ప్రజల అవసరాలను, ఆకాంక్షలను నెరవేర్చలేని వ్యవస్థలూ, ప్రభుత్వాలూ సమస్యలను సృష్టిస్తుంటే, వాటిని ప్రశ్నిస్తూ పలు దేశాల్లోని యువతీయువకులు, విద్యార్థినీ విద్యార్థులూ వీధుల్లోకి రావటం వర్తమాన దృశ్యం. ఫ్రాన్స్‌లో పాఠశాలల దిగ్బంధం, స్పెయిన్‌లో గృహవసతి హక్కు కోసం భారీ ప్రదర్శనలు, భారత్‌లో యువజన, విద్యార్థుల పోరాటం... పెరుగుతున్న అసంతృప్తికి, మార్పును కోరుతున్న ఆకాంక్షకు సంకేతాలు! దేశాలు, భాషలూ వేరైనా నవతరం ఎదుర్కొంటున్నవి దాదాపుగా ఒకే తరహా సమస్యలు. సంపద పెరుగుతున్నా నాణ్యమైన విద్య, స్థిరమైన ఉపాధి, అందుబాటులో ఇల్లు, గౌరవప్రదమైన జీవితం ఎందుకు లభ్యం కావటం లేదన్న ఆవేదన, ఆలోచనలే యువతరం అసంతృప్తికి పునాది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సంపదను కేంద్రీకరించటంలో చూపే శ్రద్ధ ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రదర్శించదు. దీంతో చదువులు పూర్తయ్యాక యువతరం ఉద్యోగం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఉద్యోగం దొరికినా వేతనం కనీస అవసరాలకు సరిపోవడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి అవకాశాలు విస్తరిస్తుంటే, సామాన్య కుటుంబాల యువతకు పోటీ కఠినమవుతోంది. ఈ పరిస్థితులే వారు వీధుల్లోకి రావటానికి ప్రధాన కారణం.
ఫ్రాన్స్‌లో గత సెప్టెంబరు మధ్యలో ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం అక్టోబరులో దేశవ్యాప్త నిరసనగా విస్తరించింది. పారిస్ సమీపంలోని క్రెటెయిల్ పాఠశాలలో మొదలైన ఆందోళనకు ఉపాధ్యాయుల కొరత, కిక్కిరిసిన తరగతి గదులు, శిథిల భవనాలు, విద్యా వనరుల లేమి ప్రధాన కారణాలు. అక్టోబరు 1 నాటికి దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. అక్టోబరు 6న జరిగిన ప్రదర్శనల్లో ప్రభుత్వ అంచనా ప్రకారం 2.66 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్క పారిస్‌లోనే 56 వేల మంది వీధుల్లోకి వచ్చారు. విద్యా సదుపాయాల మెరుగుదలతోపాటు ప్రభుత్వ వ్యయాల కోతలు, ప్రభుత్వ సేవల క్షీణత, ఉద్యోగ భద్రతపైనా నిరసనకారులు గొంతెత్తారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి, కొరత ఉన్న పాఠశాలల్లో 3,000 మంది ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రకటించింది. అన్ని సమస్యలూ పరిష్కారమయ్యేంతవరకూ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఫ్రాన్స్ విద్యార్థుల ఆందోళన ఉదాహరణ.
