తల తిరిగితే గానీ తర్కం తలకెక్కదంటారు కదా..డాన్ డోనాల్డ్ ట్రంప్ కథ అలాగే తయారైంది. అంతర్గత సవాళ్లు, సంక్షోభాల నుంచి బయిటపడటం కోసం వరుసగా వెనిజులా, ఇరాన్ పై దురాక్రమణలు, దుష్ట దాడులు చేయాలనుకుని బయిలుదేరితే ఆదిలోనే హంసపాదులా బెడిసికొట్టింది. అధ్యక్షుడు మదురోను అపహరించుకుపోయి అక్రమ విచారణ జరపుతున్నా వెనిజులా నిలదొక్కుకుంది. ఇక ఇరాన్ అయితే అడుగడుగునా ప్రతిఘటించి మూడు సముద్రాల నీళ్లు తాగించింది. ఈ పరిస్థితుల్లోనే వచ్చింది అమెరికా 250 ఏళ్ల వేడుక. ‘నిదురనైనా నీ తలపే...’ అన్నట్టు డాన్‌కు అంతటి వేడుకలోనూ భయం వదల్లేదు. డాన్సులు, పార్టీలు అయిపోయాక అసలు సంగతి బయిటపెట్టాడు. ప్రపంచానికి అసలైన శత్రువు కమ్యూనిజమేనంటూ గగ్గోలు పెట్టాడు. అదేంటి? కమ్యూనిజాన్ని చిత్తు చేశామన్నారు. చరిత్రాంతం, సిద్ధాంతాల సమాప్తం వంటి థియరీలు చెప్పారు. ఇంతా అయ్యాక మళ్లీ ఈ విధంగా కమ్యూనిజం శత్రువంటాడేమిటని ఎవరూ నివ్వెర పోలేదంటే రెండే కారణాలు. న్యూయార్క్ మేయర్‌గా సోషలిస్టు భావుకుడైన మమ్దానీ ఎన్నికవడంతోనే ట్రంప్‌కు దిమ్మ తిరిగింది. ఆపైన ఇరాన్ కాళ్ల బేరానికి తెచ్చింది. ఇదే సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ 105వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిపింది. ప్రపంచ శాంతికి నేనున్నానని భరోసా ఇచ్చింది. నా శక్తి సామర్థ్యాలు, సాంకేతిక ఆర్థిక సత్తా ఎవరికీ వ్యతిరేకంగా ఉపయోగించబోమని కూడా ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ భరోసా ఇచ్చారు. అసలు ఇరాన్ యుద్ధంతో అమెరికా మరింత నలిగిపోగా చైనా చొరవ, పాత్ర పెరిగాయన్న అభిప్రాయం అంతటా వ్యక్తమైంది. దీనికి తగినట్టే రష్యా కూడా చైనాకు చేరువైంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా తాము అణ్వాయుధ పరీక్షలు నిలిపేది లేదని తేల్చిచెప్పారు. వియత్నాం స్థిరంగా ముందుకు పోతున్నది. ఇవన్నీ డాన్‌కు మింగుడు పడేవి కాదు కదా. కాకుంటే క్యూబాను ఉద్దేశించి ఆయన ఈ కమ్యూనిజం వ్యాఖ్యలు చేసి వుంటాడనే అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగినట్టే క్యూబా కూడా ప్రస్తుత సంక్లిష్ల సవాళ్ల నుంచి బయిటపడటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
మనిషి అదృశ్యం.. సినిమా అదృశ్యం..
తాను కనిపించడం లేదని సినిమా తీస్తే అది కూడా కనిపించకుండా పోయింది. ‘రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా...’ అని మొదటి నుంచీ నిరంకుశ పాలకులు తమను విమర్శిస్తూ మాట్లాడినా, పాటపాడినా, ఆడినా, ఆధునిక కాలంలో సినిమాలు వీడియోలు చేసినా... ససేమిరా సహించలేమంటారు. కానీ గతంతో పోలిస్తే మోడీజీ హయాంలో ఈ దాడి ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఈ గొడవంతా ఎందుకుని తెలివైన మన దర్శక నిర్మాతలు ద్వాపరయుగం కృతయుగంతో సినిమాలు మొదలెట్టి పాన్ ఇండియాగా వదులుతున్నారు. పంజాబ్‌లో పోలీసుల కారణంగా మాయం చేయబడిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కల్రా కథతో తీసిన సినిమా ‘పంజాబ్ 95’. ఈ చిత్రం 2023 లోనే పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. అంతర్జాతీయ చిత్రోత్సవాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మూడేళ్ల తర్వాత ‘సట్లెజ్’ అని కొత్త పేరుతో గత వారం జీ5లో విడుదల చేశారు ఓటిటి కి సెన్సార్ బెడద వుండదనే ఆశతో. రెండు రోజులు వచ్చిందో లేదో మళ్లీ బ్రేక్. ఓటిటి లో అది లేదనే సందేశం దర్శనమిచ్చింది. ఏవో వత్తిళ్ళ వల్లనే ఇలా జరిగిందని స్పష్టమైపోయింది. ఇప్పుడా చిత్రం కోసం ఏదో కమిటీ వేశారు. తాజాగా ఆ చిత్ర దర్శకుడు హనీ టెహ్రా మాట్లాడుతూ ఇక తమ చిత్రాన్ని మర్చిపోవలసిందేనని బాధగా ప్రకటించారు. అసలు భారతీయ చిత్రాలకు స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఈ సెన్సార్ బాధ తప్పలేదు. వలస పాలనలో మొదటిసారిగా ‘భక్త విదుర’ చిత్రాన్ని నిషేధించారు. పౌరాణికం కదా అంటే విదురుడు మహాత్మా గాంధీలా కనిపిస్తున్నాడని తెల్లదొరలు అభ్యంతరం పెట్టారు. ఎమర్జన్సీలో ‘కిస్సా కుర్సీ కా’ చిత్రం కూడా ఇలాగే నాశనమై పోయింది.. ఓటిటిలో అసభ్యకరమైన చిత్రాలు కూడా చాలా రావచ్చుగానీ మానవ హక్కుల కోసం జరిగిన పోరాటం చెప్పే ‘సట్లెజ్’ వంటివి రానివ్వరా? అన్యాయం కాకపోతే..?
- పీపీ







కామెంట్‌లు (0)