మాతృదేశ విముక్తి కోసం పోరాడి ప్రాణాలర్పించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు). 1922-24 మధ్య ఆయన నాయకత్వంలో సాగిన పోరు ఒక కెరటమై ఉప్పొంగింది. అల్లూరిలో నరనరాన సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉంది. ‘బ్రిటీష్ సామ్రాజ్యవాదీ! ఈ దేశాన్ని వదిలి వెళ్లు’ అని గర్జించాడు. మాతృదేశ విముక్తిని దేశభక్తిగా చాటుకున్నాడు. అనేక కష్టాలకోర్చి దేశంలో అనేక ప్రాంతాలు కాలి నడకన పోయి పరిస్థితులు పరిశీలించి ఆకళింపు చేసుకున్నాడు. స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా కఠోర శ్రమ, నియమబద్ధ జీవితం అలవర్చుకున్నాడు. గిరిజనులు, పేదల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయాడు. కేవలం చలించి మిన్నకుండటం కాకుండా కార్యాచరణకు ఉపక్రమించాడు. బాధలు అనుభవిస్తున్న, దోపిడీకి గురవుతున్న జనం పట్ల జాలి, కరుణ, ప్రేమ, వాత్సల్యం చూపించాడు. వారికి చేరువయ్యాడు. వారిలో ఒకడయ్యాడు. సాయం చేయడం, చిన్న చిన్న చిట్కాలతో ఆకు పసర్ల వైద్యం, అక్షరాలు నేర్పడం, చెడు అలవాట్లు మానేయాలని బోధించడం వంటివి చేశాడు. మద్యం మాన్పించి మత్తు వదిలించి తాము చేస్తున్న శ్రమ, గురవుతున్న లైంగిక దోపిడీ, భరిస్తున్న అవమానాలు, చిత్రహింసలపై తిరుగుబాటు బావుటా ఎగురవేయించాడు. గిరిజనుల పల్లె పండుగలు, వనదేవతల ఆరాధన, సాంస్కృతిక జీవనంతో మమేకమై వారిని ఐక్యపరిచాడు. ఆధిపత్య సామాజిక కులంలో పుట్టినా అణగారిన ఆదివాసుల విముక్తే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేశాడు. అమాయక సామాన్య ప్రజలను పోరాటానికి సమీకరించి అసమాన పోరాట యోధులుగా తీర్చిదిద్దాడు. మట్టి నుంచి మాణిక్యాల్లా విప్లవకారులను తయారు చేశాడు. విప్లవ శంఖం పూరించాడు. 1917లో లెనిన్ సారథ్యంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగిన సోవియట్ విప్లవ ప్రభావం, ప్రప్రథమ సోషలిస్టు రాజ్య వెలుగు కిరాణాల కాంతితో ప్రభావితమై క్రాంతికారుడయ్యాడు.
ఆదివావాసులకు జన్మత: అడవిపై ఉన్న హక్కులను, చట్టాలను వివరించాడు. కోల్పోయినవాటిని తిరిగి పొంది కాపాడుకోవాల్సిన కర్తవ్యాన్ని బోధించాడు. దోపిడీదారుల పట్ల తల వంచని గిరిజనులను సమీకరించి, సమైక్యపరిచి ధీరత్వం, మనోధైర్యంతో తెగించి పోరాడేలా బోధించాడు. ధిక్కార స్వరంతో గర్జించేలా చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వ, కాంట్రాక్టర్ల దోపిడీకి, దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు, స్ర్తీలను గురి చేస్తున్న చిత్రహింసలకు వ్యతిరేకంగా ఇక గాంధీజీ మార్గం కాదని ప్రజా సాయుధ ప్రతిఘటన, తిరుగుబాటు అవసరమని భావించాడు. దేశంలోని అనేక విప్లవ సంస్థలు, విప్లవకారుల అనుభవాలు స్వీకరించాడు. రాళ్లు, కర్రలు, బాణాలతో మాత్రమే శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించలేమని నిర్ణయానికి వచ్చాడు. ఆయుధాలు సంపాదించడం కోసం ప్రజల భాగస్వామ్యంతో ప్రయత్నించాడు. పోలీస్ స్టేషన్లపై దాడికి వస్తున్నామని గుండె ధైర్యంతో సాహసోపేతంగా మిరపకాయ టపా పేరుతో ముందే వర్తమానం పంపేవాడు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల లెక్కలు రాసి మరీ ఇచ్చేవాడు. విప్లవకారుల ధీరత్వంతో జయజయ ధ్వానాలతో దండయాత్రలా కొనసాగించాడు. బ్రిటిష్ అధికారుల గుండె గుభేల్ మనిపించాడు. స్ర్తీలు, పిల్లలు, వృద్ధుల పట్ల జాలి, ప్రత్యేక శ్రద్ధ కనపర్చాడు అల్లూరి.
