శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యోగుల పెన్షన్ దేశానికి భారమా?

2 గంటల క్రితం

ops.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 05:21 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఒ.పి.ఎస్ విధానంపై ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు రాసిన అభిప్రాయాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒ.పి.ఎస్ ను ఆర్థిక ఎమర్జెన్సీగా చిత్రించి ఉద్యోగులను దోపిడీదారులుగా నిలబెట్టడం వాస్తవాలను వక్రీకరించడమే. పాత పెన్షన్ విధానం (ఒ.పి.ఎస్ ) అమలైతే దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి వెళ్తుందని జె.పి తన వ్యాసంలో హెచ్చరించారు. “దేశాన్ని అప్పుల నుంచి కాపాడాలి, నిర్ణయాలు విజ్ఞతతో తీసుకోవాలి” అనడం వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఆ అప్పులకు ఉద్యోగుల పెన్షనే కారణమన్నట్టు చెప్పడం ఏ విజ్ఞత? దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ పేరుతో ఉద్యోగుల హక్కులను నిందితుల బోనులో నిలబెట్టడం ఏ రకమైన న్యాయం?

ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో ముప్పై, నలభై సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తాడు. బదిలీలు, పని ఒత్తిడి, సిబ్బంది కొరత, ప్రజల అవసరాలు, విధుల్లో ఎదురయ్యే అనిశ్చితి అన్నీ భరిస్తాడు. ఆ సేవకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో గౌరవంగా బతికేందుకు కోరే పెన్షన్ ఏ రకంగా “అలవిమాలిన కోరిక” అవుతుంది? ఉద్యోగి జీతం తీసుకున్నాడు కాబట్టి, రిటైర్మెంట్‌ తర్వాత భద్రత అడగకూడదా?

పెన్షన్ ఉద్యోగికి ఇచ్చే దానం కాదు. అది దశాబ్దాల సేవకు సంబంధించిన సామాజిక భద్రత. ఉద్యోగి జీవితాంతం చేసిన పనికి ప్రభుత్వం చెల్లించాల్సిన బాధ్యతలో భాగం. ఈ హక్కును “దేశంపై భారం”గా వర్ణిస్తే, ఉద్యోగుల సేవకు విలువ లేదన్నట్టే. వృద్ధాప్యంలో ఆదాయం లేకుండా, మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి జీవించమని చెప్పడమేనా ఆర్థిక సంస్కరణ?

దేశం అప్పుల్లో ఉందని ఆందోళన చెందేవారు ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేశం ఎందుకు అప్పు చేస్తోంది? ఆ అప్పుతో ఏ ప్రజా ప్రయోజనం నెరవేరుతోంది? ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధానాలు ఎందుకు బలహీనపడ్డాయి? ప్రజా ఆస్తులను, సహజ వనరులను ఎవరి ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నారు? కార్పొరేట్ రాయితీలు, పన్ను మినహాయింపులు, అనుత్పాదక వ్యయాలు, అవినీతి ఆరోపణలు వీటి వల్ల ప్రజాధనంపై పడుతున్న ప్రభావం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉద్యోగి పెన్షన్‌ను మాత్రమే చూపించడం ఆర్థిక విశ్లేషణ కాదు; బాధ్యత నుంచి తప్పించుకునే వాదన.

రాజ్యాంగంలోని ఆర్థిక అత్యవసర పరిస్థితి అనే పదాన్ని ఒ.పి.ఎస్ చర్చకు జత చేసి ప్రజలను భయపెట్టడం కూడా తగదు. ఒ.పి.ఎస్ పై చర్చ జరపవచ్చు, ఖర్చుల లెక్కలు పరిశీలించవచ్చు. కానీ ఒక విధానాన్ని అమలు చేస్తే దేశమే ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి వెళ్తుందని చెప్పడానికి స్పష్టమైన, సమగ్ర ఆధారాలు చూపాలి. భయపెట్టే హెచ్చరికలు లెక్కలకు ప్రత్యామ్నాయం కావు. ఒ.పి.ఎస్ ఖర్చు ఎంత? ప్రభుత్వ మొత్తం ఆదాయం ఎంత? పన్ను రాయితీలు, వడ్డీ చెల్లింపులు, ఇతర ఖర్చుల వాటా ఎంత? ఇవన్నీ కలిపి చూపితేనే చర్చ నిజాయితీగా ఉంటుంది.

ప్రజాప్రతినిధుల పెన్షన్ విషయంలో మాత్రం ఇంతటి ఆందోళన ఎందుకు కనిపించదు? పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజా ప్రతినిధులకు పెన్షన్, భత్యాలు, ఇతర సదుపాయాలు అందే విధానాలపైనా ఇదే స్థాయిలో ప్రశ్నలు వేస్తున్నారా? ఒక్కసారి ప్రజాప్రతినిధిగా పని చేసినవారికి వర్తించే ప్రయోజనాలను సమర్థిస్తూ, దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగుల పెన్షన్‌ను భారం అనడం ద్వంద్వ ప్రమాణం కాదా? ప్రజాధనం నుంచి చెల్లించే ప్రతి సదుపాయాన్నీ ఒకే ప్రమాణంతో పరిశీలించాలి.

