శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆహార సంక్షోభం ముంగిట్లో ...

1 గంట క్రితం

food scarcity copy.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ప్రపంచ వ్యాప్తంగా ఆహార-పోషకాహార అభద్రత ఆందోళనకర స్థాయిలో వుందని ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ (ఎఫ్‌.ఎ.ఒ), ‘ప్రపంచ ఆహార కార్యక్రమం’, ‘అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి’, యునిసెఫ్, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూ.హెచ్‌.ఒ)ల సంయుక్త ప్రచురణ వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 64 కోట్ల మంది (7.8 శాతం) ప్రజలు ఇప్పటికీ ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్నారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సుమారు 210 కోట్ల మంది ప్రజలకు, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి, తమ తదుపరి భోజనం వస్తుందో లేదో, పోషకాహారం ఏమైనా తినగలమో లేదో కూడా తెలియదు.

ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం, అదుపు లేని ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయి. దీనివల్ల 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించాలన్న ఐక్యరాజ్యసమితి లక్ష్యం కేవలం ఒక కల్పనగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం, పెరుగుతున్న ఎరువులు, ఇంధన ధరలు, వివక్షాపూరిత విధానాల కారణంగా 2030లో కూడా 50 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తే, అది మానవ నాగరికతకే అవమానం.

ప్రస్తుత అంతర్జాతీయ ఆహార సంక్షోభం భౌగోళికంగా, ఆర్థికంగా బలహీనమైన దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆసియాలో అధిక జనాభా కారణంగా, ఆకలితో అలమటించే ప్రజలు ఇక్కడ అత్యధికంగా వున్నారు. 2025 గణాంకాల ప్రకారం, ఆఫ్రికాలో మొత్తం 30.9 కోట్ల మంది ప్రజలు ఆకలిని ఎదుర్కొంటుండగా, ఆసియాలో ఈ సంఖ్య 29.2 కోట్లు, లాటిన్ అమెరికాలో 32 లక్షలు. ప్రస్తుతం, ఆఫ్రికా జనాభాలో 20 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆ ఖండంలో సగానికి పైగా ప్రజలు (56.6 శాతం) మధ్యస్థం నుండి తీవ్రమైన ఆహార అభద్రతలో జీవిస్తున్నారు. స్థానిక వ్యవసాయ వ్యవస్థలు ధ్వంసం కావడం, ఆర్థిక ఆంక్షలు, ప్రపంచ ఆహార కార్యక్రమానికి నిధుల కోత కారణంగా సహాయం తగ్గడంతో, అక్కడ లక్షలాది మంది ప్రజలు ప్రాణాంతకమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. గాజా స్ట్రిప్‌లో కూడా ఇదే దుస్థితి. అక్కడ నిరంతర సైనిక దాడులు, పూర్తి దిగ్బంధనం కారణంగా ఆహార సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. దీనికి తోడు, ప్రపంచవ్యాప్త ఎరువులు, ఇంధన కొరత కారణంగా ఆహార పదార్థాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి.

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన '4 ఎఫ్ సంక్షోభం' (ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థికం) భారతదేశ అంతర్గత వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోంది. దీనికి తోడు, దేశీయ మార్కెట్లో సరఫరా కొరత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల దేశాన్ని ఒక సంక్లిష్ట పరిస్థితిలో నిలబెట్టాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన 'ఎల్ నినో' ప్రభావం కారణంగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం నిర్దేశించుకున్న 376.56 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 373.93 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఆహార ఉత్పత్తి కొరత ఉన్నప్పటికీ, ఇంధన భద్రత సాకుతో ఇథనాల్ మిశ్రమ విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం అతిగా వ్యవహరించింది. ఈ చర్య దేశ ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తోంది.

2030 నాటికి 100 లీటర్ల గ్యాసోలిన్‌లో 20 లీటర్ల ఇథనాల్‌ను కలపడం, 'ఇ 20'ని ఉపయోగించడం ద్వారా పెట్రోలియం దిగుమతులను తగ్గించాలన్నది బిజెపి ప్రభుత్వపు తొలి ప్రణాళిక. కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా 2026 ఏప్రిల్ 1 నుండి దీనిని తప్పనిసరి చేసింది. దీనిఫలితంగా, దేశంలోని సామాన్య ప్రజలు నేడు ఆహార, పోషకాహార భద్రత విషయంలో రాజీ పడవలసి వస్తోంది. ఎందుకంటే, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో చెరకు రసం, మిగులు చక్కెర ఆధారంగా మొదలైనప్పటికీ, ఆ వెంటనే ధాన్యం ఆధారిత ఇథనాల్ వైపు మళ్లింది. దాంతో, నేడు దేశంలోని ఆహార, పశువుల దాణా మార్కెట్‌లో తీవ్ర అస్థిరత నెలకొంది. ఇథనాల్ ఉత్పత్తిలో మొక్కజొన్న వాడకం దాదాపు సున్నా శాతం నుండి ఒక్కసారిగా 37 శాతానికి పెరిగిందని గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. దీనివల్ల దేశీయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర కిలోకు రూ.9.26 - రూ.11.57 నుండి రూ.19.29 - రూ.24.69 కి పెరిగింది. కోళ్ల మేతకు మొక్కజొన్న ప్రధాన ముడిసరుకు కావడంతో, ఒక్కో గుడ్డు ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగింది. చిల్లర మార్కెట్‌లో గుడ్ల ధర ఒక్కోదానికి 6.17 నుండి 7.71 రూపాయలకు చేరింది.