పోరాటంలో మొదట్లో విజయాలతో పాటు రాను రాను అపజయాలు ఎదురయ్యాయి. తోటి సహచరులు కొందరు పోరులో ఒరిగిపోయారు. ఒకరిద్దరు ముఖ్యులే ద్రోహులుగా మారి లొంగిపోయారు. అయినా నాయకుడైన అల్లూరి నిరుత్సాహపడలేదు. కుంగిపోలేదు. ప్రజల పరాక్రమంతో ముందుకే పోయాడు. బ్రిటిష్ పాలకులు వందల ఎకరాల భూమి, లక్షల రూపాయల డబ్బు, రాజ్యం, పాలనాధికారం లాంటి ఎరలు, కుత్సిత ఆశ ప్రలోభాలు చూపినా లొంగిపోలేదు. అమ్ముడుపోలేదు. ప్రాణం పోతుందని తెలిసినా వెన్ను చూపలేదు. వృద్ధురాలైన కన్న తల్లి ‘నాయనా ఇక ఇంటికి రా...’ అని కన్నీటితో వేడుకున్నా కరిగిపోలేదు. కర్తవ్య దీక్ష, ఆశయ సాధన పైచేయి సాధించే మనోనిబ్బరం, దృఢత్వంతో వ్యవహరించాడు. నాయకత్వ స్థానంలో ఉండి తనని నమ్ముకున్న ప్రజలకు ద్రోహం చేసేలా మానసిక దుర్భలత్వానికి గురవలేదు. సరైన నాయకుని లక్షణాన్ని నిరూపించుకున్నాడు. అత్యున్నత త్యాగమైన ప్రాణ బలిదానానికే సిద్ధపడ్డాడు. పిరికిపందగా లొంగిపోలేదు. పోరాటం తీవ్ర కష్టాల్లో, చిక్కుల్లో చిక్కుకున్నపుడు ప్రజలు చిత్రహింసలకు గురవుతున్నప్పుడు, గూడాల గృహ దహనాలు కొనసాగుతున్నప్పుడు తన బలిదానం ఎత్తుగడతో ప్రజల రక్షణకే ప్రాధాన్యమిచ్చాడు. అసలు సిసలు పోరాట యోధుడుగా అమరుడయ్యాడు.
ప్రజల కోసం ప్రజా ఉద్యమాల్లో పని చేసే కార్యకర్తలందరికి విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు నుండి పై లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలి. స్ఫూర్తి పొందాలి. కేంద్ర, రాష్ర్ట పాలకులు సామ్రాజ్యవాదులకు దాసోహం కావడం, అడుగులకు మడుగులొత్తడం, దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తీయడం సిగ్గు చేటు. ఆదివాసుల అటవీ సంపదను, హక్కులను కాపాడాలి. దేశ సంపదను అంబానీ, అదానీ ఇతర స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు లూటీ చేయడం మానాలి. గిరిజనులు, దళితులు, అణగారిన తరగతులు, స్ర్తీలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. సామాజిక న్యాయం పీక నొక్కడం కాకుండా కాపాడాలి. ప్రశ్నకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడం కాదు. స్వేచ్ఛ కల్పించాలి. సామాజిక అంతరాలు, అసమానతలు పోగొట్టాలి. అల్లూరి విగ్రహాలకు దండలు వేసి కీర్తించి దండాలతో సరిపెట్టడం సరికాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు కపటత్వంతో నిర్వహించడం కాదు. గాడ్సేలను, సావర్కర్ లను ఊరేగిస్తూ గాంధీని మరోసారి హత్య చేయడం కాకుండా మత సామరస్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడాలి. విద్యార్థులు, యువజనులు అల్లూరి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, కన్నెగంటి హనుమంతు, రాజ్ గురు, సుఖ్ దేవ్, ఝాన్సీలక్ష్మి, సుభాష్ చంద్రబోస్, కొమరం భీమ్, అస్ఫుల్లా ఖాన్, అంబేద్కర్, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారిని ఆదర్శంగా 'రియల్ హీరోలు`గా చూడాలి. వారి జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేయాలి. వారి ఆదర్శలను, త్యాగాలను అలవర్చుకోవాలి. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రత కల్పించే సమాజం, మెరుగైన జీవనం కోసం అల్లూరి స్ఫూర్తితో పోరాడాలి. లక్షల మందిని బలి తీసుకుంటున్న అమెరికా సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుద్ధాలను వ్యతిరేకించాలి. శాంతి కోసం నిలబడాలి.
- వ్యాసకర్త: బి.బలరాం, సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు







కామెంట్‌లు (0)