స్పెయిన్‌లో యువతరం పోరాటం మరో మౌలిక సమస్యను ముందుకు తెచ్చింది. అక్టోబరు 3న మాడ్రిడ్‌తోపాటు దేశంలోని సుమారు 50 నగరాల్లో వేలాది మంది గృహవసతి సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. అద్దెల పెరుగుదల, ఇళ్ల కొరత, పెట్టుబడి సంస్థల ఆధీనంలోకి నివాస భవనాలు వెళ్లడం సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. మారికార్మెన్ అబాస్కల్ అనే 87 ఏళ్ల వృద్ధురాలిని సెప్టెంబరు 23న మాడ్రిడ్‌లో ఆమె నివసిస్తున్న ఇంటి నుంచి ఖాళీ చేయించిన సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అద్దెదారులకు ఉపశమనం కల్పించే ప్రతిపాదనలు పార్లమెంటులో తిరస్కరణకు గురికావడంతో నిరసనలు ఉధృతమయ్యాయి. స్పెయిన్ యువజన సంఘం 2026 మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025లో యువత స్వతంత్రంగా నివసించే రేటు 14.5 శాతానికి పడిపోయింది. సగటు నెలవారీ ఇంటి అద్దె 1,176 యూరోలు కాగా, సగటు నెలవారీ వేతనం 1,191 యూరోలు మాత్రమే! అంటే వేతనంలో 98.7 శాతం అద్దెకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి! ఇల్లు జీవన హక్కులో భాగం కాకుండా, పెట్టుబడిపై అధిక లాభాలు ఆర్జించే సాధనంగా మారడం ఆందోళనకరం. అద్దె మార్కెట్ యువత జీవనాన్ని సంక్షోభంలోకి నెడుతూ పెళ్లి, కుటుంబం, పిల్లలు, స్వతంత్ర జీవనం వంటి నిర్ణయాలనూ ప్రభావితం చేస్తోంది.
భారత్‌లో విద్యార్థి, యువజనుల అసంతృప్తి విస్తృతమైన సమస్యలతో ముడిపడి ఉంది. నీట్ పరీక్షల్లో అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ప్రభుత్వ విద్యను బలహీనపరచడం, కార్పొరేటు విద్యారంగాన్ని విస్తరించడం, కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారం, అవకాశాల కొరత ఈ సంక్షోభానికి కారణాలు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగాలు, తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం యువత నిరాశను పెంచుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన పాలకులు ప్రజల దృష్టిని మళ్లించే మతోన్మాద, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు. అధికారమే పరమావధిగా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే దేశభక్తి గురించి మాట్లాడటం, తమ వైఫల్యాలను ప్రత్యర్థుల కుట్రగా చిత్రీకరించడం, ఆర్థిక అసమానతల చర్చను మతపరమైన విద్వేషంగా మార్చడం బిజెపి హయాంలో జాతీయ విధానంగా మారిపోయింది. ఇతర దేశాల ప్రజలను, ఇతర మతాలను సమస్యలకు మూలంగా చూపే సంకుచిత ఎత్తుగడలు ప్రపంచవ్యాప్త ధోరణిగా మారాయి. భారతదేశంలో మోదీ, అమిత్ షాల పాలన ఇందులో రెండాకులు ఎక్కువే చదివింది. అందుకే జంతర్ మంతర్ ఆందోళనలను సంభాషణతో, సామరస్య వాతావరణంతో పరిష్కరించాల్సిందిపోయి నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అణచివేయాలని చూస్తోంది. ఉద్యమాలను అణచివేస్తే అవి సమసిపోవు. తగిన పరిష్కారం చూపిస్తేనే సద్దుమణుగుతాయన్న కనీస ఇంగితాన్ని మరచి ప్రవర్తిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా యువతరం వీధుల్లోకి రావడం ప్రస్తుత పెట్టుబడిదారీ, నయా ఉదారవాద విధానాల వైఫల్యాలకు స్పష్టమైన సూచిక. అభివృద్ధి ఫలాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే మెజారిటీ ప్రజలు ఇక్కట్లలో పడతారు. వీధుల్లోకి వస్తారు. ఉత్పత్తి పెరుగుతున్నా ఉద్యోగాలు పెరగకపోవడం, విద్య విస్తరిస్తున్నా అర్హతలకు తగ్గ ఉపాధి లభించకపోవడం, నగరాలు అభివృద్ధి చెందుతున్నా సామాన్యులకు ఇళ్లు అందుబాటులో లేకపోవడం పెట్టుబడిదారీ వ్యవస్థలోని తీవ్రమైన వైరుధ్యాలు. వీటిని పరిష్కరించాలంటే సంపద కేంద్రీకరణను తగ్గించి, విద్య, ప్రజారోగ్యం, సామాజిక భద్రతపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ప్రజల అవసరాలను నెరవేర్చలేని అభివృద్ధి నమూనాను ప్రశ్నించడం యువతరం బాధ్యత మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి అవసరం కూడా.







కామెంట్లు (0)