ఇది సామాన్యుడి పోషకాహార బడ్జెట్‌కు పెద్ద దెబ్బ. ఒకప్పుడు మొక్కజొన్న విషయంలో స్వయం సమృద్ధిగా ఉన్న భారతదేశం, ఇప్పుడు తన సొంత లోటును తీర్చడానికి అధిక సుంకాలతో విదేశాల నుండి దానిని దిగుమతి చేసుకోవలసి వస్తోంది. ఇథనాల్ విధానం చమురు దిగుమతులపై దేశానికి కొంత డబ్బు ఆదా చేసి ఉండవచ్చు. కానీ ఆహార ధాన్యాల గమనాన్ని మార్చి, ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో ప్రభుత్వం అనేక ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిపోయిన రసాయన ఎరువుల ధరలు ఆహార, ఇంధన సంక్షోభానికి ఆజ్యం పోశాయి. ఫలితంగా, దేశం ఎరువుల సబ్సిడీ ఖర్చులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది ప్రభుత్వ మొత్తం బడ్జెట్ నిర్వహణపై మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక ఒత్తిడిని సృష్టించింది. ఈ భారీ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి, ప్రభుత్వం 'పి.ఎం-ప్రణామ్‌' పథకం ద్వారా ఎరువుల వాడకాన్ని తగ్గించి సబ్సిడీలను ఆదా చే‌సేందుకు ప్రయత్నిస్తోంది. 'జాతీయ సహజ వ్యవసాయ మిషన్' కింద ప్రత్యామ్నాయ వ్యవసాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 లక్షల టన్నుల రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా కేంద్రం 3,157 కోట్ల రూపాయలు పొదుపు చేసినప్పటికీ, ఆహార భద్రతను నిర్ధారించడం, సుస్థిర వ్యవసాయ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి విషయాలలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటనే దానిపై విధానపరమైన అస్పష్టత ఇంకా ఉంది.

‘ప్రపంచ ఆకలి సూచీ’ తాజా గణాంకాలు మన దేశంలోని పాలనా, విధాన పరమైన వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సూచికలో 122 దేశాలలో భారతదేశం 100వ స్థానంలో ఉండటం, దేశంలో పోషకాహార లోపం రేటు అత్యంత 'తీవ్రంగా' ఉందని రుజువు చేస్తోంది. వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు 19.0 శాతం, వయసుకు తగ్గ ఎత్తు లేని పిల్లలు 29.3 శాతం వున్నారు. దేశ జనాభాలో అధిక భాగం ఇప్పటికే పోషకాహార లోపం అంచున ఉండగా, ఇంధన భద్రత పేరుతో ఇథనాల్ విధానంలో వచ్చిన మార్పు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది. దాంతో నిత్యావసరాలు, ప్రోటీన్ ఆధారిత ఆహారాల ధరలు పెరుగుతున్నాయి. ఇది సామాన్యుడు పోషకాహారం కొనుగోలు చేసే సామర్థ్యాన్ని నేరుగా తగ్గిస్తోంది. ఇది ఇప్పటికే ఉన్న పోషకాహార సంక్షోభాన్ని మరింత తీవ్రమైన పరిణామాల వైపు నెడుతోంది.

ప్రపంచ ఆహార వ్యవస్థ నేడు ఒక సంక్లిష్టమైన, ప్రమాదకరమైన సంధి దశలో ఉంది. నల్ల సముద్రం నుండి హర్మూజ్ జలసంధి వరకు వ్యాపిస్తున్న సైనిక ఉద్రిక్తతలు, 'సూపర్ ఎల్ నినో' వంటి వాతావరణ విపత్తుల కారణంగా నేడు ప్రపంచ ఆహార భద్రత ముప్పులో పడింది. ఆఫ్రికాలో లక్షలాది మంది ప్రజల ఆకలి, సూడాన్‌లో ఇటీవల తలెత్తిన మానవతా సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థను పునర్నిర్మించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక వృద్ధి కోసమో, ఇంధన భద్రత కోసమో భారతదేశం లోని సామాన్యుడి ప్రాథమిక ఆహార హక్కును హరించలేము. భౌగోళిక రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఎరువుల వాడకాన్ని సమతుల్యం చేయడం, ఆహార అనుకూల విధానాలు, దౌత్యపరమైన దూరదృష్టితో మాత్రమే దేశంలోని ప్రతి పౌరుడి పోషకాహార హక్కును కాపాడగలం.

(‘గణశక్తి’ సౌజన్యంతో)

దేబాశిష్‌ మిథ్యా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్