ఉద్యోగుల హక్కుల దగ్గర మాత్రమే ఆర్థిక క్రమశిక్షణ గుర్తుకు రావడం అన్యాయం. అమెరికాను ఉదాహరణగా చూపి భారత ఉద్యోగుల పెన్షన్‌ను తప్పుబట్టడం కూడా సరైన పోలిక కాదు. రెండు దేశాల అప్పుల మొత్తాన్ని మాత్రమే పోల్చి నిర్ణయానికి రావడం సాధ్యం కాదు. దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణం, జనాభా, ఆదాయం, వేతనాలు, జీవన వ్యయం, సామాజిక భద్రతా విధానాలు వేర్వేరు. అక్కడ ఉద్యోగులు గంటలవారీ వేతనాలు, కనీస వేతనం, పని పరిస్థితులు, ఇతర హక్కులపై బహిరంగంగా చర్చిస్తారు. మన దేశంలో ఉద్యోగులు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం దృష్టిలో పెట్టుకుని తమ హక్కులు కోరుతున్నారు. పోలిక చేయాలంటే అమెరికాలో వేతనం ఎంత? ఇక్కడ ఎంత? అక్కడ ఉద్యోగ భద్రత ఏమిటి? ఇక్కడ ఏమిటి? అక్కడ సామాజిక భద్రత ఏమిటి? ఇక్కడ ఏమిటి? అన్నీ చెప్పాలి. అప్పుల సంఖ్య ఒక్కటిని చూపి ఉద్యోగుల హక్కులపై తీర్పు చెప్పలేరు.

ఇక కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ వల్ల ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగ భద్రత క్రమంగా కనుమరుగవుతోంది. బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం రంగాలతో పాటు నవరత్న సంస్థలతో సహా అనేక రంగాల్లో శాశ్వత నియామకాలు తగ్గి, తక్కువ వేతనాలతో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఒకే పని చేస్తున్నా సమాన వేతనం, సమాన హక్కులు దక్కని దుస్థితి. ఈ శ్రమ దోపిడీని పట్టించుకోకుండా, రిటైర్‌ అయిన ఉద్యోగుల పెన్షన్ కారణంగా దేశం దివాలా తీస్తుందని చెప్పడం ఎవరి ప్రయోజనాన్ని కాపాడుతుంది?

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో ఉద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్ము మార్కెట్ పెట్టుబడులతో ముడిపడి ఉంటుంది. పెట్టుబడుల విలువ మారితే ఉద్యోగి పొందే పెన్షన్ కూడా మారవచ్చు. ఉద్యోగ విరమణ చేసిన కొందరికి చాలా తక్కువ మొత్తం మాత్రమే అందుతున్న ఉదాహరణలున్నాయి. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడమే వృద్ధాప్య భద్రతకు హామీ కాదు. ఉద్యోగి తన జీవితాంతం చేసిన సేవకు, చివరికి ఎంత భద్రత లభిస్తుందో కూడా లెక్కల్లోకి తీసుకోవాలి. నష్టభారం ఉద్యోగిపై వేసి, దాన్ని సంస్కరణగా ప్రకటించడం ఎలా సమర్థనీయం?

ఒ.పి.ఎస్ వల్ల ప్రభుత్వంపై పడే దీర్ఘకాలిక బాధ్యతలను పరిశీలించాలి. అయితే దాని కోసం ఉద్యోగులనే దేశ అప్పులకు కారకులుగా చిత్రించకూడదు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజా సంపదను కాపాడడం, ఖర్చులకు ప్రాధాన్యత నిర్ణయించడం, కార్పొరేట్ రాయితీలను సమీక్షించడం, అవినీతి-అనుత్పాదక వ్యయాలను అరికట్టడం...వంటివన్నీ కూడా ఆర్థిక చర్చలో భాగం కావాలి. పెన్షన్ తగ్గించడం లేదా తొలగించడం ఒక్కటే పరిష్కారమని చెప్పడం బాధ్యతాయుతమైన ఆర్థిక విధానం కాదు. అయినా జె.పి గారికి ఎ.పి లోనూ, తెలంగాణ లోనూ ఉమ్మడిగా ఉద్యోగులు గుర్తుకొచ్చారు. రూ.0.99 పైసలకు ఎకరా భూమి లీజుకు వందలు, వేల, లక్షల ఎకరాల్లో కొట్టేస్తున్న గూగుల్, రిలయన్స్, అదానీ లాంటి వారు గుర్తుకు రాకపోవడం యాదృచ్ఛికం అనుకోవాలా?

దేశ సంపద ప్రజలది. ప్రభుత్వ ఆదాయం ప్రజల శ్రమతో, ప్రజలు చెల్లించే పన్నులతో సమకూరుతుంది. ఆ సంపద ఎక్కడికి వెళ్తోంది, ఎవరికి మేలు చేస్తోంది, భారాలు ఎవరు మోస్తున్నారు అన్నదే అసలు ప్రశ్న. దేశ ఆర్థిక సంక్షోభానికి ఉద్యోగుల పెన్షన్ అని చెప్పడం ఈ ప్రశ్నలన్నింటినీ పక్కదారి పట్టిస్తుంది. ఉద్యోగుల హక్కులను బలి చేసి పాలకుల విధాన వైఫల్యాలను కప్పిపుచ్చే వాదనలను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

k murali.jpg

కందారపు మురళి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి,

సెల్‌: 9490098840/


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్