"శారదా వారాహీ తాండవ పావన జీవ నదీజల పునీతులారా!
నాయనలారా! " ( ఆలాపన )
" భక్తులారా! మీరు శ్రీరామ జననం విన్నారు ..
శ్రీ సీతారామ కళ్యాణం.. శ్రీరామ విజయం, శ్రీరామ పట్టాభిషేకం వంటి హరికథలెన్నో .. వినే ఉంటారు. ఇవాళ నేను చెప్పబోయే సత్కధ ..శ్రీరామ విలాపం. ఇది నా భాగవతార్ జీవితంలో ముందెక్కడా చెప్పని కథ. రామభక్త సమాజానికి ప్రస్తుతం తక్షణావసరమని చెప్పడానికి సాహసిస్తున్నాను.( గొంతు సర్దుకున్నారు).
పక్కనే శృతి పెట్టె లాగుతున్న శిష్యుడు ..ఒక చేత్తో మరచెంబు, మరో చేత్తో రాగి ఫ్లాస్క్ పట్టుకొని లేచాడు. చిన్నగా, నవ్వుతూ వారిస్తూ..
" శ్రీమద్రమారమణ గోవిందో హరి "- శ్రోతలు గొంతు కలిపారు. శృతి ప్రారంభం!
" భక్తులారా!" ( ఆలాపన )
మీ అందరికీ తెలుసు .. కొన్నేళ్ళ క్రితం శ్రీరామ కర సేవకులవారు, బజరంగ దళముల వారు వృద్ధ నాయకులు, సాధ్వీమణులు పరమ రామోన్మత్తులై విధ్వంసకాండను విశేష స్వర భాస్వరాలతో ఉత్తేజపరచుచుండగా, తురుష్కులు నిర్మించిన మసీదును కూలద్రోసిన ఘట్టము.. ( ఇంకా ఏదో వర్ణించబోతుండగా)
" అయ్యవారూ! తమరు పండితులు.. కసింకోటలో కథ చెప్పడానికి వచ్చిన విషయం మర్చిపోవడం తగునా? "-- ఒక ముస్లిం వృద్ధుడు లేచి, సున్నితంగా అభ్యంతరం తెలిపారు. అతని గొంతులో, లవ, కుశ జమిలి గానంలో ధ్వనించినట్టు, ఆవేదన.. ఆగ్రహం ధ్వనించాయి. కసింకోట సిద్ధాంతి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఆహ్వానాలు అందుకుని పరిసర గ్రామాల్లోని నాయిళ్లు, పాత్రులు వంటి పెద్దలు వచ్చారు. వారికి ప్రత్యేక షామియానా, కుర్చీలు ఏర్పాటు చేశారు సిద్ధాంతి. ముస్లిం వృద్ధుడి అభ్యంతరానికి సిద్ధాంతి మనసు కూడా చివుక్కుమంది. అయితే, భాగవతార్ సమయస్ఫూర్తి, చతురత గలవారు. చిన్నగా నవ్వి --
"సలాము లేకుం బాబా! మహాకవి శ్రీశ్రీ వంటి వారు కవిత్వంలో ప్రయోగ ప్రేమికులు. అనుకోకుండా, ఒక చోట కసాయిబు అన్నారు. దానికి మీలాగే ఖాదర్ మొహియుద్దీన్ వంటి కవి పుట్టుమచ్చను చేసేశారు. నాలాంటి చిన్నవాడు చిన్న తప్పు చేయడం సహజం. తమ వంటి పెద్దవారు సర్దుకుపోవాలి మరి!"--నవ్వుతూ
" శ్రీమద్రమారమారమణ గోవిందో హరి "- శ్రోతలు అందుకున్నారు.
" సాకర్ రామ్ దశరధ్ ఘర్ డోలే..నిరాకారి ఘట్ ఘట్ మే బోల్"- తులసీదాస్ భజన్ వినిపించి, ముస్లిం శ్రోతలందర్నీ ఆనంద పరవశులను చేశారు.( చప్పట్లు) భాగవతార్ సంతోషపడుతూ..
" శబ్ద బ్రహ్మ పరాత్పర రామా!
కాలాత్మక పరమేశ్వర రామా!
