శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition' పులి'హోర!

1 గంట క్రితం

two politicians(2).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

" ఎవరన్నారండీ! నా దగ్గిర అన్నాడు కాదు.. దుప్పి కొమ్ముతో కడుపులో పొడిసీద్దును! సిమహం సింగిల్ గా రావడమేటి.. ఎవరు సెప్పారు?"

" ఏమన్నా! మన అపోజిషన్ లీడర్ తాలూకు వాళ్ళు ఓడిపోయినా, ఇంకా.. ఆ మాటే అంటన్నారు గదా !"-పరదేశి, నాయుడు ముఖం వంక చూశాడు.

" అడివి శాస్తరం.. జంతువుల శాస్తరం నాకన్నా తెలిసినోడు ఈ కోరాపుట్టులో ఎవుడైనా ఉన్నాడా? నాయుడు గోరూ.. మీకు తెల్దేటి?"

-- ఎప్పుడో, ఎల్జీ సమ్మిట్ లో.. సందడిలో జారిపోయిన తర్వాత, మరొక పులిగోరు కొందామని, కోరాపుట్ అడవిలో .. తెలిసిన డుంబ్రి దొర దగ్గరకు వచ్చాడు నాయుడు. మాటల్లో, సింహం సింగిల్ గా వస్తుందట కదా! అన్నాడు పరదేశి.

" సిమహాలు ఎక్కడికెళ్ళినా, మందగా ఎల్తాయండి. ఒంటిరిగా ఏదీ ఎళ్లదు.. అదిగో.. అలాగా.. పులి ఎళ్తాది. మొగ సిమహాలైతే, రోజుకి ఇరవై గంటలు గడ్డిలో దొర్లడం.. ఆవలించడం.. అరవడమే తప్ప మరే పని సెయ్యవు.. మహా బద్ధకిష్టులు..ఏటకెళ్లినా ఆడ సిమహాలే ఎల్తాయి ! పులులు అలాక్కాదు"

"మరి ఆటి సంగతి ఏటీ?"-అడిగాడు పరదేశి.

" అమ్మో! అవి డేంజరే కాదు..శాలా తెలివైనవి. అందులోనూ.. ముసిలి పులులు.. అమ్మో..మరీనూ !"

నులక మంచమ్మీద కూర్చున్న నాయుడు, ఆసక్తితో ముందుకు వంగాడు వినడానికి.

" అలాగా.. సూస్తన్నావేట్రా.. ఇంట్లోకెళ్ళి, గలాసులు బాగా కడిగి, కుండలోంది తెచ్చీకుండా?"--ఎదురుగా ఉన్న కుర్రోడిని కసిరాడు దొర. అతడు వెళ్ళిన తర్వాత--

" నాయుడు గోరు.. శాలా కాలం కితం ఏటయిందనుకున్నారు! సర్కాసుల్ని ప్రెభుత్వం బందు సేసిసింది గదా! ఆ రోజుల్లో.. ఒక ముసిని పులిని, వొయిసు పులినీ తెచ్చి ఇక్కడ.. మా పాండవ గుహ దగ్గిర వొదిలీశారు. వోరం రోజుల తర్వాత...ఆటి యవ్వారం సూద్దామని ఆ గుహ దగ్గిరికెళ్లాను"

"ఆ దారి నీకెలాగ తెలుసు?"-పరదేశికి మరో ఆశ్చర్యం.

" ఎలగ తెలుసా! మరి ఇందాకటనుంచి ఏటి ఆలకిస్తన్నావ్? శాస్తరం.. ఆకుల ఓసన సూసి.. పులి నడిసిన దారిని కనిపెట్టీగలను. పులి అడుగులు పోల్చాలంటే..మళ్లా నేనే ! ఫారెస్టోలు నా దగ్గిరికే ఒస్తారు..తెల్సునా !"--

తెలియదన్నట్టు తలూపాడు పరదేశి.

" పులికి ఎన్ని గోళ్లుంటాయ్ ?"-తెలీదని తలూపాడు.

"పద్దెనిమిది.. ముందు పది..ఎనక ఎనిమిది..తెల్సునా ?"-పరదేశి మౌనం.

దొర, తన పక్కన ఉన్న ఎండు సొరకాయలో నుంచి, కొంచెం గొంతు తడిపి-

"గుహ దగ్గరికెళ్ళాను. రెండు పులులూ మాట్లాడుకుంటన్నాయి". భాష కూడా వచ్చా? అని, మరి అడగలేకపోయాడు పరదేశి.

" నువ్వూ.. నాలాగే అడివిలో అన్ని జంతువులతో బాగా నేస్తరికం సేశావు. మన ఎనక సేరిన వాళ్లకి, ఒక్కొక్క ఏరియా ఇడదీసి.. ఒక్కొక్క దానికి.. ఒక్కొక్క జంతువును రాజుని సేసీద్దాం.. ఆ కొత్త గౌరవానికి అవి కూడా సంతోషించి మన ఎనకే ఉంటాయి"- అన్నది ముసలి పులి. ఆ ఐడియాకు కుర్ర పులి సంతోషించింది.

" అయితే, అడివిని సరి సమానంగా పంచుకుందాం"- అన్నది.

"నువ్వు నా అంత సమానం అయిన తరువాత, అలాగే సేద్దాం "- అన్నది ముసలి పులి.

" నీ ఎనకే తిరుగుతుంటే, నేనెప్పుడు సమానమవుతాను ?"-

అడిగింది కుర్రపులి.

"ఎప్పుడవుతావో.. నాకు తెలుసులే! అప్పుడు.. నేనే సరి సమానంగా పంచీసి ఇచ్చేస్తాను"-అన్నది ముసలి. కుర్ర పులికి అర్థం కాక బుర్ర గోక్కుంది. ముసలి ముసి ముసి నవ్వులు దానికి కనపడలేదు.

" ఇన్నాళ్ళూ ఎంట తిప్పి..తిప్పీ.. పులిహోర తప్ప.. బిరియానీ పెట్టలేదన్నమాట!"--పడి పడి నవ్వాడు పరదేశి. నాయుడు కూడా పకపకా నవ్వుతూ, పులి గోరు సంగతి మర్చిపోయాడు.

- ' నల్లి ' కుట్టు​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్