మద్దిన బాబు గారొచ్చి సెప్పీసెళ్లారు. మీరూ, అల్వా తిని.. ఎన్నాళ్లయ్యిందో!"- నవ్వించే ప్రయత్నం చేశాడు పరదేశి.
" ఇలాగా..ఇకటాలాడుకుంటే తెల్లారిపోద్ది గానీ.. మరేటి మాట సాయమేనా!"- ఎస్. కోటాయన సున్నితంగా అడిగేశాడు.
" అయ్యా! నూనె పొయ్యాలి గానీ, నువ్వులు సూపిస్తే.. దీపమెలుగుతాదేటి?" -పరదేశి చమత్కారానికి అందరూ నవ్వారు.
" సూడమ్మా! కొడితే గానీ, కొబ్బిరికాయ సంగత్తెలీదు"-పోటీ చమత్కారం విసిరాడు ఒకాయన.
" అవన్నీ మూర్తి గారు చూసుకుంటారు గానీ, ఇక్కడ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, అక్కడ మన పంచాయతీలకు ప్రారంభమవుతాయి. ఆధార కార్డులు, అక్కడ ఉన్నోళ్ళకి ఓట్లుంటాయి. స్పెషల్ బస్సులు ఎరేంజు చేశాము.. ఇటు నుంచో.. అటు నుంచో.. అన్నవరం, సింహాచలం చూసుకుందురు గాని"- బుస్సీ పనిలో పనిగా ప్రకటించాడు. వెళ్లడానికి సరదా ఉన్న వాళ్ల నుంచి చప్పట్లు వినిపించాయి.
" అంత దూరం నుంచి వచ్చారు.. మీ మాట కాదనేస్తామేటీ! ఏర్పాట్లు శుభ్రగా సూసుకుని ఎలిపోండి"- బుర్ర గోక్కుంటూ, అదే వందన సమర్పణగా పోలీసు, నమస్కారం పెట్టాడు. అందరి చప్పట్ల మధ్య, కార్లు.. మూర్తి గారి గెస్ట్ హౌస్ వైపు తిరిగాయి.
వెనక కారులో పరదేశి పక్కన కూర్చున్న బుస్సీ అసిస్టెంట్ పోలిపల్లి- "నేస్తమూ! అంత దూరం నుంచి వొచ్చీ.. ఇంత కుమ్మక్కు సేసీ, ఎల్తన్నాం గదా! ఈళ్లంతా ఓట్లు ఏస్తారంటావా?"- చిన్నగా అడిగాడు.
"నేస్తం..ఎయ్యడం, చెయ్యకపోవడం ఆలిష్టం. ఈసారి ముందు టౌన్లూ.. తర్వాత విలేజ్లు.. ఎలక్షన్లు బాగా కలిసి వచ్చాయి. ఇక్కడ ఈల ప్రెచారమైపోయిందీ.. మన పంచాయతీల ఓటర్లకి సెప్పీడమైపోయిందీ!"
" అంతేలే! పోలేరమ్మకి పోతు గావాల! పోతురాజుకి మేత గావాల!!"--ఇద్దరూ నవ్వుకున్నారు.. ఒకే బకెట్లో.. గ్లాసులు కడుగుతున్న చప్పుడు!
- ' నల్లి ' కుట్టు






కామెంట్‌లు (0)