సుఖ నిద్రిత రామా!" -- అయోధ్యలో ఆ బాల రాములవారు, శిలా రూపంలో దర్శనమిచ్చి, అదృశ్య రూపంలో అలసిన ఒడలుతో నిద్రలోకి జారుకున్నారు. అదే సమయంలో, అదను చూచి.. ఆలయ పరిరక్షక దళానికి చెందిన కొందరు గర్భగుడిని సర్దుతుంటే, బంగారు, వెండి ఇటుకలు, నవరత్న మణిమయ హారములు, ఎన్నో ఆభరణములు, హుండీల నిండా దేశీ విదేశీ రూప్యములు పోగులు, పోగులుగా కనిపించాయి. వాటిని చూసి వారికి--
" ఫెళ్లుమనె కళ్లు.. దురాశలు ఘల్లుమనె.. గుభిల్లుమనే నిండు హుండీలకు.. ఝల్లుమనియె..మౌన నిఘా
నేత్రములకు! ఒక్క నిమిషమ్మునందే.. నయము ..జయమును ..
భయము ..విస్మయములు గదురా" ( రాగం యిక్తం)
ఆ అకృత్య ధ్వనులకు మెలకువ వచ్చి, ముష్కరుల తస్కరకాండను చూస్తూ, శిలా రూపుడైనందున విభ్రమరాముడై.. నిస్సహాయ రాముడై, తనలో తాను ఎంతగానో కుమిలిపోయాడట! నాయనలారా! ఒకానొక దినమున ఒక తనిఖీలో ఈ చోరకాండ బట్టబయలైన తర్వాత, బాలరాముల వారి పరామర్శలకు మాన్యులైతేనేమి, సామాన్యులైతేనేమి, రామ భక్తిని ఓట్ల సొమ్ము చేసుకున్న ఐపీలూ..వీఐపీలు రెండోపతండాలుగా తరలివస్తున్నారు. వారిలో ఒక వృద్వాణి.. అనగా వృద్ధ వాణి.. కారులో నుంచి దిగగానే, రోదిస్తూ.. కుప్ప కూలిపోతూ..
"ఏసీ రథమలో దేశము తిరిగి.. ఇటుకలు దెస్తిని రామా! రామశిలలని రెచ్చగొట్టుచూ, చిచ్చు రేపితిని రామా! ఏ తీరుగా మము శిక్షించెదవో? కమల నేత్రుడా రామా! " --పశ్చాత్తాప కీర్తన పాడారు.
ఎక్కడైతే శ్రీరామనామం వినిపిస్తుందో, అక్కడ శ్రీ ఆంజనేయులు వారు ప్రత్యక్షమవుతారట! ఆ రామ శబ్దానికి వారు వచ్చి, గర్భగుడిలోకి వెళ్లి, అదృశ్య రూపుడై.. విలపిస్తున్న శ్రీరాములవారిని చూసి .. పాదాలకు నమస్కరించి --
" విలపించకు శ్రీరామా! నాడు అశోక వనమున సీతమ్మను తలపించకు రఘురామా! "-- ఓదార్చాడు.
" చూశావా హనుమా! రావణుడితో యుద్ధం చేసి, రెక్కలు కోల్పోయినా, అమ్మవారి నగల మూటను జాగ్రత్తగా తెచ్చి ఇచ్చాడు జటాయువు. చూసి రమ్మని నిన్ను లంకకు పంపితే, అమ్మవారు ఇచ్చిన ఉంగరాన్ని సముద్రంలో పడిపోకుండా, జాగ్రత్తగా తెచ్చి ఇచ్చావు నువ్వు. అప్పగించిన బాధ్యత కోసం బంగారు లేడిగా మారి, నా చేతిలో చచ్చాడు మారీచుడు. చివరకు రావణుడు కూడా, అమ్మవారి బంగారానికి ఆశ పడలేదు. నా విగ్రహాన్ని చూపించి, ఈ కలియుగంబులో రామ భక్తి ముసుగులో ఈ ద్రోహులు, దొంగలు చేస్తున్న దుర్మార్గాన్ని చూసి, ఇక్కడ ఉండలేకపోతున్నాను..హనుమా!"-- భుజం మీద తల ఆనించి విలపించాడు రాముడు.
"జగద్రక్షకా! తమరు విలపించుట యుగ ధర్మం కాదు. తలుచుకుంటే, నమ్మిన నీ భక్తుల కళ్ళు తెరిపించి, కోదండాన్నే చైతన్యంగా మార్చి, ప్రజా రాముడుగా వర్థిల్లగలవు."
"భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండా! "--పద్యం పూర్తి కాకుండానే, శ్రోతలు లేచిపోయి " రామ ద్రోహులు నశించాలి.. నశించాలి " అంటూ, ఆవేశంతో ఊగిపోవడం ప్రారంభించారు. పరిస్థితి గమనించిన భాగవతార్, మంగళ హారతి అందుకున్నారు.
" పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు.. శుభ మంగళం .. జయ మంగళం "
- ' నల్లి ' కుట్టు







కామెంట్‌లు (0)